సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment