jhansi lakshmi bailife story
-
క్రిష్ అందుకే తప్పుకున్నారు : కంగనా
చిన్నప్పుడు తమ్ముడికి ఆడుకునే గన్ను తనకు బొమ్మ కొనిచ్చినప్పుడు ‘నేనెందుకు గన్నుతో ఆడుకోకూడదు. ఎందుకీ వివక్ష’.. ప్రశ్నించింది కంగనా రనౌత్. స్త్రీ ఎందులోనూ తక్కువ కాదని చిన్ని మనసులో నాటుకుపోయింది. పెరిగే కొద్దీ ఆ భావన పెరిగి పెద్దదైంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి బ్యాగ్రౌండూ లేకుండా బాలీవుడ్‌కి వచ్చి స్టార్ అయింది. ‘తను వెడ్స్ మను, రజ్జో, క్వీన్’ చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’గా రాబోతోంది. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా కంగనా ఇంటర్వ్యూ.. ► స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్లో, ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన నేపథ్యంలో సాగిన ‘మణికర్ణిక’ ప్రయాణం మీకెలా అనిపించింది? చాలా దశలు చూశాను. విజయేంద్రప్రసాద్గారైతే ఆ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా కూడా నిన్ను చాలా పరీక్షలు పెడుతోందన్నారు. అది నిజమే. ఈ చిత్రం షూటింగ్లో గాయపడ్డాను. ఆ తర్వాత అనుకోకుండా డైరెక్టర్‌గా మారాల్సి వచ్చింది. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రతి పరీక్షను దాటుకుంటూ వచ్చాను. ► కథ విన్నాక ఈ సినిమా కోసం మీరు ఏమేం నేర్చుకున్నారు? కత్తి సాము నేర్చుకున్నాను. ఒకే కరవాలంతో కాదు.. కొన్ని సన్నివేశాల్లో రెండు కత్తులు దూస్తాను. దానికోసం చాలా ప్రాక్టీస్ చేశాను. కత్తిసాము, గురప్రు స్వారీలో పర్ఫెక్షన్ తీసుకురావడానికి రెండు నెలలు కష్టపడ్డాను. ఝాన్సీ లక్ష్మీ బాయ్ శక్తివంతమైన స్త్రీ. నేను కూడా చూడ్డానికి అంతే పవర్‌ఫుల్‌గా కనిపించాలి. అందుకు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మంచి పీరియాడికల్ మూవీ ‘మణికర్ణిక’. ఫస్ట్ ఉమెన్ యాక్షన్ మూవీ. అందుకే రాజీపడలేదు. ► లక్ష్మీ బాయ్ వీర వనిత. బ్యాగ్రౌండ్ లేని స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగే క్రమంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మహిళలందరూ ధైర్యంగా ఉండాలి కదా? కచ్చితంగా ఉండాలి. రాణీ లక్ష్మీ బాయ్‌లాంటి వాళ్లను సమాజం తయారు చేయడానికి ముందుకొస్తే కాదనేవారు ఎవరుంటారు? అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఎవర్నీ ఒత్తిడి చేయకూడదు. ధైర్యవంతులను నిరుత్సాహపరచకూడదు. ► ఓకే.. ‘మణికర్ణిక’ని పూర్తి చేయడానికి డైరెక్షన్ సీట్లోకి రావాలన్నది మీ ఆలోచనా? అసలు ఏం జరిగింది? క్రిష్‌గారు ఓ తెలుగు సినిమా ఒప్పుకోవడం వల్ల ‘మణికర్ణిక’ వాయిదా పడే పరిస్థితి వచ్చింది. మేం ఎలాగైనా జనవరిలోనే విడుదల చేయాలనుకున్నాం. దాంతో నిర్మాత కమల్ జైన్, రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నన్నే డైరెక్షన్ చేయమన్నారు. అయితే ఇది ఈజీ మూవీ కాదు. ఒక చరిత్ర. అందుకే వేరే ఇద్దరు డైరెక్టర్లు పెట్టమన్నాను. అలా చేసినా సింక్ అవ్వలేదు. ఫైనల్లీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికే క్రిష్ చేసి ఉండటంతో మిగతా నాకు కొంచెం సులువు అయింది. ► క్రిష్ అలా తప్పుకోవడం కరెక్టేనంటారా? పైగా ‘మణికర్ణిక’ గురించి ఆయన ఎక్కడా మాట్లాడటంలేదు కూడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు కాబట్టే తప్పుకున్నారు. వాయిదా వేయడానికి ఇష్టం లేక మేం పూర్తి చేశాం. ఇక ఈ సినిమా గురించి ఆయన ఎందుకు మాట్లాడటంలేదు అంటే.. ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టి ఉంటారు. ► మీరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంవల్లే.. ఒక లేడీ డైరెక్టర్‌తో చేయడంతో ఇష్టం లేక సోనూ సూద్ తప్పుకున్నారట. కానీ ఆయనేమో గెటప్‌లో వచ్చిన మార్పు వల్లే అంటున్నారు? గెటప్ మారినది నిజమే. సోనూ సూద్ ‘సింబా’ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా గెటప్‌కీ, దీనికీ సింక్ అవ్వదు. ఇందులో గడ్డం ఉండాలి. కానీ గడ్డం పెంచలేనంటూ తప్పుకున్నారు. అయినా ఇవాళా రేపూ గడ్డం గెటప్ అంటే పెంచాల్సిన అవసరమే లేదు. కావాలంటే పెట్టుడు గడ్డంతో మ్యానేజ్ చేయొచ్చు. కానీ సోనూ సూద్ తప్పుకున్నారు. అయినా ఓకే. ► మరో సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారట? అవును. ఆ సినిమాకి విజయేంద్రప్రసాద్‌గారే కథ అందిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ఏలియన్స్‌కి సంబంధించిన కథ కాదు. -
టీజర్ సిద్ధం
దేశ స్వాతంత్య్రం రోజున (ఆగస్టు 15) ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు ‘మణికర్ణిక’ టీమ్. ఇప్పుడు అక్టోబర్ 2 అంటే... గాంధీ జయంతి నాడు టీజర్‌ను రిలీజ్ చేసి మరింత మంది ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేశారు. ఇది దేశభక్తి చిత్రం కావడంతో ఇలా దేశభక్తికి రిలేట్ అయిన డేట్స్‌లో సినిమా ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తే ప్లస్ అవుతుందని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకేనేమో సినిమా రిలీజ్‌ను కూడా వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి మార్చుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ క్రిష్ తెలుగులో ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌తో బిజీగా ఉండటం వల్ల కొంత షూట్ కోసం కంగనా డైరెక్షన్ చైర్లో కూర్చున్నారన్న సంగతి తెలిసిందే. సినిమా డైరెక్షన్ క్రెడిట్లో తనకు భాగస్వామ్యం వద్దని, అవుట్‌పుట్ రావడంలో ఒక భాగంగానే తాను డైరెక్షన్ సీట్లో కూర్చున్నానని ఆమె చెప్పారని బాలీవుడ్ టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మణికర్ణిక’ టీమ్ నుంచి తాజాగా నటి స్వాతి సెమ్వాల్ కూడా వైదొలిగినట్లు బీటౌన్ టాక్. ఈ సినిమాలో పార్వతి అనే పాత్రకు స్వాతిని తీసుకున్నారట. అయితే తన పాత్రకు ప్రాముఖ్యతను తగ్గించారనే కారణంగా స్వాతి ఈ చిత్రానికి గుడ్ బై చెప్పారట. రీసెంట్గా సోనూసూద్.. తాజాగా స్వాతి తప్పుకోవడంతో ‘మణికర్ణిక’ సినిమా మళ్లీ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
‘అమ్మ’కు విముక్తి కలిగించేందుకు...
సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో మహిళామణులదీ విశేషపాత్ర. వారిలో కొందరు తమకే సొంతమైన ధీరత్వంతో చరిత్రకెక్కారు. భూమాత‘అమ్మ’ను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమ వంతు కృషి చేసిన కొందరు మహిళా మూర్తులను మరోసారి స్మరిద్దాం.. తరిద్దాం.. జై భరతనారీ.. ఝాన్సీ లక్ష్మీబాయి భారతీయ స్త్రీ అంటే ధైర్యానికి ప్రతీక అని చాటి చెప్పిన ధీర వనిత. 1857 సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ’ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ప్రకటించిన వీరనారి. కొడుకును వీపున కట్టుకుని పోరాడుతూ అతివ అంటే అబల కాదు సబల అని నిరూపించిన స్త్రీ మూర్తి. బేగం హజ్రత్ మహల్(1820-1879) అవధ్ రాణిగా సుప్రసిద్ధురాలైన హజ్రత్ మహల్ భర్త నవాబ్ వాజిద్ అలీ షా మరణానంతరం పాలనా బాధ్యతలు స్వీకరించారు. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, తన అనుచరులతో కలిసి లక్నోను ఆక్రమించుకున్నారు. కొడుకు బిజ్రిస్ కాద్రాను అవధ్‌కు రాజుగా ప్రకటించారు. కానీ బ్రిటీష్ అధికారుల కుయుక్తుల ముందు ఓడిపోయి, బహిష్కరణకు గురై కలకత్తాకు వెళ్లిపోయారు. రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆలయాలు, మసీదులు కూల్చివేసి ప్రజా సంక్షేమానికే మొదటి ప్రాధాన్యమిచ్చిన రాణిగా అందరి దృష్టి ఆకర్షించారు. 1857- 1859 జాతీయ విముక్తి తిరుగుబాటుకు బేగం నాయకత్వం వహించారని కార్ల్ మార్క్స్, తన పుస్తకంలో పేర్కొన్నారు. మేడమ్ బికాజీ కామా(1861-1936) పార్శీ వర్గానికి చెందినవారు. 1896లో ముంబైలో ప్లేగు వ్యాధి ప్రబలించినపుడు ఆమెకు వ్యాధి సోకినప్పటికీ ఇతరులకు సాయం చేశారు. మెరుగైన చికిత్స కోసం బ్రిటన్ వెళ్లారు. స్వాతంత్ర్యోద్యమానికై జీవితాన్ని ధారపోశారు. దాదాబాయ్ నౌరోజీ కార్యదర్శిగా పనిచేసే సమయంలో శ్యామ్ కృష్ణ వర్మ స్థాపించిన ‘ఇండియన్ హోమ్‌రూల్ సొసైటీ’కి మద్ధతుగా నిలిచారు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సామాజిక సదస్సులో పాల్గొని భారత జెండాను ప్రదర్శించారు. భారత ఉపఖండం కరువును జయించిన తీరును వివరించారు. మానవ హక్కులకై, సమానత్వం సాధించుటకై కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1935లో యూరప్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సరోజిని నాయుడు భారత కోకిలగా సుప్రసిద్ధురాలైన సరోజిని నాయుడు గవర్నర్ పదవి నిర్వహించిన తొలి భారతీయ మహిళ. స్వతంత్ర పోరాటంలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. గొప్ప కవయిత్రి కూడా. దేశంలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం ‘ఖైజర్-ఎ-హింద్’ పతకంతో సత్కరించింది. కస్తూర్బా గాంధీ భారత జాతిపిత మహాత్మా గాంధీ సహధర్మచారిణిగానే కాకుండా రాజకీయవేత్తగా, పౌర హక్కులకై పోరాడిన మహిళగా, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గుర్తింపు పొందారు. కుటుంబ బాధ్యత తీసుకుని గాంధీజీకి అండగా నిలిచారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ ఆవశ్యకతతో పాటు, విద్య ప్రాముఖ్యాన్ని చాటిచెప్పారు. విజయ లక్ష్మీ పండిట్(1900-1990) సంపన్న కుటుంబంలో జన్మించిన విజయ లక్ష్మీ పండిట్ భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. పండిట్ జవహర్ లాల్ సోదరి. కేబినెట్ పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. స్థానిక స్వయం ప్రభుత్వ, ప్రజారోగ్య మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు. భారత్ తరపున మాస్కో, వాషింగ్ట్‌న్, లండన్ మహిళా రాయబారిగా పనిచేశారు. సుచేతా కృపలానీ(1908-1974) స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత్‌లో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా(ఉత్తర్ ప్రదేశ్) చరిత్ర సృష్టించారు. కమలా నెహ్రూ(1899-1936) జవహర్లాల్ నెహ్రూ భార్య. సహాయ నిరాకరణోద్యమంలో మహిళా బృందాలను సంఘటితపరుస్తూ, విదేశీ దుస్తులు, మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. భర్త హాజరుకాని సమావేశాలకు ఆయన తరపున వెళ్లి ఉపన్యసించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనీబిసెంట్(1857-1933) భారతదేశం స్వతంత్రంగా మారాలని ఆకాక్షించిన విదేశీ మహిళ. ఐర్లాండ్‌కు చెందిన వారు. బాలగంగాధర్ తిలక్‌తో కలిసి ‘హోం రూల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. అరుణా అసఫ్ అలీ(1909-1996) భారత రత్న అవార్డు గ్రహీత. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలు మార్లు అరెస్టయ్యారు. జైలులో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తనా తీరుకు నిరసనగా బంద్‌లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైలులోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ (1909-1981) తెలుగు వనిత దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గాంధీజీ అనుచరురాలిగా సుప్రసిద్ధులు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా బహుముఖ ప్రఙ్ఞ కలవారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉన్న సమయంలో కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు స్థాపించారు. దీని ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. -సుష్మారెడ్డి యాళ్ళ -
కథ రెడీ... క్లాప్ కొట్టడమే ఆలస్యం
దర్శకుడు క్రిష్‌కి హిందీ నుంచి పిలుపొచ్చింది. ఆల్రెడీ హిందీలో క్రిష్ ఓ సినిమా చేశారు. చిరంజీవి సూపర్ హిట్ ‘ఠాగూర్’ (తమిళ ‘రమణ’)ను అక్షయ్‌కుమార్ హీరోగా హిందీలో ‘గబ్బర్’ పేరుతో రీమేక్ చేశారాయన. ఈసారి రీమేక్ కాదు... స్ట్రయిట్ సినిమా తీయమంటూ క్రిష్‌కు పిలుపు అందింది. బాలకృష్ణతో క్రిష్ తీసిన సూపర్ హిట్ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ హిందీ దర్శక–నిర్మాతలకు బాగా నచ్చిందట. హిందీ సినిమాలు చేయమంటూ అక్కడి నిర్మాతలు క్రిష్‌ను అడుగుతున్నారు. ప్రస్తుతానికి క్రిష్ ఓ సినిమా అంగీకరించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారాయన. ‘మణికర్ణిక’ పేరుతో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. లక్ష్మీబాయిగా కంగనా రనౌత్ నటించనున్నారు. రెండేళ్ల క్రితమే కేతన్ మెహతా దర్శకత్వంలో కంగన ముఖ్యతారగా ఝాన్సీ లక్ష్మీబాయి కథతో సినిమా తీయనున్నట్టు ఓ వార్త వచ్చింది. రెండేళ్ల నుంచీ కంగన కూడా వీలు చిక్కినప్పుడు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఏమైందో ఏమో... ఇప్పుడు దర్శకుడిగా క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు ఎందుకు మారారు? అనే అంశం పక్కన పెడితే... క్రిష్‌కి ఈ ఛాన్స్ రావడం వెనక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ముఖ్య భూమిక పోషించిందనే చెప్పాలి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో యుద్ధాలు, శాతకర్ణి ధీరత్వం, వీరత్వం చూపే సన్నివేశాలను క్రిష్ తెరకెక్కించిన తీరు చూసి హిందీ సినీ ప్రముఖులు మంత్ర ముగ్ధులయ్యారు. అందుకే, ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథను ఆయన చేతుల్లో పెట్టారని ఓ టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు. క్రిష్ సీన్లోకి వచ్చిన తర్వాత కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకోవడంపై కంగన మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. హిందీ, తెలుగులో భాషల్లో రూపొందనున్న ఈ సినిమా జూన్‌లో మొదలు కానుందట!