
తగ్గిన వ్యాపార విశ్వాసం
జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం తగ్గుదల నమోదయ్యింది.
న్యూఢిల్లీ: జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం తగ్గుదల నమోదయ్యింది. కంపెనీలు కొత్తగా అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)కి అనుగుణంగా ముందుకు వెళ్లడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుండటం దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌కి సంబంధించి డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కంపోసైట్ బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్ 72.1 వద్ద ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇండెక్స్‌లో 13.3 శాతం క్షీణత నమోదయ్యింది.
పెద్ద పెద్ద కంపెనీలు జీఎస్‌టీ మార్పుకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాయని, కానీ చిన్న, మధ్య స్థాయి సంస్థల్లో ఈ పరిస్థితి లేదని, వీటికి కొంత సమయం పడుతుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ సిన్హా తెలిపారు. డిమాండ్ సంబంధిత ఆందోళనలు, కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి పలు ఇతర అంశాలు కూడా వ్యాపార విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొన్నారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఆరు ఆప్టిమిజమ్ ఇండెక్స్‌లకు గానూ నాలుగింటిలో తగ్గుదల కనిపించిందన్నారు.