
రాపూరు/తిరుపతి అర్బన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగు గంగలో ప్రధాన భాగమైన కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి సోమవారం చెన్నై నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు జలాలను విడుదల చేశారు. తెలుగు గంగ చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి మూడో గేట్‌ను ఎత్తి నీటిని వదిలారు.
అనంతరం హరినారాయణరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నై నగర వాసులకు నీటిని విడుదల చేస్తున్నామని, సెప్టెంబర్ వరకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. జలాశయం నుంచి మొదటిసారిగా రెండో పంటకు నీరు విడుదల చేసినట్టు తెలిపారు. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు 20 టీఎంసీలు విడుదల చేస్తున్నామన్నారు. సోమశిల నుంచి కండలేరుకు వచ్చే నీటి కాలువ వెడల్పు పెంచే పనులు ప్రారంభమయ్యాయని, మూడేళ్లలో ఇవి పూర్తవుతాయని హరినారాయణరెడ్డి వివరించారు.