
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను భారతరత్న అవార్డు ఇవ్వాలని లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎస్పీ చరణ్ అన్నారు. భారతరత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం అందగానే ఎంతో సంతోషించానని ‘సాక్షి’తో చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం హెల్త్‌కేర్ అస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని అన్నారు.
వదంతులు నమ్మెద్దు
బాలసుబ్రహ్మణ్యం వైద్యసేవలకు అయిన ఖర్చు గురించి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని ఎస్పీ చరణ్ అన్నారు. అటువంటి వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లు చెల్లించిన తర్వాతే తన తండ్రి భౌతిక కాయాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టినట్లు, తాము ఉపరాష్ట్రపతికి ఫోన్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ప్రతి వారం తాను కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చానని తెలిపారు. చివరి రోజున ఇంకా ఎంత బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉందని ఆస్పత్రి నిర్వాహకులను అడిగితే వారు ఏం చెల్లించవద్దు..ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండని చెప్పారన్నారు. వైద్య ఖర్చుల్లో కొంత ఇన్‌సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు చరణ్ చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తాను ప్రభుత్వాన్ని సాయం కోరిన విషయం వాస్తవమేనని, ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించడమే అందుకు కారణమన్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శిని సంప్రదించగా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి చెబుతానన్నారని తెలిపారు.
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: కమల్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతటా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.