అకున్‌.. పూరీ.. ఓ పది గంటలు | drugs case : purijagnnath enquried by sit | Sakshi
Sakshi News home page

అకున్‌.. పూరీ.. ఓ పది గంటలు

Published Thu, Jul 20 2017 1:12 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

అకున్‌.. పూరీ.. ఓ పది గంటలు - Sakshi

అకున్‌.. పూరీ.. ఓ పది గంటలు

సిట్‌ సవాలు.. మీకు కెల్విన్‌ తెలియదా..? అయితే ఈ ఫొటోలేంటి?
పూరి జవాబు.. పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్‌ తీసుకున్నట్టా?

  డ్రగ్స్‌ కేసులో పూరీ జగన్నాథ్‌ను 10 గంటలపాటు సిట్‌ విచారణ
  కెల్విన్‌తో సంబంధాలు, ఫోన్‌కాల్స్, ఫొటోలపై 45 ప్రశ్నలు
  జీశాన్‌తో పరిచయం వెనక ఆంతర్యం ఏంటి?
⇒  బ్యాంకాక్‌ షూటింగ్‌లకు కెల్విన్‌ ఎందుకు వచ్చాడు?
  కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా మాత్రమే తెలుసునన్న డైరెక్టర్‌
  అరగంటకోసారి విచారణను పర్యవేక్షించిన అకున్‌ సబర్వాల్, చంద్రవదన్‌
రక్త నమూనాలు సేకరించిన వైద్యులు
అరెస్ట్‌ చేస్తారని ఊహాగానాలు.. తోసిపుచ్చిన అధికారులు
  నేడు సిట్‌ ముందుకు శ్యాం కె.నాయుడు


సాక్షి, హైదరాబాద్‌
డ్రగ్స్‌ వ్యవహారంలో బుధవారం సిట్‌ ఎదుట విచారణకు హాజరైన ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ను అధికారులు రోజంతా విచారించారు. ఇచ్చిన సమయం కంటే ముందే విచారణకు హాజరైన ఆయన్ను ఎక్సైజ్‌ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయంలో ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలు, జీశాన్‌తో లింకు, హీరోయిన్‌ చార్మి, హీరోలు రవితేజ పలువురు నటీనటులకు డ్రగ్స్‌ సరఫరా వంటి ఆరోపణలపై అధికారులు విచారించినట్టు తెలిసింది. ఉదయం 10 గంటలకే తనయుడు ఆకాశ్, సోదరుడు సాయిరాం శంకర్‌తో కలసి ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్న పూరి జగన్నాథ్‌ను.. సిట్‌ అధికారులు 10.15 నుంచి రాత్రి 8–45 గంటల దాకా విచారించారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయన స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకొని విడిచిపెట్టారు. కెల్విన్‌తో పరిచయం ఏంటి? ఎందుకు అన్నిసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు? వాట్సాప్‌ ద్వారా ఎందుకు చాటింగ్‌ చేశారు? తదితర అంశాలను ప్రస్తావించారు.

కెల్విన్‌ డ్రగ్స్‌ సరఫరా చేశాడా అని ప్రశ్నించగా.. అతడు ఈవెంట్‌ మేనేజర్‌గానే తెలుసునని, పబ్‌లలో షూటింగ్‌ల కోసం సంప్రదించి ఉంటానని పూరి సమాధానమిచ్చారు. తాను కేవలం కుటుంబ సభ్యులు, సినిమా వాళ్లతోనే తన ఫోన్‌ ద్వారా మాట్లాడతానని, మిగతా కాల్స్‌ అన్ని తమ మేనేజర్లు చూసుకుంటారని అధికారులకు తెలిపారు. చాలామంది నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినా తాను షూటింగ్‌ల్లో బిజీగా ఉండటం వల్ల మేనేజర్లు అటెండ్‌ చేస్తారని చెప్పారు. తొలుత 2 గంటల పాటు సిట్‌ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ వచ్చిన పూరి జగన్నాథ్‌ను టీ బ్రేక్‌ తర్వాత మరో బృందం విచారించింది. మొత్తంగా అధికారులు 45 ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.

పరిచయం ఉంటే డ్రగ్స్‌ తీసుకున్నట్టా?
కెల్విన్‌తో పరిచయం లేదని మొదట చెప్పిన పూరి జగన్నాథ్‌.. ట్రీ బ్రేక్‌ తర్వాత సిట్‌ అధికారులు అతడితో ఉన్న ఫోటోలను చూపించడంతో కాస్త తడబడ్డారు. కెల్విన్, పూరి జగన్నాథ్, చార్మి కలసి దిగిన సెల్ఫీ ఫొటోలు అధికారులు చూపారు. దీంతో కెల్విన్‌తో తనకు పరిచయం ఉందని, అయితే అది కేవలం ఈవెంట్‌ మేనేజర్‌గా మాత్రమే తెలుసునని, అంతకు మించి డ్రగ్స్‌ వ్యవహారంలో అతడితో ఎలాంటి వ్యవహారాలు లేవని వెల్లడించినట్టు తెలిసింది.

