ప్రతీకాత్మక చిత్రం
‘తెల్లారి లేచింది మొదలు సెల్‌ఫోన్‌లో తలదూరుస్తారు. వాళ్లు ఉద్యోగాలు చేయడమే కష్టం. ఇక సైన్యంలో ఏం చేస్తారు!’ ‘మా రోజుల్లో గొప్ప దేశభక్తి భావన పొంగిపొర్లేది. ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తుందా? ఏమిటో ఈ కాలం!’ ... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. ‘గత కాలమే మేలు’ అనే భావనకు గురవుతుంటాం. అయితే ఒకసారి యువ ప్రపంచంలోకి తొంగిచూస్తే మనం ఊహించుకునేంత నిరాశాజనకమైన పరిస్థితి లేదనే విషయం అర్థమవుతుంది. దీనికి సోషల్ మీడియా ఒక అద్దంలా పనిచేస్తుంది.
కొంత కాలం క్రితం ఒక కాలేజీ విద్యార్థి తన ఫేస్‌బుక్ పేజీలో శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’లోని ‘మహాసంకల్పం’ లోని కొన్ని వాక్యాలు కోట్ చేశాడు. ‘రా నేస్తం! పోదాం, చూదాం మువ్వన్నెల జెండా పండుగ’.. ‘మన భారతజన సౌభాగ్యం... ఇది నా స్వాతంత్య్రదిన మహాసంకల్పం’.. కేవలం వాక్యాల ఉటంకింపుకు మాత్రమే పరిమితం కాకుండా యువతగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు.
లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో మన సైనికుల వీరమరణం యువతని బాగా కదిలించింది. ‘అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో, త్యాగాలకు సిద్ధం కావడం కూడా అంతే ముఖ్యం’ అంటూ తమ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. కల్నల్ సంతోష్‌బాబు ఇప్పుడు ఎంతోమంది యూత్‌కు ఆరాధ్యం. సూర్యాపేటలోని అతడి నిలువెత్తు విగ్రహం ఫొటోని తమ ఫేస్‌బుక్ పేజీలో పెట్టుకొని... ‘శత్రువుని వణికించిన సమరయోధుడా.. నిలువెల్లా ధైర్యమైన అసమాన వీరుడా.. నీ త్యాగాల బాటలో నడుస్తాం’ అని రాసుకునేవారు ఎంతోమంది కనిపిస్తారు.
‘సంతోష్‌బాబు సైన్యంలో చేరడానికి వాళ్ల నాన్న ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అలాంటి నాన్నలు ఉంటే మనకు ఎంతమంది సంతోష్‌బాబులు ఉండేవారో’ అని అంటాడు వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సంజీవ్. తండ్రుల సంగతేమిటోగానీ ఒడిశాలోని రాయ్‌పూర్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పంపన్న ‘సోల్జర్ ట్రైనింగ్ అకాడమీ రియల్‌ట్రస్ట్’(స్టార్ట్)ను ప్రారంభించి ఎంతోమంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. గతంలో సైన్యంలో చేరడం కోసం బెంగళూరులాంటి పట్టణాల్లో శిక్షణ తీసుకునేవారు. బాగా ఖర్చు అయ్యేది.
పంపన్న స్టోరీని షేర్ చేస్తూ... ‘ఇలాంటి పంపన్నలు జిల్లాకు ఒకరుంటే ఎంత బాగుంటుంది!’ అని రాసుకుంది నీరజ. కోల్‌కత్తాకు చెందిన మనీషా డిగ్రీ విద్యార్థి. ఉపన్యాస పోటీ కోసం ఒకసారి ‘ఉమెన్ ఎట్ వార్–సుభాష్‌చంద్రబోస్ అండ్ ది రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్’ పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనపై ఎంత ప్రభావం చూపిందంటే సైన్యంలో పనిచేయాలనే కోరిక మొలకెత్తింది. అది బలమైన ఆశయం అయింది. సామాజిక సేవలోనూ చురుకైన పాత్ర నిర్వహిస్తున్న రక్తం మండే, శక్తులు నిండే యువతను చూస్తుంటే ఆశాభావం అనే పతాకం స్వేచ్ఛగా ఎగురుతుంది.
చదవండి: Suraj Bhai Meena Real Story: అడవిలో ఆడపులి.. అక్కడ 80 పులులు.. అన్నింటి పేర్లు ఆమెకు తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment