హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం 20% అప్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 20.2 శాతం పెరిగి రూ. 3,894 కోట్లకు చేరింది. అయితే చాలా ఏళ్ల తర్వాత బ్యాంకు ఎన్‌పీఏలు బాగా పెరిగాయి. దాంతో మొండి బకాయిలకు కేటాయింపుల్ని సైతం బ్యాంకు రెట్టింపు చేసింది. ఈ కేటాయింపులు రూ. 866 కోట్ల నుంచి రూ. 1,558 కోట్లకు చేరాయి. అనూహ్యంగా కేటాయింపులు పెరగడంతో మార్కెట్ అంచనాలకంటే బ్యాంకు ప్రకటించిన నికరలాభం తక్కువ వుంది.బ్యాంకు నికరవడ్డీ ఆదాయం కూడా 20.4 శాతం పెరుగుదలతో రూ. 9,370.7 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.4 శాతానికి ఎగిసింది. బ్యాంకు ఇతర ఆదాయం 25.3% ఎగిసి రూ. 3,516 కోట్లకు చేరింది. ఫీజు, కమీషన్ల ఆదాయం బాగా పెరగడంతో ఇతర ఆదాయంలో వృద్ధి సాధ్యపడింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ. 1,738 వద్ద ముగిసింది.
వ్యవసాయ రుణాలతో...
పలు రాష్ట్రాల్లో రైతు రుణాల్ని మాఫీ చేసిన నేపథ్యంలో ఆ విభాగపు చెల్లింపులు తగ్గాయని, దాంతో స్థూల ఎన్‌పీఏలు 1.24%కి పెరిగినట్లు బ్యాంకు తెలిపింది. దశాబ్దాలుగా రుణ నాణ్యతకు పేరుపడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎన్‌పీఏలు ఇంత అధికంగా నమోదుకావడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే ప్రధమం. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యంగా ఇవ్వాల్సిన 18% రుణవితరణను బ్యాంకు పరిపూర్తిచేయడంతో ఈ రంగానికి ఇచ్చిన రుణాలు రూ. 28,000 కోట్లకు చేరాయి. ఫలితంగా ఎన్‌పీఏలు 0.13% పెరిగినట్లు బ్యాంకు వివరించింది.దాదాపు తాజాగా మొండి బకాయిలుగా మారిన రుణాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినవే 60% ఉన్నాయని బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేశ్ సూక్తాంకర్ సోమవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. ఆర్‌బీఐ సూచనల మేరకు టెలికం రంగానికి ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని పెంచామని, అలాగే ఇనుము, ఉక్కు రంగ రుణాలపై సైతం అధిక కేటాయింపులు జరిపినట్లు ఆయన వివరించారు.