మనల్ని మనం మోసం చేసుకోకూడదు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు, తప్పులు సహజం. నా జీవితంలోనూ ఉన్నాయి. ప్రతి హీరో బాగా నటిస్తున్నారు. నేనెప్పుడూ మిగతా హీరోలతో పోల్చుకోను. పోల్చుకోవడం మొదలు పెడితే రాంగ్ స్టెప్ పడుతుంది. మిగతావాళ్ల గురించి ఆలోచించను. మన శక్తి తెలుసుకోకుండా ఎవరో సూపర్‌గా చేస్తున్నారని అనుకోవడం ఎందుకు? నీ సంగతి చూసుకుంటే... మంచి స్థాయికి చేరకుంటావు. సినిమా హిట్ అయితే ఆకాశానికి ఎత్తుతారు. ఫట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. కొందరు నన్ను దర్శకత్వం చేయమంటారు? నేను దర్శకత్వానికి సరిపోనని నా అభిప్రాయం. ఎవరో చెప్పింది ఫాలో కాకూడదు.
మనమంతా (మనుషులు) సెకండ్ హ్యాండ్ బ్యాచే. అమ్మానాన్నలు పేరు పెడతారు... నువ్వు మంచోడివి అంటే ‘ఒహో... నేను మంచోణ్ణి’ అనుకోవాలి. ఎవరో చెబితేనే... మన వ్యక్తిత్వం వస్తుంది. ఇతరుల అభిప్రాయా లకు మనం ఎక్కువ విలువిస్తాం. అప్పుడు లైఫ్ సెకండ రీనే. మరి, ఫస్ట్ హ్యాండ్ ఎక్కడుంది? అంటే... నీలోనే ఉంది. అది దొరికితే... నువ్వే హీరో. అదేంటంటే... నిజం.
‘‘సరైన లక్ష్యం లేకుండా యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చాను. నా సక్సెస్‌లో ఫ్యామిలీతో పాటు దర్శక– నిర్మాతలు, సాంకేతిక నిపుణుల మద్దతు ఎంతో ఉంది. ఆ టైమ్‌కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేశా. భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులూ జరిగాయి. వాటి నుంచి కొంత నేర్చుకున్నా. జీవితమంటే ఇదే కదా! ఈ ప్రయాణం ఇలాగే అందంగా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన ‘గురు’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ చెప్పిన విశేషాలు....
►స్కూల్‌లో స్ట్రిక్ట్ టీచర్ తర్వాత... ఇప్పుడు సమ్మర్‌లో స్ట్రిక్ట్ కోచ్ వస్తున్నాడు. ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ టీమ్‌ను రిప్రజెంట్ చేసిన కోచ్‌లలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు మరికొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకురాలు సుధ కథ రాశారు. ఎలాంటి లక్ష్యం లేని అమ్మాయిలను విజేతలుగా తీర్చిదిద్దిన ఓ వ్యక్తి కథ ఇది. రాజకీయాల వల్ల అతని జీవితం ఎలా పాడైందో... పేరు ఎలా మసకబారిందో చెప్పే కథ. ఉదాహరణకు... 12 కోట్ల తెలుగు ప్రజల్లో కేవలం 100 మంది మహిళా బాక్సర్లు మాత్రమే ఉన్నారు. అందులో 45 మంది నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. మహిళల సక్సెస్ రేట్ ఎంతుందో చూడండి. దురదృష్టవశాత్తూ... ఎక్కువ మంది స్పోర్ట్స్‌లోకి రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి? స్పోర్ట్స్ పాలిటిక్స్ ఏంటనేవి సినిమాలో చూపించాం.
►ఈ వయసులో ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. చాలా రోజులుగా వెరీ న్యాచురల్, రియలిస్టిక్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. నా లుక్ దగ్గర్నుంచి ప్రతిదీ న్యాచురల్‌గా ఉండేలా సుధకు ఫ్రీడమ్ ఇచ్చాను. 30 ఏళ్లుగా ఎన్నో సినిమాలు చేశా. సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ, మొదటిసారి స్క్రిప్ట్ మొత్తం చదివి, ప్రతి సీన్ ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేసింది ఈ సినిమా కోసమే. ఇది నాకో సవాల్ అనిపించింది. ఇలాంటప్పుడు నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ఛాన్స్ వస్తుంది. మరింత మెరుగ్గా నటించవచ్చు. రిజల్ట్ కూడా బాగుంటుంది. ఈ స్టైల్‌లో చేయడం నాకో సవాల్.
►కోచ్ అంటే కొంచెమైనా బాగుండాలి కదా. ఆ లుక్ తీసుకురావడం కోసం ఆర్నెల్లు కష్టపడ్డాను. బాక్సింగ్ కోచ్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ చదివా, సినిమాలు చూశా. ‘జింగిడి.. జింగిడి..’ ట్యూన్ వినగానే మరోసారి పాట పాడే ఛాన్స్ రాదనుకున్నా. ఎంజాయ్ చేస్తూ ఆ పాట పాడాను. ఎక్కువ శాతం ఒరిజినల్ బాక్సర్లు సినిమాలో నటించారు. రితికా సింగ్, ముంతాజ్‌లు కూడా బాక్సింగ్ నేపథ్యం ఉన్నవారే. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకున్నా... మ్యూజిక్, రీ రికార్డింగ్ పూర్తి కాలేదు. అందుకే సమ్మర్‌కి వస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీలు, చిల్డ్రన్ అందరూ ఫ్రీగా ఉంటారు. మంచి సీజన్‌లో సినిమా వస్తోంది. హ్యాపీ!
►‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ కథపై దర్శకుడు కిశోర్ తిరుమల పూర్తి సంతృప్తిగా లేరు. అందుకే, దాన్ని పక్కన పెట్టాం. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నాం. కానీ, నవల హక్కుల దగ్గర ఏదో సమస్య వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ప్రిపరేషన్ జరుగుతోంది. దానికి మరింత టైమ్ కావాలి. ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుంది. తర్వాతి సినిమా గురించి ఆ తర్వాత ఆలోచిస్తా. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది.
►ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలనుకోవడం కరెక్ట్ కాదు. పాత్రకు తగ్గట్టు లుక్, గెటప్... అన్నీ మారాలి. ‘దంగల్’లో ఆమిర్‌ఖాన్ ఎలా ఉన్నారు? పెద్ద పొట్టతో పాత్రకు తగ్గట్టు ఎంత బాగా ఎమోషన్స్ పండించారు. ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలి.. లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ‘గురు’లో పాత్రకు తగ్గట్టు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించా. లుక్ చూసి, ఇండస్ట్రీలో హీరోలు, ప్రముఖుల దగ్గర్నుంచి ప్రేక్షకుల వరకూ... అందరూ ప్రశంసించారు. తర్వాత సినిమాలో పాత్రను బట్టి మాసీగా లేదా క్లాస్‌గా మారతా.