డ్రగ్స్ కేసు: ముగిసిన పూరీ విచారణ
- జగన్నాథ్‌ను10 గంటలపాటు ప్రశ్నించిన సిట్
- సూత్రధారి కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వినియోగంపై ఆరా
- దర్శకుడి రక్త నమూనాలు సేకరించిన వైద్యులు!
- ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో సాగిన ప్రశ్నావళి
- వివరాలు వెల్లడించడం కుదరదన్న ఎక్సైజ్ కమిషనర్
- రేపు శ్యామ్ నాయుడును, అటుపై మరింత మందిని ప్రశ్నించనున్న అధికారులు
హైదరాబాద్: రాజధాని నగరాన్ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 10:30గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చిన పూరీని సిట్ అధికారులు 10 గంటలపాటు విచారించి, రాత్రి 8:40కి విచారణ ముగిసింది.
విచారణ క్రమంలో డ్రగ్స్ వాడకం, దందా వ్యవహారంలో దర్శకుడి పాత్రకు సంబంధించిన అనేక ప్రశ్నలను అధికారులు సంధించారు. పూరీని ప్రశ్నించిన అధికారుల బృందానికి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షించారు.
కాగా, డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో పూరీ జగన్నాథ్‌కు ఉన్న సంబంధం ఏమిటనేది తెలియాల్సిఉంది. ఈవెంట్ మేనేజర్‌గా మాత్రమే కెల్విన్ తనకు తెలుసని, డ్రగ్స్ దందాతో సంబంధం లేదని పూరీ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విశయాలను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఎక్సైజ్ శాఖ కమిషర్ చంద్రవదన్ మీడియాతో అన్నారు.
బ్లడ్ శాంపిల్స్ సేకరణ!
దర్శకుడు పూరీ జగన్నాథ్ మాదకద్రవ్యాలను తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని రూఢీ చేసేందుకుగానూ ఆయన రక్త నమూనాలను సేకరించినట్లు తెలిసింది. సిట్ కార్యాలయానికి వచ్చిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు.. బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం.