సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్ రిపోర్ట్‌లో పేర్కొంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. దీంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. అయితే చార్జిషీట్లలో సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసినట్టు సమాచారం. కేసులో హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
డ్రగ్స్‌కేసు : సినీ సెలబ్రెటీలు నిందితులు కాదు.. బాధితులే..
Comments
Please login to add a commentAdd a comment