తాను తీసే అనేక సినిమాల్లో పబ్బులు, క్లబ్బుల సీన్లు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల వాటి వ్యవహారాల్లో కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేయడంతో అతడిని కలవడం లేదా సంప్రదించడం జరిగి ఉండొచ్చని అధికారులకు వివరణ ఇచ్చారు. ‘కెల్విన్‌తో పరిచయం ఉన్నంత మాత్రాన నేను డ్రగ్స్‌ తీసుకున్నట్టా? నాతో కలసి ఉన్నవారు, నాకు పరిచయం ఉన్నవారు నాకు తెలియకుండా చేసే పనులకు నేను బాధ్యుడను అవుతానా..?’ అంటూ సిట్‌ అధికారులను విచారణలో తొలి రెండు గంటలు పూరి డిఫెన్స్‌లోకి నెట్టినట్టు తెలిసింది.

వాట్సాప్‌లో కోడ్‌ లాంగ్వేజ్‌ ఏంటి?
కెల్విన్, పూరి జగన్నాథ్‌ మధ్య వాట్సాప్‌లో జరిగిన కోడ్‌ లాంగ్వేజ్‌పైనా సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. డ్రగ్స్‌ వ్యవహారంలో కెల్విన్‌ వాడిన టాటూ, బ్లాసమ్‌ పదాల గురించి చెప్పాలని సిట్‌ అధికారి శీలం శ్రీనివాస్‌.. పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనిపై పూరి జగన్నాథ్‌ స్పందిస్తూ తనకు ఆ పదాలు అంత పెద్దగా గుర్తులేదని, అసలు ఆ పదాలకు అర్థమేంటో తెలియదని చెప్పినట్టు సమాచారం. పదేపదే కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో పూరి జగన్నాథ్‌ డబ్బులు డిపాజిట్‌ చేసిన అంశంపై కూడా అధికారుల బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. డబ్బుల వెనకున్న వ్యవహారాలు ఏంటి? డ్రగ్స్‌ విషయంలోనే డబ్బులు వేశారా? అని అడిగినట్టు సమాచారం.

తన జ్యోతిలక్ష్మి సినిమాకు ఈవెంట్‌ చేశాడు కాబట్టి ఆ వ్యవహారంలోనే మేనేజర్లు డబ్బులు వేసి ఉంటారని పూరి జగన్నాథ్‌ సమాధానం ఇచ్చినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. గోవా, బ్యాంకాక్‌లలో సినిమా షూటింగ్‌ సమయాల్లోనూ కెల్విన్, జీశాన్‌ ఇద్దరూ మీతో పాటే ఉన్నారు కదా అని ప్రశ్నించగా.. వారు ఈవెంట్స్‌ కోసం వచ్చారని, అంతకు మించి వారితో తనకు మిగతా విషయాల్లో సంబంధాలు లేవని పూరి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది సార్లు ఆన్‌లైన్‌ నగదు బదిలీ జరగడంపై ప్రశ్నించగా.. సినిమా కోసం పని చేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటామని పూరి జగన్నాథ్‌ ఎదురు ప్రశ్న వేసినట్లు తెలిసింది.

లంచ్‌ తర్వాత మారిన సీన్‌
మధ్యాహ్నం 1.15 వరకు సిట్‌ అధికారులు శీలం శ్రీనివాస్‌ బృందం, అంజిరెడ్డి బృందం విచారించాయి. లంచ్‌ తర్వాత 2 గంటలకు తిరిగి విచారణ ప్రారంభించిన శ్రీనివాస్‌రావు బృందం.. ఉదయం నుంచి జగన్నాథ్‌ చెప్పుకొచ్చిన అంశాలపై ఆధారాలు చూపిస్తూ తిరిగి ప్రశ్నించినట్టు తెలిసింది. గడచిన ఏడాది కెల్విన్‌ బ్యాంకాక్‌ టూర్‌ గురించి ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. సినిమా బృందంలో సభ్యుడిగానే కెల్విన్‌ బ్యాంకాక్‌ వచ్చాడా? అని పదేపదే సిట్‌ బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. ఈవెంట్‌ మేనేజర్‌గా ఆయనకు అన్ని ప్రాంతాల్లో పరిచయాలు ఉంటాయని, అందులో భాగంగానే వచ్చి ఉంటాడని జగన్నాథ్‌ అధికారులకు చెప్పినట్టు తెలిసింది.

క్లైమాక్స్‌ను తలపించిన సీన్‌
ఉదయం నుంచి ప్రతీ అరగంటకోసారి విచారణ తీరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ పర్యవేక్షించారు. ఇక సాయంత్రం ఇక విచారణ ముగుస్తుందని భావించిన నేపథ్యంలో అకున్‌ సబర్వాల్‌ రంగంలోకి దిగినట్టు తెలిసింది. సిట్‌ అడిగిన 45 ప్రశ్నలకు పూరి జగన్నాథ్‌ పూర్తి సమాధానాలు చెప్పకపోవడంతో 5 గంటల తర్వాత కూడా విచారించారు. అకున్‌ సబర్వాల్‌ నేరుగా జగన్నాథ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. సాయంత్రం 6 దాటినా విచారణ కొనసాగడంతో పూరి జగన్నాథ్‌ భార్య, మేనమామ, బంధువులు ఎక్సైజ్‌ ఆఫీసుకు చేరుకున్నారు. మళ్లీ విచారణ మొదలుపెట్టడంతో కుటుంబీకులు, అభిమానుల్లో అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళ న కనిపించింది. దీనికి బలం చేకూర్చేలా కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు రావడం, ఆ వెంటనే ఉస్మానియా జనరల్‌ సర్జన్‌ రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. పూరిని అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాము ఇప్పుడు అరెస్ట్‌ చేయడం లేదని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబీకులు, అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది.

