1977లో చేసిన ‘దాన వీర శూర కర్ణ’ తర్వాత హరికృష్ణ మళ్లీ స్క్రీన్ పై కనిపించింది 1998లో ‘శ్రీరాములయ్య’ చిత్రంలోనే. ఎన్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హరికృష్ణ కామ్రేడ్ సత్యం క్యారెక్టర్ చేశారు. హరికృష్ణ మృతిపట్ల శంకర్ స్పందిస్తూ – ‘‘మంచి మనసున్న వ్యక్తి హరికృష్ణగారు. అలాంటి కల్లాకపటం, కల్మషం లేని వ్యక్తి ఇక మన మధ్య లేరని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా గ్యాప్ తర్వాత ‘శ్రీరాములయ్య’ సినిమాలో సత్యం అనే విప్లవ వీరుడి క్యారెక్టర్‌లో ఆయన అద్భుతంగా నటించి అఖండ ప్రేక్షకాదరణ పొందారు. ఈ సినిమా కోసం ‘పీపుల్స్ వార్ ఫౌండర్’ సత్యమూర్తిగారు రాసిన ‘విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ... నీకిస్తా తమ్ముడా.. నీకిస్తా తమ్ముడా’ అనే సాంగ్‌లో హరికృష్ణగారి అభినయం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది. ఆయన ఎంత మొండివాడంటే ఈ సాంగ్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక బరువైన చెట్టు మొదలుని భుజం మీద పెట్టుకుని పాడాలి. ఆ టైమ్‌లో మేము హైదరాబాద్ నుంచి డమ్మీ తెప్పించాలనుకున్నాం. కానీ ఆ ప్రాసెస్ డిలే అయ్యింది.
షూటింగ్ రేపు పెట్టుకుందామని అన్నాం. అక్కర్లేదు. ఇక్కడున్న ఓ మొద్దుతో కానివ్వండి అన్నారు. ఇద్దురు వ్యక్తులు ఓ బరువైన మొద్దును ఎత్తి ఆయన భుజంపై పెట్టారు. ఆయన ఒక్కరే మోసారు. దీంతో అక్కడున్న మేమందరం షాక్ అయ్యాం. ఆ వయసులో కూడా ఆయనకు అంత సాహసం, మొండితనం ఉండేవి. ఆ కుటుంబానికే సినిమా అంటే అంత కమిట్‌మెంట్ ఉందనిపించింది. మంచితనం, మొండితనం ఉన్న మంచి వ్యక్తి హరి అన్న. నందమూరి కుటుంబ సభ్యులు తెల్లవారు జాము నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. ‘శ్రీరాములయ్య’ షూటింగ్ అప్పుడు నా గది, హరికృష్ణగారి గది పక్క పక్కనే ఉండేవి. నేనేమో నిద్ర పోతుంటే ఆయన నాలుగున్నరకే నిద్ర లేచి, రెడీ అయ్యి నన్ను లేపేవారు. ఆ క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయాను. హరి అన్న ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పైకి గంభీరంగా కనిపించే హరి అన్న నిజానికి చాలా సరదా మనిషి. ‘మీ బుగ్గలు బాగున్నాయి’ అంటూ నన్ను సరదాగా ఆటపట్టించేవారు. లొకేషన్లో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఆయన్ని దగ్గరగా చూసినవాళ్ళకే హరి అన్న ఎంత మంచి మనిషో అర్థం అవుతుంది’’ అన్నారు.
హరి అన్న మొండితనం ఉన్న మంచి మనిషి
Published Thu, Aug 30 2018 12:45 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment