గోవా, బ్యాంకాక్‌ ట్రిప్పులెందుకు? | mumaith khan attends sit enquiry | Sakshi
Sakshi News home page

గోవా, బ్యాంకాక్‌ ట్రిప్పులెందుకు?

Published Fri, Jul 28 2017 1:13 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

గోవా, బ్యాంకాక్‌ ట్రిప్పులెందుకు? - Sakshi

గోవా, బ్యాంకాక్‌ ట్రిప్పులెందుకు?

పూరి, కెల్విన్‌ పరిచయంలో మీ పాత్రేమిటి? ముమైత్‌ఖాన్‌పై సిట్‌ ప్రశ్నల వర్షం
⇒ స్వేచ్ఛా జీవిని... పర్యటనలు నా హాబీ
⇒  ఈవెంట్‌ మేనేజర్‌గానే కెల్విన్‌ తెలుసు
⇒  సిగరెట్‌ తాగుతా.. డ్రగ్స్‌ వాడను
⇒  కావాలంటే గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ ఇస్తా
⇒ వద్దన్న సిట్‌ అధికారులు
⇒  ఆరు గంటల పాటు ముమైత్‌ విచారణ
⇒  ఆమె వెంటే బిగ్‌బాస్‌ నిర్వాహకులు
⇒ విచారణ కాగానే రాత్రి పుణేకు పయనం
⇒  నేడు సిట్‌ ముందుకు సినీ హీరో రవితేజ


సాక్షి, హైదరాబాద్‌
డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందుకు వస్తుందో రాదోననుకున్న సినీ నటి ముమైత్‌ఖాన్‌ చివరికి షెడ్యూల్‌ మేరకే విచారణకు హాజరయ్యారు. బిగ్‌బాస్‌ టీవీ షో షూటింగ్‌లో ఉన్న ఆమె గురువారం ఉదయం 10 గంటలకే నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జె.హరికృష్ణ నేతృత్వంలోని ముగ్గురు మహిళా అధికారుల బృందం ఆమెను 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 దాకా ఆరు గంటల పాటు విచారించింది. ‘‘సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కెల్విన్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకున్నట్టు మా వద్ద ఆధారాలున్నాయి. వారిద్దరి కాల్‌డేటాలో పదేపదే మీ ఫోన్‌ నంబర్‌ ఉందెందుకు? పూరికి కెల్విన్‌ కాల్‌ చేసిన వెంటనే ఒకసారి కెల్విన్‌ నుంచి, మరోసారి పూరి నుంచి మీ ఫోన్‌కు కాల్స్‌ వచ్చినట్టు కాల్‌ డేటాలో స్పష్టంగా ఉంది. దీని వెనక కారణమేమిటి?’’అంటూ ఆధారాలు ముందు పెట్టి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ‘‘నేను పూరి సినిమాల్లో ఎక్కువగా నటించా. కెల్విన్‌ ఈవెంట్‌ మేనేజర్‌ అవడం, సినీ పరిశ్రమలో బడా నిర్మాతలు, హీరోలు, దర్శకులతో పదేపదే కనిపించడం వల్ల నాకు పరిచయమయ్యాడంతే. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లు చేస్తుండటం వల్ల నాకు కాల్స్‌ చేస్తుండేవాడు. అంతకు మించి డ్రగ్స్‌ తీసుకోవడం వంటివి నాకు తెలియదు’’అని ముమైత్‌ బదులిచ్చినట్టు తెలుస్తోంది.

కెల్విన్‌ చెప్పిందంతా నిజమేనా?
డ్రగ్స్‌ దందాలో మీరూ పాత్రధారులని విచారణలో కెల్విన్‌ చెప్పాడని సిట్‌ అధికారులు ముమైత్‌ను ప్రశ్నించారు. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఎప్పట్నుంచి ఉందంటూ కూడా ప్రశ్నించినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. తెలుగు ఇండస్ట్రీతో తనకు దూరం పెరిగిందని, ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నానని ఆమె బదులిచ్చినట్టు తెలిసింది. మూడేళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాలు చేయని తనకు ఇక్కడ కెల్విన్‌ సరఫరా చేశాడంటున్న డ్రగ్స్‌తో లింకేమిటని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కావాలంటే తన కాల్‌ డేటాలో ఉన్న నంబర్లు, తన ముంబై అడ్రస్, సెల్‌ టవర్‌ లొకేషన్ల ఆధారంగా విచారించుకోవచ్చని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

సీసీ ఫుటేజులు పరిశీలించుకోవచ్చు
‘‘హైదరాబాద్‌లో ఉండగా మీరు పబ్బుల్లోనే ఎక్కువ గడిపేవారన్న వార్తలున్నాయి. ఆ సందర్భంగా డ్రగ్స్‌ అలవాటు చేసుకున్నారా?’’అని ముమైత్‌ను సిట్‌ ప్రశ్నించింది. తాను పబ్బులకు వెళ్లడం నిజమేనన్న ఆమె, తనకు సిగరెట్‌ కాల్చే అలవాటుందని, డ్రగ్స్‌ తీసుకుంటానన్న ఆరోపణ మాత్రం సరైంది కాదని చెప్పారు. కావాలంటే పబ్బుల్లోని సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చన్నారు. పదేపదే గోవా, బ్యాంకాక్, విదేశాలు ఎందుకు వెళ్తారని ప్రశ్నించగా, తాను స్వేచ్చ జీవినని, విదేశీ పర్యటనలు, కొత్త ప్రాంతాలు చూడటం హాబీ అని ముమైత్‌ బదులిచ్చారు. తాను డ్రగ్స్‌ తీసుకున్నట్టు అనుమానాలుంటే తన రక్తనమూనాలతో పాటు గోర్లు, వెంట్రుకల శాంపిల్స్‌ ఇచ్చేందుకు సిద్దమన్నారు. అయితే ఆమె శాంపిల్స్‌ తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు.

నో లంచ్‌.. ఓన్లీ జ్యూస్‌
మధ్యాహ్నం 2.15కు ముమైత్‌కు సిట్‌ అధికారులు భోజనం ఏర్పాట్లు చేశారు. డైటింగ్‌లో ఉన్నానని చెప్పడంతో ఆమె కోరిక మేరకు బొప్పాయి జ్యూస్, పుచ్చకాయ ముక్కలు ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

నోరు విప్పలేదు.. ఫోన్‌ తీయలేదు
బిగ్‌బాస్‌ షో నుంచి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముమైత్‌ ముంబై నుంచి çవిమానంలో హైదరాబాద్‌ వచ్చారు. బిగ్‌బాస్‌ షో ఒప్పందం ప్రకారం 70 రోజుల పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు, షో విషయాలను షేర్‌ చేయకూడదు. అత్యసవరాల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినా ఇతరులతో ఏమీ మాట్లాడొద్దన్న నిబంధనలున్నాయి. దీనితో నిర్వాహకుల తరఫున నలుగురు వ్యక్తులు ముమైత్‌తో పాటు హైదరాబాద్‌ వచ్చారు. ప్రైవేట్‌ హోటల్‌లో బస చేసి ఉదయం సిట్‌ కార్యాలయానికి కూడా వారు వచ్చారు. సాయంత్రం విచారణ పూర్తయ్యాక వారితో కలిసి ముమైత్‌ తాను బస చేసిన హోటల్‌కు వెళ్లారు. రాత్రి 7.30 ప్రాంతంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విచారణ బాగానే జరిగిందని అక్కడ మీడియాకు చెప్పారు. రాత్రి 8.45 గంటల విమానంలో ఆమె పుణే వెళ్లినట్టు తెలిసింది.

మరో ఇద్దరి విచారణ
ముమైత్‌ విచారణ జరుగుతుండగానే సాద్‌ నజీర్, ముబీన్‌ అనే మరో ఇద్దరు వ్యక్తులను సిట్‌లోని మరో బృందం డ్రగ్స్‌కు సంబంధించి ప్రశ్నించినట్టు తెలిసింది. వీరెవరు, కేసుతో ఏం సంబంధం, కెల్విన్‌తో కలిసి డ్రగ్స్‌ దందా చేశారా, జీశాన్‌తో కలిసి సినీ ఇండస్ట్రీలో ఎవరికైన డ్రగ్స్‌ అందిచారా అనే కోణంలో విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజధానిలోని పలు ప్రాంతాల్లో సిట్‌ బృందాలు సోదాలు కూడా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న వారి నివాస ప్రాంతాల్లో జరిగాయా, లేకా అరెస్టయిన వారి ఇళ్లు, కార్యాలయాల్లోనా అన్నదానిపై సిట్‌ స్పష్టత ఇవ్వలేదు. బుధవారం అరెస్టయిన మైక్‌ కమింగాకు చెందిన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.

నేడు సిట్‌ ముందకు హీరో రవితేజ
జీశాన్‌తో ఎనిమిదేళ్లుగా పరిచయముందంటున్న సిట్‌
ఆయన డ్రైవర్‌తోనూ జీశాన్‌కు లింకులు

ఇప్పటిదాకా డ్రగ్‌ కేసులో విచారణఎదుర్కున్న వారంతా ఒకెత్తయితే, శుక్రవారం సిట్‌ ముందు విచారణకు రానున్న ప్రముఖ హీరో రవితేజ వ్యవహారం మరో ఎత్తు కాబోతోంది. ఇప్పటిదాకా సినీ దర్శకులు, పలువురు చిన్న హీరోలను ప్రశ్నించిన సిట్, ప్రముఖ హీరో, ఇండస్ట్రీలో టాప్‌ హీరోల సరసన ఉన్న రవితేజను ప్రశ్నించనుంది. రవితేజ నిజంగా డ్రగ్స్‌ తీసుకున్నాడా? తీసుకుని ఉంటే ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రవితేజ సోదరుడు భరత్‌ గతంలో డ్రగ్స్‌ కేసులో అరెస్టవడం తెలిసిందే. రవితేజకు అప్పటి నుంచే డ్రగ్స్‌ లింకున్నాయా అన్న కోణంలోనూ సిట్‌ ప్రశ్నించవచ్చని సమాచారం. కెల్విన్‌ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాసరాజుకు కూడా తాను డ్రగ్స్‌ సరఫరా చేశానని ఈ కేసులో అరెస్టయిన జీశాన్‌ ఇప్పటికే సిట్‌కు తెలిపాడు. రవితేజతో తనకు ఎనిమిదేళ్లకు పైగా పరిచయముందని కూడా సిట్‌కు జీశాన్‌ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజ మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తేవడంపై సిట్‌ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. పూరి, రవితేజ కాంబినేషన్‌లో పలు హిట్‌ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement