calendars
-
Pranay Patel-Wildlife photographer: క్లికింగ్
పదమూడు సంవత్సరాల వయసులోనే కెమెరాతో స్నేహం మొదలుపెట్టిన ప్రణయ్‌కి, ఇప్పుడు ఆ కెమెరానే ప్రాణం. అరణ్యానికి సంబంధించిన అద్భుతదృశ్యాలను అమితంగా ఇష్టపడే ప్రణయ్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాడు..... పదమూడు సంవత్సరాల వయసులో కెమెరాతో అనుబంధం పెంచుకున్నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రణయ్ పటేల్. అది ఆ వయసుకు మాత్రమే పరిమితమైన ఉత్సాహమై ఉంటే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ప్రణయ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేవాడు కాదు. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు. ఈ చిత్రాలు జాతీయ,అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. అడవిలో ఫొటోగ్రఫీ అనేది అంతా వీజీ కాదు. ‘మేము రెడీ. ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు’ అన్నట్లుగా ఉండదు అక్కడ. ఏ క్షణంలో ఏ అద్భుతం ఆవిష్కారం అవుతుందో తెలియదు. ఒళ్లంతా కెమెరా కన్నులై ఉండాలి. అడవి నాడి తెలిసిన ప్రణయ్‌కి ఈ విషయం తెలియనిదేమీ కాదు. అందుకే అడవిలోని అద్భుతదృశ్యాలను సమర్థవంతంగా పట్టుకోగలిగాడు. ‘లొకేషన్లోకి ప్రవేశించిన వెంటనే బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసి కెమెరా సెట్ చేసుకోవాలి. బోర్ కొట్టవచ్చు. అలసటగా అనిపించవచ్చు. అయితే మన లక్ష్యం...అద్భుత దృశ్యం అనే విషయాన్ని మరవకూడదు. ఓపికతో కూడిన నిరీక్షణ నన్ను ఎప్పుడూ నిరాశ పరచలేదు’ అంటాడు ప్రణయ్. ప్రణయ్ ఫొటోలతో రూపుదిద్దుకున్న ‘ది వండర్ఫుల్ వైల్డ్‌లైఫ్ ఆఫ్ గుజరాత్’ ‘ది బేర్స్ ఆఫ్ కమ్చట్క–రష్యా’ ‘ది వైల్డ్ ఎర్త్ ఆఫ్ ఆఫ్రికా’... మొదలైన క్యాలెండర్లకు ఎంతో పేరు వచ్చింది. గుజరాత్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే నియమించబడ్డాడు. ‘ఫొటోగ్రాఫర్‌కు దృశ్యజ్ఞానమే కాదు శబ్దజ్ఞానం కూడా ఉండాలి’ అంటున్న ప్రణయ్ శబ్దాల ద్వారా కూడా దృశ్యాలను ఊహించగలడు. వాటిని అందంగా ఛాయాచిత్రాలలోకి తీసుకురాగలడు. తన వెబ్సైట్ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రణయ్ అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో జరిగిన ఫొటోఎగ్జిబిషన్లలో పాల్గొన్నాడు. ‘వర్తమానం నుంచే కాదు గతం నుంచి కూడా ఎన్నో అద్భుత విషయాలను నేర్చుకోవచ్చు’ అంటున్న ప్రణయ్ అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలలోని అద్భుతాలను ఆసక్తిగా విశ్లేషిస్తుంటాడు. ‘ప్రతి ఫొటో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది’ అంటాడు ప్రణయ్. స్కూల్‌బ్యాగ్ మోసుకెళ్లాల్సిన వయసులో కెమెరా బ్యాగు మోసుకెళుతున్న ప్రణయ్‌కి వెక్కిరింపులు ఎదురయ్యాయి. ‘ఇక నీకు చదువు ఏం వస్తుంది!’ అని ముఖం మీదే అన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ మాటలు విని తాను ఎప్పుడూ బాధపడలేదు. వెనక్కి తగ్గలేదు. కెమెరాతో స్నేహం వీడలేదు. దేశవిదేశాలలో ప్రణయ్ చేసిన ఫొటోగ్రఫీ టూర్లు వంద దాటాయి. ‘ప్రతి టూర్‌కు సంబంధించిన అనుభవాలను ఒక పుస్తకంగా రాసుకోవచ్చు’ అని మురిసిపోతుంటాడు ప్రణయ్. ‘కెమెరా పట్టుకోగానే అద్భుతాలు చోటుచేసుకోవు. పర్ఫెక్ట్ షాట్ కోసం రోజులే కాదు సంవత్సరం పాటు ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటాడు ప్రణయ్. ఫొటోగ్రఫీ గురించి ఓనమాలు తెలియని వారే కాదు, ఆ విద్యలో కొమ్ములు తిరిగిన ఫొటోగ్రాఫర్లు కూడా ప్రణయ్‌ని ప్రశంసలతో ముంచెత్తున్నారు. 25 సంవత్సరాల ప్రణయ్ పటేల్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు ప్రణయ్. ఈ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ క్యాలెండర్లను అలంకరించాయి. -
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు రెడీ
