కథ రెడీ... క్లాప్ కొట్టడమే ఆలస్యం
దర్శకుడు క్రిష్‌కి హిందీ నుంచి పిలుపొచ్చింది. ఆల్రెడీ హిందీలో క్రిష్ ఓ సినిమా చేశారు. చిరంజీవి సూపర్ హిట్ ‘ఠాగూర్’ (తమిళ ‘రమణ’)ను అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘గబ్బర్’ పేరుతో రీమేక్ చేశారాయన. ఈసారి రీమేక్ కాదు... స్ట్రయిట్ సినిమా తీయమంటూ క్రిష్‌కు పిలుపు అందింది. బాలకృష్ణతో క్రిష్ తీసిన సూపర్ హిట్ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ హిందీ దర్శక–నిర్మాతలకు బాగా నచ్చిందట. హిందీ సినిమాలు చేయమంటూ అక్కడి నిర్మాతలు క్రిష్‌ను అడుగుతున్నారు.
ప్రస్తుతానికి క్రిష్ ఓ సినిమా అంగీకరించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారాయన. ‘మణికర్ణిక’ పేరుతో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. లక్ష్మీబాయిగా కంగనా రనౌత్ నటించనున్నారు. రెండేళ్ల క్రితమే కేతన్ మెహతా దర్శకత్వంలో కంగన ముఖ్యతారగా ఝాన్సీ లక్ష్మీబాయి కథతో సినిమా తీయనున్నట్టు ఓ వార్త వచ్చింది. రెండేళ్ల నుంచీ కంగన కూడా వీలు చిక్కినప్పుడు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఏమైందో ఏమో... ఇప్పుడు దర్శకుడిగా క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు ఎందుకు మారారు? అనే అంశం పక్కన పెడితే... క్రిష్‌కి ఈ ఛాన్స్ రావడం వెనక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ముఖ్య భూమిక పోషించిందనే చెప్పాలి.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో యుద్ధాలు, శాతకర్ణి ధీరత్వం, వీరత్వం చూపే సన్నివేశాలను క్రిష్ తెరకెక్కించిన తీరు చూసి హిందీ సినీ ప్రముఖులు మంత్ర ముగ్ధులయ్యారు. అందుకే, ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథను ఆయన చేతుల్లో పెట్టారని ఓ టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు. క్రిష్ సీన్‌లోకి వచ్చిన తర్వాత కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకోవడంపై కంగన మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. హిందీ, తెలుగులో భాషల్లో రూపొందనున్న ఈ సినిమా జూన్‌లో మొదలు కానుందట!