రక్త నమూనాల సేకరణ...
పూరి జగన్నాథ్‌ డ్రగ్స్‌ తీసుకున్న ట్టు వస్తు న్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు అధి కారులు ఆయన రక్త నమూనాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఉస్మానియా వైద్యులను పిలి పించారు. డ్రగ్స్‌ తీసుకున్న వ్యక్తుల బ్లడ్‌ శాంపిల్స్‌లో 3 నెలల వరకు డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపిస్తాయని, అందుకే ఆయన రక్త నమూనాలు సేకరించామని  ఓ అధికారి తెలిపారు.

టీ బ్రేక్‌ తర్వాత ఉత్కంఠ
పూరి జగన్నాథ్‌కు 3.15 గంటలకు ట్రీ బేక్‌ సమయం ఇచ్చి 3.30కి మళ్లీ విచారణ ప్రారంభించారు. డ్రగ్‌ పెడ్లర్‌ జీశాన్‌తో సంబంధాలపై ప్రశ్నించగా.. అతడు కూడా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లోనే తెలుసని, అంతకుమించి అతడితో పెద్దగా పరిచయం లేదని పూరి సమాధానం ఇచ్చారు. రవితేజ, జీశాన్, పూరి.. ముగ్గురు కలసి దిగిన ఫొటో చూపించి ఈ ఫొటో ఎక్కడ దిగారు? ఎప్పుడు దిగారు? అని ప్రశ్నించగా... ‘‘రోజూ ఎక్కడో ఓ చోట షూటింగ్‌ సమయంలో అనేక మంది వచ్చి ఫోటో దిగాలని కోరుతారు. కాదనలేం. ఎందరితోనో ఫోటోలు తీయించుకోవడం మాకు సాధారణ విష యం. ఆ ఫోటోలు చూపించి ఎవరని అడిగితే ఏం చెప్పగలం’’అని పూరి ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న రవితేజకు, అతడి సోదరుడు భరత్, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరాజుకు జీశాన్‌ను పరిచయం చేసింది మీరేనా అని ప్రశ్నించగా.. అతడిని మరెవరికో పరిచయం చేయాల్సినంత అవసరం తనకేం ఉంటుందని అన్నట్లు తెసింది.

మీ సినిమాల్లో డ్రగ్స్‌ స్పెషలా?
పూరి జగన్నాథ్‌ తీసిన సినిమాలన్నింటిలో డ్రగ్స్‌ వ్యవహారాలు, పబ్బులు.. ఇలాంటి సీన్లు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటని కూడా సిట్‌ బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుత జనరేషన్, ఫ్యాన్స్‌ మాస్‌ సీన్లు చూస్తేనే ఇష్టపడతారని, విలన్లను చూపించే సమయంలో అలాంటి షాట్లు చేస్తామని జగన్నాథ్‌ అధికారులకు చెప్పినట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో అవి నిజంగానే నటీనటులకు ఇస్తారన్న ఆరోపణ ఉంది నిజమేనా అని సిట్‌ బృందం ప్రశ్నించగా.. ‘‘నా సినిమాల్లో నేను ఎప్పడూ అలాంటి ప్రయోగాలు చేయలేదు. చేయను. అసలు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నా’’ అని పూరి సమాధానమిచ్చినట్లు తెలిసింది.

నేడు విచారణకు శ్యాం కె.నాయుడు
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న సినీ ప్రముఖుల్లో గురువారం విచారణకు ఎవరు హాజరవుతున్నారన్న దానిపై సంది గ్ధం ఏర్పడింది. వాస్తవానికి గురువారం హీరోయిన్‌ చార్మి హాజరు కావాల్సి ఉంది. అయితే చార్మి కాకుండా శ్యాం కె.నాయుడు విచారణకు రానున్నట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. మరో తేదీన విచారణకు హాజరవుతానని చార్మి విజ్ఞప్తి చేశారని సిట్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు విచారణకు హాజరు కావాలంటూ మూడు కొరియర్‌ సంస్థలు బ్లూడార్ట్, డీహెచ్‌ఎల్, ఫెడెక్స్‌ కంపెనీలకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. డార్క్‌నెట్‌లో ఆర్డర్‌ చేసిన డ్రగ్స్‌ను ఈ 3 కొరియర్‌ కంపెనీల ద్వారా పెడ్లర్లు తీసుకున్నట్లు సిట్‌ అనుమానిస్తోంది. చీఫ్‌ పోస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా అనుమానాస్పద పార్శిళ్లపై ని ఘా పెంచాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement