డ్రగ్స్‌పై యుద్ధభేరి
మూలాలు ఎక్కడున్నాయో అంతుబట్టని వేయి తలల విష సర్పంలాంటి మాదక ద్రవ్య మహమ్మారి నానాటికీ వేగంగా విస్తరిస్తున్నదే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనో, ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ఏజెన్సీలోనో దాని జాడలు కనిపించాయని వెల్లడైనప్పుడు అందరూ విస్తు పోతున్నారు. మళ్లీ ఎప్పుడో, ఎక్కడో భళ్లున బద్దలయ్యేవరకూ అంతా సవ్యంగా ఉన్న దనుకుంటున్నారు. నిరుడు బెంగళూరుకు చెందిన సైంటిస్ట్, వైమానిక దళ వింగ్ కమాండర్ హైదరాబాద్‌లో అరెస్టయినప్పుడు మాదకద్రవ్యాల గుట్టురట్ట యిందని అందరూ అనుకున్నారు. అంతకు చాన్నాళ్ల ముందు సినీ రంగానికి చెందినవారు పట్టుబడినప్పుడు కూడా అలాగే భావించారు. కానీ ప్రతీసారీ నిరాశే మిగులుతోంది.
తాజాగా హైదరాబాద్ నగరంలో స్కూల్ విద్యార్థులు మొద లుకొని ఇంజనీరింగ్ విద్యార్థుల వరకూ... సినీ రంగానికి చెందినవారు మొద లుకొని కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారి వరకూ అందరి కందరూ దీని ఉచ్చులో చిక్కుకుంటున్నారని వచ్చిన వార్తలు కలవరం కలి గిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్లుగా భుజకీర్తులు తగిలించుకుంటున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎలాంటి ‘అంతర్జాతీయత’ ఉంటుందో, ఏ బాపతు విద్యను బోధిస్తున్నారో తెలియదుగానీ ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు మాత్రం అక్కడి పిల్లలకు సునాయాసంగా లభిస్తున్నాయని అర్ధమవుతోంది. హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న తొమ్మిది కార్పొరేట్ స్కూళ్లు, 16 కళాశాలలు మాదకద్రవ్య ముఠాలకు లక్ష్యాలుగా మారాయని తెలిసినప్పుడు ఎవరికైనా విస్మయం కలగకమానదు. లోకమంటే ఏమిటో పూర్తిగా అవగాహనలేని తొమ్మిదో తరగతి విద్యార్థిని కేవలం పది రోజుల వ్యవధిలోనే మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకున్న తీరు, అవి లేకుండా బతకలేననుకోవడం గమనిస్తే కడుపు తరుక్కు పోతుంది. నిండా పదిహేనేళ్లు లేని ఆ బాలిక మత్తు పదార్ధాల కోసం సరఫరా దార్లకు తన నగ్నచిత్రాన్ని వాట్సాప్‌లో పంపి బతిమాలుకున్నదంటే పరిస్థితి ఎంత విషమించిందో తెలుస్తుంది.
ఎవరి పిల్లలు వారికి ఎంత ఈడుకొచ్చినా పసిమొగ్గలుగానే కనబడతారం టారు. కానీ ఈ పిల్లల సంగతి చూస్తుంటే అటు తల్లిదండ్రులూ వారిని సరిగా పట్టించుకోవడం లేదు... ఇటు పాఠశాలల్లోనూ ఆ విద్యార్థులకు సరైన మార్గ దర్శకత్వం లభించడం లేదని అర్ధమవుతుంది. మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నవారిని పసిగట్టడం కష్టమేమీ కాదు. వారేమీ ఏకదంత ప్రాకారాల్లో కాలక్షేపం చేయరు. అటు ఇంట్లో లేదా ఇటు పాఠశాలలో ఉంటారు. అయినా మాదకద్రవ్యాలు వారికి చేరుతున్నాయంటే ఈ రెండుచోట్లా వారిపట్ల నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని అనుకోవాలి. వ్యాపారాలుండొచ్చు... తీరికలేని స్థాయిలో వ్యవహారాలుండొచ్చు కానీ తమ కన్నబిడ్డలు ఏం చదువుతున్నారో, ఎలాంటి నడవడికను అలవరుచుకుంటున్నారో, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలు సుకోవడం తమ బాధ్యతని తల్లిదండ్రులు భావించడంలేదు. తాము రోజూ తరగతి గదిలో చదువు చెప్పే పిల్లల తీరు ఎలా ఉంటున్నదో, ఏయే విషయాల్లో వారికి కౌన్సెలింగ్ అవసరమో టీచర్లు తెలుసుకోలేకపోతున్నారు. విద్యార్థులతో ఆ టీచర్లకు స్నేహపూర్వక సంబంధాలుంటే తమలో కొందరు విపరీతంగా ప్రవ ర్తిస్తున్న వైనాన్ని లేదా డ్రగ్స్‌కు బానిసలవుతున్న తీరును తోటి పిల్లలువారి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదీ జరగడం లేదంటే ఆ పాఠశాలలు ఎలాం టివో, అక్కడ ఆ పిల్లలు నేర్చుకునేదేమిటో సులభంగానే అంచనా వేయొచ్చు. సంపన్న కుటుంబాల్లో పాకెట్ మనీ పేరిట, వాహనాలకయ్యే పెట్రోల్ కోసమని ఇస్తున్న డబ్బులు మత్తు పదార్థాలకు ప్రధాన వనరుగా ఉంటున్నాయి. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలు నడిచే సినీ పరి శ్రమ, రియల్‌ఎస్టేట్ రంగాలు, లక్షల్లో జీతాలొచ్చే సాఫ్ట్‌వేర్ కంపెనీలు డ్రగ్స్ మాఫి యాకు ఊపిరిపోస్తున్నాయి. పాఠశాలల చుట్టుపక్కల ఉండే దుకాణాల్లో అమ్మే చాక్లెట్లతో మొదలుపెట్టి పబ్ లలో పంపిణీ చేసే మద్యం వరకూ అన్నిటా మత్తు పదార్థాలు కలుస్తున్నాయి. విద్యార్థులను బానిసలుగా చేస్తున్నాయి.
మాదకద్రవ్యాల మాఫియా హైదరాబాద్ నగరంలో అల్లుకున్న వైనం గమ నిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎక్కడో మారుమూల ఏం జరుగుతున్నదో తెలి యడం లేదంటే అర్ధం చేసుకోవచ్చు. అన్ని రకాలైన నిఘా వ్యవస్థలూ పని
చేసే నగరాల్లో సైతం చీకట్లో తడుములాట మాదిరి ఉన్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు అందుకుని పరాయి దేశాల్లో ఉంటున్న మాఫియాలు ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వగైరా మాదకద్రవ్యాలను కొరియర్ ద్వారా సరఫరా చేస్తుండటం, ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని వందలాదిమందికి చేరేయడం దిగ్భ్రాంతికరం. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత అధిక సంఖ్యలో ఉన్న అయిదు దేశాల్లో మన దేశం కూడా ఒకటని గుర్తుంచుకుంటే
ఆ విషయంలో ప్రభు త్వాలుగానీ, విద్యాసంస్థలుగానీ, తల్లిదండ్రులుగానీ ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలుస్తుంది. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్, ఇరాన్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి మాత్రమే కాదు... అమెరికా, బ్రిటన్ తదితర దేశాల నుంచి కూడా ఈ మాదకద్రవ్యాలు దేశంలోకి వచ్చిపడుతున్నాయి. పంజాబ్ యువతలో 70 శాతంమంది డ్రగ్స్ వినియోగి స్తున్నారని ఆ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కొన్నేళ్లక్రితం న్యాయస్థానానికి నివేదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న మాఫియా ముఠాలు దుబాయ్, సింగపూర్, కువైట్‌లాంటిచోట్లకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు చెబు తున్నారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరాలో కేవలం డబ్బాశతో ఉండే మాఫియాలు మాత్రమే కాదు... ఉగ్రవాద ముఠాలు కూడా అల్లుకుని ఉన్నాయి. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి సమగ్ర వ్యూహ రచన చేస్తే తప్ప మాదకద్రవ్య మూలాలను దుంపనాశనం చేయడం సాధ్యం కాదని తెలుసు కోవాలి. దానిపై యుద్ధభేరి మోగించాలి.