డ్రగ్స్‌ సంచలనం: కాలేజీలు, స్కూళ్లకు నోటీసులు | drugs racket in hyderabad; notices to several colleges, schools | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ సంచలనం: కాలేజీలు, స్కూళ్లకు నోటీసులు

Published Tue, Jul 4 2017 2:49 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

డ్రగ్స్‌ సంచలనం: కాలేజీలు, స్కూళ్లకు నోటీసులు - Sakshi

డ్రగ్స్‌ సంచలనం: కాలేజీలు, స్కూళ్లకు నోటీసులు

- మొగ్గలపై వాలుతున్న మాయదారి డ్రగ్స్‌
- స్కూలు, కాలేజీ పిల్లలే టార్గెట్‌.. సంచలనం రేపుతున్న రాకెట్‌

- తెరపైకి ఓ దర్శకుడు.. బడా నిర్మాత కాల్‌డేటాలో నంబర్‌ గుర్తింపు
- రాజధానిలో నాలుగు ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు నోటీసులు
- 8 ఇంజనీరింగ్‌ కాలేజీలకు కూడా..
- 20 రోజుల్లో 136 మందికి డ్రగ్స్‌ విక్రయం
- ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌
- కేసు దర్యాప్తునకు సిట్‌


సాక్షి, హైదరాబాద్‌

వారంతా పిల్లలు.. భుజాన బ్యాగ్‌ వేసుకొని బుద్ధిగా స్కూల్‌కు వెళ్లే లేలేత ప్రాయం.. ఇంకొందరు ఉత్సాహం ఉరకలెత్తే యువ ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. చదువులతో బిజిబిజీగా ఉండాల్సిన వీరు ఇప్పుడు డ్రగ్స్‌ ఊబిలో చిక్కుకుపోతున్నారు! తెలిసీతెలియని వయసులోనే మాదకద్రవ్యాల మత్తులో చిత్తవుతున్నారు. కాసుల కోసం డ్రగ్స్‌ మాఫియా విసురుతున్న వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. తాజాగా వెలుగుచూసిన డ్రగ్స్‌ రాకెట్‌.. రాజధాని నగరం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందన్న చేదు నిజాన్ని మరోసారి చాటింది.

ఈ మాఫియా గుట్టు విప్పే కొద్దీ విస్మయకర అంశాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్‌లో నాలుగు ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ఎనిమిది ఇంజనీరింగ్‌ కాలేజీలకు నోటీసులు ఇవ్వడం, అందులో డ్రగ్స్‌కు బానిసైన కొందరు విద్యార్థులను ప్రశ్నించడం.. నగరంలో డ్రగ్స్‌ మాఫియా విస్తరించిన తీరుకు అద్దం పడుతోంది. ఒక్క విద్యార్థులే కాదు.. ఈ కేసు వందల మంది లింకులను బయటపెడుతుండటం సంచలనం సృష్టిస్తోంది. కేవలం 20 రోజుల్లో 136 మందికి డ్రగ్స్‌ అందినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు వెల్లడించారు. తొలుత ఏడుగురికి మాత్రమే డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు భావించామని, కానీ వందల సంఖ్యలో డ్రగ్స్‌ బానిసలున్నట్టు తేలిందని పేర్కొన్నారు.

తెరపైకి ప్రముఖ దర్శకుడు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బడా నిర్మాత ఒకరు ఈ డ్రగ్స్‌ ముఠా నుంచి ఎల్‌ఎస్‌డీని కొనుగోలు చేసినట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధ్రువీకరించారు. అయితే సంబంధిత నిర్మాత వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రాకముందే తక్కువ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న ఓ దర్శకుడి కెల్విన్‌(డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వ్యక్తి)తో టచ్‌లో ఉండటం కలకలం రేపుతోంది. కెల్విన్‌ ఫోన్‌ కాల్‌డేటాను విశ్లేషిస్తున్న అధికారులకు ఈ విషయం తెలిసింది.

కెల్విన్‌తో నిత్యం టచ్‌లో ఉండే నిర్మాత.. మానసిక ఒత్తిడికి గురవుతున్న సదరు దర్శకుడికి కెల్విన్‌ను పరిచయం చేసినట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధ్రువీకరించారు. ఏడాదికో సినిమా తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ వాడటం ఏంటన్న దానిపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అసలు తన కోసం డ్రగ్‌ తీసుకున్నాడా లేదా ఇంకెవరి కోసమైనా కొనుగోలు చేశాడా? అన్నది ఇప్పుడు దర్యాప్తు అధికారుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.

ఇంటి ముందు క్యూ...
ఓల్డ్‌ బోయినిపల్లిలో నివసించే కెల్విన్‌ ఇంటి ముందు ప్రతీరోజు ఖరీదైనా కార్లు, ప్రముఖుల హడావుడి ఉంటుందని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తెలిపారు. స్కూల్‌ విద్యార్థుల దగ్గరి నుంచి ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, సినీ ప్రముఖులు.. ఇలా అనేక మంది వచ్చి డ్రగ్స్‌ తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. తాను కేవలం ఇంటి వద్దే డ్రగ్స్‌ విక్రయిస్తానని, అక్కడికి వచ్చి తీసుకెళ్లాలని కెల్విన్‌ తన కస్టమర్లకు చెప్పేవాడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని ఓ కీలక అధికారి తెలిపారు.

ఆ స్కూళ్లు, కాలేజీలకు నోటీసులు...
కెల్విన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌కు బానిసైన ఓ విద్యార్థిని చదువుతున్న స్కూలుతోపాటు మరో నాలుగు ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ సోమవారం మీడియాకు చెప్పారు. అలాగే మరో 8 ఇంజనీరింగ్‌ కాలేజీలకు కూడా తాఖీదులు పంపామన్నారు. ఈ నాలుగు ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎవరు ముందుగా డ్రగ్స్‌కు అడిక్ట్‌ అయ్యారు? వారి నుంచి ఇతరులకు ఎలా వ్యాపించింది? ఎవరు డ్రగ్స్‌ సరఫరా చేశారు? కెల్విన్‌తో ఎలా పరిచయమైంది? అన్న అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక 8 ఇంజనీరింగ్‌ కాలేజీలకు నోటీసులు జారీ చేసిన అధికారులు... 12 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రుల ముందే ప్రశ్నించింది. అసలు కాలేజీకి డ్రగ్స్‌ ఎవరు సరఫరా చేశారు? అబ్దుల్‌ వహీబ్, అబ్దుల్‌ ఖుదూస్‌తో లింకేంటి? వారిని ఎవరు పరిచయం చేయించారు? అన్న పలు విషయాలపై కూపీ లాగారు.

ఎవరు ఆ ఆరుగురు?
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అబ్దుల్‌ వహీబ్, అబ్దుల్‌ ఖుదూస్‌లు విచారణలో ఆరుగురి పేర్లను బయటపెట్టారు. తాము కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ స్వీకరిస్తామని, అతడు చెప్పిన వారికి పంపడంతోపాటు తాము కూడా విక్రయిస్తామని వారు విచారణలో ఒప్పుకున్నారు. ఇటీవలే బ్రెండిన్‌ బిన్, వరుణ్, శ్రీరామ్, జర్మయ్య, భువన్, డేవిడ్‌లకు డ్రగ్స్‌ సరఫరా చేశామని చెప్పారు. వీళ్లెవరు? విద్యార్థులా?స్కూళ్లకు డ్రగ్స్‌ సరఫరా చేసే వారా? లేదా సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారా అన్న అంశాలపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు. వీరిలో బ్రెండిన్‌ బిన్‌ మినహా మిగతా వాళ్లంతా 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

నేడు నిర్మాత, దర్శకుడికి తాఖీదు?
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బడా నిర్మాతతోపాటు దర్శకుడిని విచారించేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులతోపాటు మరో ఇద్దరితో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ఏర్పాటు చేశారు. సూర్యాపేట అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావుతోపాటు సెంట్రల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సిట్‌లోకి తీసుకున్నారు. దర్శకుడు, నిర్మాతతోపాటు మాదాపూర్‌లోని ఆరు ఎంఎన్‌సీ కంపెనీలు, నగరంలోని 8 స్టార్‌ హోటళ్లకు చెందిన ప్రతినిధులను విచారించాలని భావిస్తున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్పష్టంచేశారు.

ఆ ముగ్గురికి 14 రోజుల రిమాండ్‌
ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ డ్రగ్స్‌ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తోపాటు అబ్దుల్‌ వహీబ్, అబ్దుల్‌ ఖుదూస్‌లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో కెల్విన్‌పై బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఎల్బీనగర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే అబ్దుల్‌ వహీబ్, ఖుదూస్‌లపై చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిన కోర్టు చర్లపల్లి జైలుకు తరలించాలని ఆదేశించింది. వారిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తామని, ఇందుకు మంగళవారం కోర్టులో పిటిషన్‌ వేస్తామని అధికారులు తెలిపారు.

డ్రగ్స్‌ ఎఫెక్ట్‌ ఇదీ..

  •  ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను మైక్రో గ్రాముల్లో, ఎండీఎంఏ డ్రగ్‌ను గ్రాముల్లో విక్రయిస్తున్నారు
  •  ఎల్‌ఎస్‌డీని చప్పరించిన అరగంట తర్వాత మత్తు ఎక్కుతుంది.
  •  4 నుంచి 6 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటారు
  •  ఎండీఎంఏ డ్రగ్‌ను పౌడర్, టాబ్లెట్‌ రూపంలో లేదా సిగరెట్లలో పెట్టుకొని తీసుకుంటున్నారు.
  •  ఇది 30 సెకండ్లలో మత్తు ఎక్కించి 6 గంటల పాటు మైకంలో ఉంచుతుంది
  •  డ్రగ్స్‌ తీసుకున్నవారు ఉద్రేకంగా ప్రవర్తిస్తారు. కోపం, పిచ్చిగా నవ్వడం, అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలతో ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement