ఆనంద్ (శర్వానంద్) సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. క్లీన్‌గా ఉండకపోతే అతనికి నచ్చదు. క్యాప్ లేని పెన్‌ను చూస్తే తనే వెళ్లి క్యాప్ పెడతాడు. పక్కవాళ్ల బైక్‌కు బురద అంటితే క్లీన్ చేస్తానంటాడు. అంతెందుకు గర్ల్‌ఫ్రెండ్‌కు కిస్ చేయాలనుకున్నా బ్రెష్ చేశావా? అని అడిగే టైప్. హ్యాండ్స్‌కు గ్లౌజ్ వేసుకుంటాడు. అతనెందుకిలా ప్రవర్తిస్తున్నాడంటే అతనికి ఓసీడీ. ఆనంద్‌కి మేఘన (మెహరీన్) అంటే ఇష్టం. మేఘనకు కూడా ఇష్టమే. హ్యాండ్‌వాష్ చేసుకుంటేగానీ ఏదీ ముట్టని మనోడు ఆ అమ్మాయి చేయిపట్టుకుని ఏడడుగులు ఎలా నడిచాడన్నదే మహానుభావుడైన ఆనంద్ కథ.
‘‘హీరో అంటేనే స్పెషల్. నిజ జీవితంలో మనకన్నా వాళ్లు ఎప్పుడూ స్పెషలే. హీరో క్యారెక్టర్‌కు ఓసీడీ (అతిశుభ్రత) అనగానే, ఇది మలయాళ సినిమాకు రీమేక్ అని ఎలా అంటారు? ‘మహానుభావుడు’ చూశాక నిర్ణయిస్తే బెటర్’’ అని దర్శకుడు మారుతి అన్నారు. శర్వానంద్, మెహరీన్ జంటగా ఆయన దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మహానుభావుడు’ నేడు విడుదలవుతోంది. మారుతి మాట్లాడుతూ– ‘‘మనుషుల అలవాట్లు, గుణాల మీద చాలా కథలు రాసుకోవచ్చు. అలాంటి కథల్లో ‘మహానుభావుడు’ ఒకటి.
నాలుగేళ్ల క్రితం ఈ కథ అనుకున్నా. అఖిల్‌కి సరిపోతుందని నాగార్జునగారికి చెప్పాను. నాకు చాలా మంది ఓసీడీ లక్షణాలున్నవారు తెలుసు. కొందరు చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. మరికొందరు అతి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆయా లక్షణాలను బట్టి వాళ్లను వర్గీకరించవచ్చు. మిగిలిన హీరోలు ఆ పాత్రలను తమ స్టైల్‌కి తగ్గట్టు మార్చుకుని చేస్తారు. శర్వానంద్ మాత్రం పాత్రలోకి పరకాయప్రవేశం చేసి, చేస్తారు. ఇతర హీరోలకీ శర్వాకి తేడా అదే. ‘బాబు బంగారం’ చిత్రంలో వెంకీ పాత్రను అనుకున్న రీతిలో స్క్రీన్ మీదకు తీసుకురాలేకపోయాను. మిగిలిన విషయాల్లో అందరూ హ్యాపీ’’ అన్నారు.