ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు | Meta Fires 24 Employees For Misusing Free Meal Vouchers, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు

Published Fri, Oct 25 2024 9:35 AM | Last Updated on Fri, Oct 25 2024 11:07 AM

Meta fires 24 employees for misusing free meal vouchers

ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్‌ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.

మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్‌ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్‌ఆఫ్‌ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ లేకుండానే యూపీఐ చెల్లింపులు!

మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్‌హబ్‌’, ‘ఉబర్‌ఈట్స్‌’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్‌ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement