Voucher
-
ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపు
ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించుకున్న ఉద్యోగులకు మెటా సంస్థ షాకిచ్చింది. లాస్ ఏంజిల్స్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను జాజ్ నుంచి తొలగించింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి..కంపెనీ యాజమాన్యం తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించిందో తెలుసుకుందాం.మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజ కంపెనీ మెటా తన ఉద్యోగులకు నిత్యం ఉచిత ప్రోత్సహకాలు అందిస్తోంది. అందులో భాగంగా ఉచిత భోజనం కోసం వోచర్లు ఇస్తోంది. అయితే వీటిని కొందరు ఉద్యోగులు దుర్వినియోగం చేసినట్లు సంస్థ గుర్తించింది. దాంతో లాస్ ఏంజిల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులను ఏకంగా జాజ్ నుంచి తొలగించింది. అయితే వారు భోజనానికి బదులుగా ఇతర వస్తువులు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. టూత్‌పేస్ట్, లాండ్రీ డిటర్జెంట్, వైన్ గ్లాసెస్ వంటి వ్యక్తిగత వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ వోచర్లను ఉపయోగించారు. ఉద్యోగం కోల్పోయిన కొందరిలో తాము వీక్ఆఫ్ ఉన్న రోజుల్లోనూ ఇలా ఉచిత భోజనం కోసం ఇచ్చిన వోచర్లను ఉపయోగించినట్లు సంస్థ యాజమాన్యం గుర్తించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!మెటా తన ఉద్యోగులకు ‘గ్రూబ్హబ్’, ‘ఉబర్ఈట్స్’ వంటి డెలివరీ సేవల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రోజువారీ భోజన వసతి అందిస్తుంది. అందులో భాగంగా తమకు ఉచితంగా వోచర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఒక ఉద్యోగికి టిఫిన్ కోసం 20 డాలర్లు(రూ.1,681), మధ్యాహ్నం భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100), రాత్రి భోజనం కోసం 25 డాలర్లు(రూ.2,100) విలువ చేసే వోచర్లు ఇస్తోంది. అయితే కొంతమంది ఉద్యోగులు నాన్-ఫుడ్ వస్తువులను కొనుగోలు చేయడానికి, కార్యాలయానికి రాని సమయంలో భోజన సదుపాయాన్ని వినియోగించినట్లు కంపెనీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై ఉద్యోగులకు ప్రాథమిక హెచ్చరికలు ఉన్నప్పటికీ వీటిని కొందరు అతిక్రమించారు. దాంతో సంస్థ యాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించింది. -
అధికారిక అవినీతి!
⇒ మురిగిపోకుండా అడ్వాన్స్ ⇒ రికార్డింగ్ పేరుతో నిధులు డ్రా ⇒ పనులు కాకుండానే ఎం బుక్కుల్లో నమోదు ⇒ మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి ⇒ మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు ⇒ పనులు చేయకుండా బిల్లులు డ్రా చేస్తే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఆందోళన ⇒ {పభుత్వమే ఒత్తిడి తెస్తోందంటున్న ఉన్నతాధికారులు ఓచర్లు తయారవుతున్నాయి.. బిల్లులు చకచకా రెడీ అయిపోతున్నాయి.. పనులు జరక్కుండానే డ్రా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను అడ్డంగా బొక్కేందుకు ఇటు అధికారులు.. అటు అధికార పార్టీ నేతలు చాపకింద నీరులా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఏ విధంగా డ్రా చేయాలి.. ఏ విధంగా సొమ్ము చేసుకోవాలనే అంశంపై బుధవారం క్షేత్ర స్థాయి ఇంజినీర్లకు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. విశాఖపట్నం: ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రాష్ర్ట వ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో రూ.400 కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి ఉంది. ఒక్క విశాఖలోనే రూ.150 కోట్లకు పైగా ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. ఏటా మురిగిపోతున్న ఈ నిధులను ఈసారి ఎలాగైనా వెనక్కి మళ్లనీయకుండా ఉండాలన్న పట్టుదలతో పంచాయతీలకు ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా చేర్చి గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. తొలుత 50ః50 నిష్పత్తిలో, ఆ తర్వాత 30ః70 నిష్పత్తిలోనూ.. చివరకు 10ః90 నిష్పత్తి చొప్పున మెటీరియల్ కాంపొనెంట్ నిధులను ఖర్చు చేసేందుకు రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా విశాఖలో ప్రతిపాదించారు. ఈ విధంగా పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులకు రూ.278 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ నిధులను జతచేర్చి ఏకంగా 650 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టేందుకు 6150 పనులను ప్రతిపాదించారు. మార్చి-31కల్లా కనీసం 300 కిలోమీటర్ల మేరైనా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు ఆదరాబాదరాగా 260 కిలోమీటర్ల మేర 1200 వరకు పనులు పూర్తిచేసినట్టుగా లెక్క తేల్చారు. ఇందుకోసం ఇప్పటికే రూ.98 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు చేయగా.. మరో రూ.40 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రారంభంకాని రూ.140 కోట్ల పనులు మిగిలిన రూ.140 కోట్లకు సంబంధించిన పనుల్లో ఎక్కడా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. అయినా సరే ప్రారంభమైనట్టుగా అడ్వాన్స్ రికార్డింగ్ చేసి ఎం బుక్‌లో నమోదు చేయాలంటూ పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఏఈలు, మండల ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పనులు జరక్కుండానే ఏ విధంగా బిల్లులు తయారు చేయాలి. ఏ విధంగా అడ్వాన్స్ రికార్డింగ్ చేయాలి.. ఏ విధంగా ఎంబుక్‌ల్లో నమోదుచేయాలి వంటి విషయాలపై బుధవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో వారికి ప్రత్యేక క్లాస్ కూడా తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నిధులు వెనక్కి మళ్లిపోవడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయనని.. అవసరమైతే నిబంధనలను పక్కన పెట్టి అడ్వాన్స్ రికార్డింగ్‌తో నెలాఖరులోగా నిధులన్నీ డ్రా చేసి తీరాలని వారికి తేల్చి చెప్పారు. ఇందుకోసం మెటీరియల్ కొన్నట్టుగా ఓచర్లు సృష్టించి బిల్లులు డ్రా చేయాలని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే డ్రా చేసిన రూ.98 కోట్లకు సంబంధించిన పనులు కాని.. ఇంకా డ్రా చేయాల్సి ఉన్న రూ.40 కోట్లకు సంబంధించిన పనులు కానీ నూటికి నూరు శాతం పూర్తి కాని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. నిబంధనలు కఠినంగా ఉన్నా.. నిబంధనలను పక్కన పెట్టి అడ్డదిడ్డంగా సీసీ రోడ్లు నిర్మించారే తప్ప.. ఎక్కడా బెర్ములు, డ్రైన్లు నిర్మించిన పాపాన పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్డు లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25 వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు ఇంతలా ఉన్నప్పటికీ వీటిని పక్కన పెట్టి బిల్లులు డ్రా చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో మండల ఇంజినీరింగ్ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతో పనులు జరక్కుండా బిల్లులు డ్రాచేస్తే తాము అడ్డంగా ఇరుక్కుంటామని ఆందోళన చెందుతున్నారు. విజిలెన్స్, మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా ఈ పనులను నిశితంగా పరిశీలిస్తుందని.. బిల్లుల్లో కానీ, పనుల నాణ్యతలో కానీ ఏ చిన్న తేడా వచ్చినా తమ బతుకులు రోడ్డున పడ్డట్టేనని నర్సీపట్నం డి విజన్‌కు చెందిన ఓ మండల ఇంజినీరింగ్ అధికారి సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా సరే మేం చూసుకుంటాం.. బిల్లులు పెట్టండి.. సొమ్ములు డ్రా చేయండంటూ ఎస్ఈ, ఈఈలు తమపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి: సంబంధిత జిల్లా అధికారులను వివరణ కోరితే ప్రభుత్వం నుంచి తమపై కూడా అదే రీతిలో ఒత్తిళ్లు వస్తున్నాయని.. తామేం చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ నెలాఖరులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేసినట్టుగా ఎంబుక్‌ల్లో నమోదు చేసి మొత్తం నిధులు స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. -
ఒక్క క్లిక్.. బోలెడు ఓచర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినప్పుడు ఆహ్వానించిన వారికి ఏదో ఒక తోచిన బహుమతిని చదివింపులుగా ఇవ్వడం గతంలో సంప్రదాయంగా ఉండేది. అయితే గుంపులో గోవిందలా కాకుండా తామిచ్చే బహుమతి ప్రత్యేకంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం ఎక్కడెక్కడో తిరిగి బహుమతులు కొనితెచ్చి ఇచ్చేవారు. కానీ ఇక్కడో సమస్య ఉందండోయ్.. ఇచ్చిన గిఫ్ట్ పుచ్చుకున్న వారికి నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు! అందుకే వారికి నచ్చిందే కొనుక్కునే అవకాశమిస్తే!...అది కూడా అదనపు రాయితీలనందిస్తూ ఇస్తే!! ఈ ఆలోచననే వ్యాపార సూత్రంగా మలుచుకుంది శ్రీహిత షాపింగ్ సర్వీసెస్ ప్రై.లి. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీ కిశోర్ కుమార్ రెడ్డి మాటల్లోనే.. ‘‘ప్రతీ షాపింగ్ మాల్ ఆఫర్లతో కస్టమర్లను రా..రమ్మంటుంటాయి. ఆ ఆఫర్లు, వాటికి సంబంధించిన ఓచర్లు, డిస్కౌంట్ కార్డులు కస్టమర్లకు సులభంగా అందడం కష్టమే. ఓ సౌకర్యాన్ని వాడుకునేందుకు ఓ యాప్. దానికి ప్రత్యామ్నాయం వెతికేందుకు ఓ ట్యాబ్, కూపన్‌ను వెతికేందుకు మరొకటి.. ఇలా ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో వచ్చే రాయితీలను ఆదా చేయడం కోసం వినియోగదారులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు’’ 8 ఏళ్లుగా రిటైల్ రంగంలో పనిచేసిన నాకు ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. అప్పుడే అనిపించింది షాపింగ్ సంస్థలు అందించే ఆఫర్లతో పాటూ ఓచర్‌తో కూడా మరికొంత రాయితీని అందిస్తే ఆ షాపింగ్ ఇంకా బాగుంటుందని! ఇంకేముంది డాక్టర్ విజయ్ భాస్కర్, లక్ష్మీనారాాయణతో కలిసి కోటి రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 2011లో శ్రీహిత షాపింగ్ సర్వీసెస్ ప్రై.లి. ప్రారంభించాం. 87 బ్రాండ్లతో ఒప్పందం.. ప్రతీ ఓచర్ మీద వినియోగదారుడికి వాల్యూ యాడెడ్ సర్వీసులను అందించడమే మా లక్ష్యం. అదెలాగంటే.. అప్పటికే షాపింగ్ మాల్స్ అందించే ఆఫర్లు, రాయితీలతో పాటుగా మా ఓచర్ కొనుగోలుపై కూడా అదనపు రాయితీలుంటాయి. అయితే కనీస ఆర్డర్ విలువ రూ.3 వేల నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా రివార్డ్ పాయింట్లకు వడ్డీ కూడా ఇస్తున్నాం. క్రెడిట్ కార్డ్‌లకు ఎలాగైతే రివార్డ్ పాయింట్లుంటాయో అలాగే మా ఓచర్ వినియోగదారులకు డిస్కౌంట్/రివార్డ్ పాయింట్లు ఇస్తాం. ఒకవేళ ఇచ్చిన రివార్డ్ పాయింట్లను వినియోగించుకోనట్లయితే తరువాతి నెలలో దానికి వడ్డీ కింద మరికొంత పాయింట్లను కలుపుతామన్నమాట. లైఫ్ స్టయిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా, మాస్టర్, షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, రిలయెన్స్ ట్రెండ్స్, సెంట్రల్ వంటి సుమారు 87 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఓచర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ దుకాణాల్లోనూ చెల్లుతాయి. మా వెబ్సైట్ నుంచి ఓచర్లు, కార్డులను మాత్రమే కాకుండా ఆర్టికల్స్, అపారెల్స్, గడియారాలు, లెదర్ గిఫ్ట్ వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు. విలువైన కస్టమర్లకు ఉచిత సేవలు అందిస్తాం. బీ2బీ టర్నోవర్ ఏటా రూ.15 కోట్లు.. ఇప్పటివరకు శ్రీమార్ట్ సర్వీసెస్ కింద బీ2బీ మార్కెట్లో కార్పొరేట్లకు లాయల్టీ ప్రొగ్రాం డిజైన్ చేసిచ్చే వాళ్లం. అంటే కార్పొరేట్లకు రిటైలర్లకు మధ్య వారధిగా ఓచర్ల రూపంలో సేవలందించేవాళ్లమన్నమాట. ప్రసు ్తతం బీ2బీ వ్యాపారంలో దాదాపు 300లకు పైగా కంపెనీలు కస్టమర్లుగా ఉన్నారు. ప్రతీ ఓచర్ మీద 2-20% దాకా మార్జిన్ ఉంటుంది. ఏటా బీ2బీ మార్కెట్లో రూ.15 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. బీ2సీలో.. ‘ఈ-ఓచర్ ఇండియా.కామ్’.. ఇటీవలే ‘ఈ-ఓచర్ ఇండియా.కామ్’ పేరుతో బీ2సీ మార్కెట్లోకి ప్రవేశించాం. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.5 వేల కోట్ల వ్యాపార అవకాశాలున్నాయి. కానీ, ప్రస్తుతం ప్రతి నెలా రూ.40 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. వ్యాపార విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. 