ముమైత్ ఖాన్.. సిట్.. ఆరున్నర గంటలు
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో గురువారం సినీనటి ముమైత్ ఖాన్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు ముమైత్ ను నలుగురు మహిళా అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ప్రశ్నించారు. తరచు గోవా, బ్యాంకాక్ ఎందుకు వెళతారని, ఖాళీ సమయాల్లో ఎక్కడ గడుపుతారని ముమైత్ ను అడిగారు. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ షో ప్రతినిధుల వెంట బుధవారం రాత్రి పుణే నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేటి ఉదయం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ నుంచి బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు.
ముఖ్యంగా డ్రగ్ డీలర్ కెల్విన్ తో సంబంధాలున్నాయా, డ్రగ్స్ వినియోగిస్తారా అనే ప్రశ్నలు సిట్ అధికారులు సంధించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు ఏం పనులు చేసేవారు.. ఆపై హైదరాబాద్ నుంచి ముంబైకి ఎందుకు వెళ్లారన్న విషయాలను విచారణలో భాగంగా ముమైత్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గోవా, బ్యాంకాక్ లకు ఎందుకు వెళతారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చారు. పబ్ లకు వెళ్లే అలవాట్లతో పాటు తీరిక వేళల్లో ఏ పనులు చేస్తుంటారన్న విషయాలను విచారణలో ఆమె చెప్పినట్లు సమచారం.
అయితే భోజన విరామ సమయంలో ఆహారానికి బదులు కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారని అధికారులు చెప్పారు. రెండు సంవత్సరాల క్రితమే ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చగా.. అక్కడికి ఎందుకు వెళ్లారు ఏం చేస్తున్నారన్న విషయాలపై ముమైత్ వివరణ ఇచ్చుకున్నారు. ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలతో పాటు హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా లాంటి కీలక అంశాలపై ముమైత్‌ను విచారించారు. విచారణ అనంతరం ముమైత్ ఖాన్ విజయసంకేతం చూపిస్తూ వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మీలను ప్రశ్నించిన సిట్... ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై ఆరా తీసింది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలవరకు ముమైత్ ఖాన్‌ను సిట్ అధికారులు విచారించారు. రేపు (శుక్రవారం) హీరో రవితేజను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.