హైదరాబాద్ : ప్రముఖ హీరో రవితేజ శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న ఆయన ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ సిట్ విచారణకు వచ్చారు.
రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే కెల్విన్, జీశాన్‌తో గల సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తన కుమారుడికి డ్రగ్స్ వాడే అలవాటే లేదని, ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.