డ్రగ్స్ కేసు: ముగిసిన రవితేజ విచారణ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. నేటి ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటలవరకు దాదాపు తొమ్మిది గంటల పాటు సిట్ అధికారులు రవితేజను విచారించారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, డ్రగ్ డీలర్ అయిన కెల్విన్, జీశాన్‌తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నించారు. రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీశారు. శుక్రవారం రవితేజతో పాటు సయ్యద్ యునిఫ్, కబిర్ అహ్మద్‌లను సిట్ విచారించింది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌రావును అధికారులు విచారించనున్నారు.
గతంలో రవితేజ సోదరులు రఘు, భరత్ డ్రగ్స్ కేసులో పట్టబడటంతో.. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆయనను ఆరా తీసినట్లు తెలుస్తోంది. 'సోదరులతో రవితేజకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ లతో ఎన్నేళ్లుగా పరిచయం ఉంది?. కెల్విన్ ఏ పరిస్థితుల్లో పరిచయం అయ్యాడు. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం' అంటూ విచారణలో భాగంగా రవితేజను ప్రశ్నించినట్లు సమాచారం.
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్ విచారించింది. ఈ కేసులో నోటీసులు అందుకున్న వారిని 19వ తేదీ నుంచి వరుసగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ ఇద్దరు విదేశీయులు సహా 22మందిని అరెస్ట్ చేశారు.