ఒక్క క్లిక్.. బోలెడు ఓచర్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినప్పుడు ఆహ్వానించిన వారికి ఏదో ఒక తోచిన బహుమతిని చదివింపులుగా ఇవ్వడం గతంలో సంప్రదాయంగా ఉండేది. అయితే గుంపులో గోవిందలా కాకుండా తామిచ్చే బహుమతి ప్రత్యేకంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం ఎక్కడెక్కడో తిరిగి బహుమతులు కొనితెచ్చి ఇచ్చేవారు. కానీ ఇక్కడో సమస్య ఉందండోయ్.. ఇచ్చిన గిఫ్ట్ పుచ్చుకున్న వారికి నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు! అందుకే వారికి నచ్చిందే కొనుక్కునే అవకాశమిస్తే!...అది కూడా అదనపు రాయితీలనందిస్తూ ఇస్తే!! ఈ ఆలోచననే వ్యాపార సూత్రంగా మలుచుకుంది శ్రీహిత షాపింగ్ సర్వీసెస్ ప్రై.లి. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన జీ కిశోర్ కుమార్ రెడ్డి మాటల్లోనే..
‘‘ప్రతీ షాపింగ్ మాల్ ఆఫర్లతో కస్టమర్లను రా..రమ్మంటుంటాయి. ఆ ఆఫర్లు, వాటికి సంబంధించిన ఓచర్లు, డిస్కౌంట్ కార్డులు కస్టమర్లకు సులభంగా అందడం కష్టమే. ఓ సౌకర్యాన్ని వాడుకునేందుకు ఓ యాప్. దానికి ప్రత్యామ్నాయం వెతికేందుకు ఓ ట్యాబ్, కూపన్‌ను వెతికేందుకు మరొకటి.. ఇలా ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో వచ్చే రాయితీలను ఆదా చేయడం కోసం వినియోగదారులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు’’ 8 ఏళ్లుగా రిటైల్ రంగంలో పనిచేసిన నాకు ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. అప్పుడే అనిపించింది షాపింగ్ సంస్థలు అందించే ఆఫర్లతో పాటూ ఓచర్‌తో కూడా మరికొంత రాయితీని అందిస్తే ఆ షాపింగ్ ఇంకా బాగుంటుందని! ఇంకేముంది డాక్టర్ విజయ్ భాస్కర్, లక్ష్మీనారాాయణతో కలిసి కోటి రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా 2011లో శ్రీహిత షాపింగ్ సర్వీసెస్ ప్రై.లి. ప్రారంభించాం.
87 బ్రాండ్లతో ఒప్పందం..
ప్రతీ ఓచర్ మీద వినియోగదారుడికి వాల్యూ యాడెడ్ సర్వీసులను అందించడమే మా లక్ష్యం. అదెలాగంటే.. అప్పటికే షాపింగ్ మాల్స్ అందించే ఆఫర్లు, రాయితీలతో పాటుగా మా ఓచర్ కొనుగోలుపై కూడా అదనపు రాయితీలుంటాయి. అయితే కనీస ఆర్డర్ విలువ రూ.3 వేల నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా రివార్డ్ పాయింట్లకు వడ్డీ కూడా ఇస్తున్నాం. క్రెడిట్ కార్డ్‌లకు ఎలాగైతే రివార్డ్ పాయింట్లుంటాయో అలాగే మా ఓచర్ వినియోగదారులకు డిస్కౌంట్/రివార్డ్ పాయింట్లు ఇస్తాం.
ఒకవేళ ఇచ్చిన రివార్డ్ పాయింట్లను వినియోగించుకోనట్లయితే తరువాతి నెలలో దానికి వడ్డీ కింద మరికొంత పాయింట్లను కలుపుతామన్నమాట. లైఫ్ స్టయిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వీసా, మాస్టర్, షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, రిలయెన్స్ ట్రెండ్స్, సెంట్రల్ వంటి సుమారు 87 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఓచర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ దుకాణాల్లోనూ చెల్లుతాయి. మా వెబ్‌సైట్ నుంచి ఓచర్లు, కార్డులను మాత్రమే కాకుండా ఆర్టికల్స్, అపారెల్స్, గడియారాలు, లెదర్ గిఫ్ట్ వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు. విలువైన కస్టమర్లకు ఉచిత సేవలు అందిస్తాం.
బీ2బీ టర్నోవర్ ఏటా రూ.15 కోట్లు..
ఇప్పటివరకు శ్రీమార్ట్ సర్వీసెస్ కింద బీ2బీ మార్కెట్లో కార్పొరేట్లకు లాయల్టీ ప్రొగ్రాం డిజైన్ చేసిచ్చే వాళ్లం. అంటే కార్పొరేట్లకు రిటైలర్లకు మధ్య వారధిగా ఓచర్ల రూపంలో సేవలందించేవాళ్లమన్నమాట. ప్రసు ్తతం బీ2బీ వ్యాపారంలో దాదాపు 300లకు పైగా కంపెనీలు కస్టమర్లుగా ఉన్నారు. ప్రతీ ఓచర్ మీద 2-20% దాకా మార్జిన్ ఉంటుంది. ఏటా బీ2బీ మార్కెట్లో రూ.15 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం.
బీ2సీలో.. ‘ఈ-ఓచర్ ఇండియా.కామ్’..
ఇటీవలే ‘ఈ-ఓచర్ ఇండియా.కామ్’ పేరుతో బీ2సీ మార్కెట్లోకి ప్రవేశించాం. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.5 వేల కోట్ల వ్యాపార అవకాశాలున్నాయి. కానీ, ప్రస్తుతం ప్రతి నెలా రూ.40 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. వ్యాపార విస్తరణ కోసం తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. 2 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం చూస్తున్నాం. ఒకరిద్దరితో చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
రేడియేషన్ తగ్గించే ర్యాడ్‌బ్లాక్ చిప్
సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్, కంప్యూటర్లు, వై-ఫై రూటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి విడుదలయ్యే రేడియేషన్, వాటి దుష్ప్రాభావాల నుంచి మనల్ని కాపాడేందుకు ర్యాడ్‌బ్లాక్ యాంటి రేడియేషన్ చిప్‌ను రూపొందించాం. 2011లో ప్రారంభించిన మ్యాక్స్‌వెల్ ఈఎంఆర్ రీసెర్చ్ సెంటర్ ప్రై.లి. నుంచి ఇది 9వ వెర్షన్ చిప్. ర్యాడ్‌బ్లాక్ తయారీలో వాడే ముడిపదార్ధాలను రాడార్, జామర్ కమ్యూనికేషన్లలో వినియోగిస్తారు. ఈ చిప్‌కు అదనపు రక్షణ కోసం 24 క్యారెట్ల బంగారు పూత ఉంటుంది. ఈ చిప్ ఏపీ ఆన్‌లైన్, మెడ్‌ప్లస్, అపోలో, సంగీత, లాట్, బిగ్-సీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయెన్స్ డిజిటల్స్‌లో లభిస్తుంది. ధర రూ.999.