తిరుమల: టీటీడీ ప్రచురించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. టీటీడీ వెబ్సైట్లో ‘పబ్లికేషన్స్’ను క్లిక్ చేసి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపి వీటిని ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి పోస్టులో వాటిని పంపిస్తారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్ చార్జీలు అదనం. విదేశాల్లోని భక్తులకు ఈ సదుపాయం ఉంది. ఇతర సమాచారం కోసం 0877–2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585లో ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించవచ్చు. 12 పేజీల క్యాలెండర్ రూ.130, పెద్ద డైరీ రూ.150, చిన్నడైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30గా ధర నిర్ణయించారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ శాలల్లో కూడా క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. -
డిజిటల్ ఇండియా: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. -
టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు ఆన్లైన్ బుకింగ్
తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)– 2018 డైరీలు, క్యాలెండర్ల కోసం భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో జేఈవో పోలా భాస్కర్‌తో కలసి ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వీటిని ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయొచ్చన్నారు. -
ప్రింటింగ్ పేర... అరకోటి హాంఫట్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. దేవరకొండ బ్రాంచ్‌లో సుమారు రూ 18 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం మరవకముందే జిల్లా కేంద్ర బ్యాంకులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారన్న వార్త విస్మయ పరుస్తోంది. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో సహకార బ్యాంకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ శాఖలో అక్రమాలపై ముందస్తుగా అక్కడి బ్రాంచ్ మేనేజర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు డీసీసీబీలో ఉన్న డీజీఎం భద్రగిరిరావును దీర్ఘకాలిక సెలవు పెట్టించారు. అక్రమాలపై విచారణాధికారి సరైన నివేదిక ఇవ్వకపోవడంపై 2013 డిసెంబర్ 26న జరిగిన బోర్డు సమావేశంలో డెరైక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణాధికారిని దీర్ఘకాలపు సెలవు పెట్టించాలని తీర్మానం చేసి ఆమెతో సెలవు పెట్టించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను తె ప్పించి ఈ నెల 10న తిరిగి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రింటింగ్ పేర రూ అరకోటికి ఎసరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రిజిష్టర్లు, బ్రోచర్లు, ఓచర్లు, క్యాలెండర్లు, డైరీలు, ఇతర కరపత్రాల ముద్రణ పేరుతో సుమారు రూ 50లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా అవసరం లేకున్నా పట్టణంలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానికి లక్షల రూపాయల ఆర్డర్లు ఇచ్చి ముద్రించి బిల్లులను చెల్లించి వాటాలను పంచుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి సంఘాలకు, బ్రాంచీలకు పంపిణీ చేయడానికి వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో బ్యాంకు బ్రాంచీలను కంప్యూటీకరణ చేయడంతో లక్షలాది రూపాయలను వెచ్చించిన రిజిష్టర్లు పనికిరాకుండా పోయినట్లు, దీంతో వాటిని స్టోర్‌లో మూలనపడేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి టెండర్లూ పిలవకుండానే ఈ తతంగాన్ని గత ఐదారేళ్లుగా బ్యాంకులో కొనసాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని బ్యాంకు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై విచారణ జరుగుతోంది. బ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడానికి డీజీఎం నర్మదను విచారణాధికారిగా నియమించారు. అదేవిధంగా దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశామని బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డెరైక్టర్లు డిమాండ్ చేసినట్లుగా సీబీసీఐడీచే విచారణ జరిపిస్తే బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంత అనేది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.