2 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం చూస్తున్నాం. ఒకరిద్దరితో చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. రేడియేషన్ తగ్గించే ర్యాడ్బ్లాక్ చిప్ సెల్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్, కంప్యూటర్లు, వై-ఫై రూటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి విడుదలయ్యే రేడియేషన్, వాటి దుష్ప్రాభావాల నుంచి మనల్ని కాపాడేందుకు ర్యాడ్బ్లాక్ యాంటి రేడియేషన్ చిప్‌ను రూపొందించాం. 2011లో ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ ఈఎంఆర్ రీసెర్చ్ సెంటర్ ప్రై.లి. నుంచి ఇది 9వ వెర్షన్ చిప్. ర్యాడ్బ్లాక్ తయారీలో వాడే ముడిపదార్ధాలను రాడార్, జామర్ కమ్యూనికేషన్లలో వినియోగిస్తారు. ఈ చిప్‌కు అదనపు రక్షణ కోసం 24 క్యారెట్ల బంగారు పూత ఉంటుంది. ఈ చిప్ ఏపీ ఆన్లైన్, మెడ్‌ప్లస్, అపోలో, సంగీత, లాట్, బిగ్-సీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయెన్స్ డిజిటల్స్‌లో లభిస్తుంది. ధర రూ.999. -
ప్రింటింగ్ పేర... అరకోటి హాంఫట్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. దేవరకొండ బ్రాంచ్‌లో సుమారు రూ 18 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం మరవకముందే జిల్లా కేంద్ర బ్యాంకులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారన్న వార్త విస్మయ పరుస్తోంది. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో సహకార బ్యాంకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ శాఖలో అక్రమాలపై ముందస్తుగా అక్కడి బ్రాంచ్ మేనేజర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు డీసీసీబీలో ఉన్న డీజీఎం భద్రగిరిరావును దీర్ఘకాలిక సెలవు పెట్టించారు. అక్రమాలపై విచారణాధికారి సరైన నివేదిక ఇవ్వకపోవడంపై 2013 డిసెంబర్ 26న జరిగిన బోర్డు సమావేశంలో డెరైక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణాధికారిని దీర్ఘకాలపు సెలవు పెట్టించాలని తీర్మానం చేసి ఆమెతో సెలవు పెట్టించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను తె ప్పించి ఈ నెల 10న తిరిగి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రింటింగ్ పేర రూ అరకోటికి ఎసరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రిజిష్టర్లు, బ్రోచర్లు, ఓచర్లు, క్యాలెండర్లు, డైరీలు, ఇతర కరపత్రాల ముద్రణ పేరుతో సుమారు రూ 50లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా అవసరం లేకున్నా పట్టణంలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానికి లక్షల రూపాయల ఆర్డర్లు ఇచ్చి ముద్రించి బిల్లులను చెల్లించి వాటాలను పంచుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి సంఘాలకు, బ్రాంచీలకు పంపిణీ చేయడానికి వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో బ్యాంకు బ్రాంచీలను కంప్యూటీకరణ చేయడంతో లక్షలాది రూపాయలను వెచ్చించిన రిజిష్టర్లు పనికిరాకుండా పోయినట్లు, దీంతో వాటిని స్టోర్‌లో మూలనపడేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి టెండర్లూ పిలవకుండానే ఈ తతంగాన్ని గత ఐదారేళ్లుగా బ్యాంకులో కొనసాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని బ్యాంకు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై విచారణ జరుగుతోంది. బ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడానికి డీజీఎం నర్మదను విచారణాధికారిగా నియమించారు. అదేవిధంగా దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశామని బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డెరైక్టర్లు డిమాండ్ చేసినట్లుగా సీబీసీఐడీచే విచారణ జరిపిస్తే బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంత అనేది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.