
బాలకృష్ణ, క్రిష్
నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు హీరో బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తూ ఎన్.బి.కె ఫిలింస్ పతాకంపై వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ సినిమా ప్రారంభోత్సవం మార్చిలో జరిగింది. తొలుత ఈ సినిమాకు దర్శకునిగా ఎంపికైన తేజ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఇప్పుడీ సినిమా దర్శకత్వ బాధ్యతలను క్రిష్ (జాగర్లమూడి రాధా కృష్ణ) స్వీకరించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇదివరకు బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం రూపొందింది. ‘‘ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది.
ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి’, ఈ చరిత్రకు చిత్రరూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను. మరో అఖండ విజయానికి అంకురార్పణం. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది’’ అన్నారు బాలకృష్ణ. ‘‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణగారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగు వాళ్లందరి ఆత్మాభిమానానికి అద్దం పట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్.
Comments
Please login to add a commentAdd a comment