డ్రగ్స్ రాకెట్: మరో నలుగురి అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ డ్రగ్స్ దందా కేసు దర్యాప్తును ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వేగమంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ అరెస్టులు జరిగినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నేడు తమ తనిఖీలలో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు ఎంఎన్‌సీ కంపెనీ (సాఫ్ట్‌వేర్) ఉద్యోగులేనని చెప్పారు. ఇప్పటివరకూ 100 ఎల్‌ఎస్‌డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ మాఫియా కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇదివరకే హైదరాబాద్‌లో పలు ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులకు జారీ చేసి డ్రగ్స్‌కు బానిసైన కొందరు విద్యార్థులను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బడా నిర్మాతతోపాటు దర్శకుడిని నేడు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. ఇందుకోసం ముందుగానే మాదాపూర్‌లోని ఆరు ఎంఎన్‌సీ కంపెనీలు, నగరంలోని 8 స్టార్ హోటళ్లకు చెందిన ప్రతినిధులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు విచారణకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తోపాటు అబ్దుల్ వహీబ్, అబ్దుల్ ఖుదూస్‌లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు చర్లపల్లి జైలుకు తరలించాలని ఆదేశించింది. వారిని వారం రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించడానికి నేడు (మంగళవారం) కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
సంబంధిత కథనాలు