Colonel Santosh Babu
-
భారత్‌ను చైనా ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నావ్?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత భూభాగంలోకి 2020లో చొచ్చుకొచ్చిన చైనా సైన్యంతో పోరాటంలో అమరుడైన తెలంగాణవాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని ప్రధాని మోదీ నాడు అవమానించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కల్నల్ సంతోష్‌బాబు మరణం అనంతరం ప్రధాని స్పందిస్తూ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని అబద్ధమాడారని దుయ్యబట్టారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించకపోతే సంతోష్‌బాబు ఎలా అమరుడయ్యారని ప్రశ్నించారు. భారత భూభాగంలో సుమారు 2 వేల చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమిస్తే ప్రధాని ఏం చేస్తున్నారని రాహుల్ నిలదీశారు. ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు భారత సైన్యం.. చైనా సైన్యంతో చర్చలు జరుపుతోందన్నారు. భారత్‌జోడో యాత్రలో భాగంగా గురువారం సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో 23 కి.మీ. మేర రాహుల్ పాదయాత్ర చేపట్టారు. యాత్రకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివంపేట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగట్టారు. భూముల కోసమే బీహెచ్ఈఎల్ ప్రైవేటీకరణ.. బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అన్ని రాష్ట్రాల్లో వేలాది ఎకరాల భూములున్నాయని, వాటిని మోదీ కార్పొరేట్ మిత్రులకు అప్పగించేందుకే ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దళితులు, ఆదివాసీల భూములు సైతం కేంద్రం లాక్కుంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నాయని మండిపడ్డారు. కొత్తగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు అనుమతులిస్తుంటే.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నారు.. దేశంలో నిరుద్యోగ సమస్యను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కావాలనే సృష్టిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. తద్వారా ప్రజలను ఎప్పుడూ భయాందోళనలో ఉంచి పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయని, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ, కర్ణాటకలో జీన్స్ పరిశ్రమలే ఇందుకు నిదర్శనమన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో గ్రానైట్ పరిశ్రమలో 2 లక్షల మంది నిరుద్యోగులయ్యారన్నారు. జీన్స్ పరిశ్రమతో 4 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. దేశ ప్రజల్లో ద్వేషం, ఆందోళన సృష్టించి ఒకరినొకరు కొట్టుకునేలా చేసి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల అభిమానం ఉన్నంత వరకు తన యాత్రను ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తూర్పు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్, గాలి అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శించడమంటే సూర్యునిపై ఉమ్మి వేసినట్టే అవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. రాహుల్ పాదయాత్రలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే భద్రతాలోపాలు తలెత్తాయని మధుయాష్కీ ఆరోపించారు. వీరకోలతో రాహుల్ సందడి సంగారెడ్డి టౌన్: భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగింది. యాత్ర సాగే క్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోతరాజుల విన్యాసాలను అనుకరిస్తూ వీరకోలతో నృత్యం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ జగ్గారెడ్డి చేతిలోని వీరకోల అందుకొని కాసేపు సరదాగా కొట్టుకొని పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. అంతకు ముందు అక్కడున్న కళాకారులతో కలసి నృత్యం చేశారు. వెల్డన్ జగ్గారెడ్డి.. భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి నియోజకవర్గంలో గురువారం జరిగిన యాత్రకు ఘన స్వాగతం లభించడంతో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని రాహుల్ అభినందించారు. వెల్డన్ జగ్గారెడ్డి అని కితాబిచ్చారు. అంతకుముందు సాయంత్రం పాదయాత్ర క్రమంలో నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండిపోయిన జగ్గారెడ్డి కోసం రాహుల్ కాసేపు వేచి చూశారు. జగ్గారెడ్డి వచ్చాక ఆయనతో కలసి మళ్లీ నడక ప్రారంభించారు. కాగా, శుక్రవారం రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారని.. శనివారం మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 7న జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. -
కల్నల్ సంతోష్‌బాబు సతీమణికి రూ.1.25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు సతీమణి బిక్కుమళ్ల సంతోషికి రూ.1.25 కోట్ల నగదు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. సంతోష్‌బాబు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘మహావీర్ చక్ర’ పురస్కారానికి ఎంపికైనందున.. నిబంధనల మేరకు ఈ నగదును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బి.సంతోషికి ఈ నగదును అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. (క్లిక్: దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు) -
ఏమిటో ఈ కాలం అని ఉసూరుమనొద్దు... యువ ప్రపంచం... ఆశా కిరణం
‘తెల్లారి లేచింది మొదలు సెల్ఫోన్లో తలదూరుస్తారు. వాళ్లు ఉద్యోగాలు చేయడమే కష్టం. ఇక సైన్యంలో ఏం చేస్తారు!’ ‘మా రోజుల్లో గొప్ప దేశభక్తి భావన పొంగిపొర్లేది. ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తుందా? ఏమిటో ఈ కాలం!’ ... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. ‘గత కాలమే మేలు’ అనే భావనకు గురవుతుంటాం. అయితే ఒకసారి యువ ప్రపంచంలోకి తొంగిచూస్తే మనం ఊహించుకునేంత నిరాశాజనకమైన పరిస్థితి లేదనే విషయం అర్థమవుతుంది. దీనికి సోషల్ మీడియా ఒక అద్దంలా పనిచేస్తుంది. కొంత కాలం క్రితం ఒక కాలేజీ విద్యార్థి తన ఫేస్బుక్ పేజీలో శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’లోని ‘మహాసంకల్పం’ లోని కొన్ని వాక్యాలు కోట్ చేశాడు. ‘రా నేస్తం! పోదాం, చూదాం మువ్వన్నెల జెండా పండుగ’.. ‘మన భారతజన సౌభాగ్యం... ఇది నా స్వాతంత్య్రదిన మహాసంకల్పం’.. కేవలం వాక్యాల ఉటంకింపుకు మాత్రమే పరిమితం కాకుండా యువతగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో మన సైనికుల వీరమరణం యువతని బాగా కదిలించింది. ‘అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో, త్యాగాలకు సిద్ధం కావడం కూడా అంతే ముఖ్యం’ అంటూ తమ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. కల్నల్ సంతోష్‌బాబు ఇప్పుడు ఎంతోమంది యూత్‌కు ఆరాధ్యం. సూర్యాపేటలోని అతడి నిలువెత్తు విగ్రహం ఫొటోని తమ ఫేస్బుక్ పేజీలో పెట్టుకొని... ‘శత్రువుని వణికించిన సమరయోధుడా.. నిలువెల్లా ధైర్యమైన అసమాన వీరుడా.. నీ త్యాగాల బాటలో నడుస్తాం’ అని రాసుకునేవారు ఎంతోమంది కనిపిస్తారు. ‘సంతోష్‌బాబు సైన్యంలో చేరడానికి వాళ్ల నాన్న ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అలాంటి నాన్నలు ఉంటే మనకు ఎంతమంది సంతోష్‌బాబులు ఉండేవారో’ అని అంటాడు వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సంజీవ్. తండ్రుల సంగతేమిటోగానీ ఒడిశాలోని రాయ్‌పూర్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పంపన్న ‘సోల్జర్ ట్రైనింగ్ అకాడమీ రియల్‌ట్రస్ట్’(స్టార్ట్)ను ప్రారంభించి ఎంతోమంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. గతంలో సైన్యంలో చేరడం కోసం బెంగళూరులాంటి పట్టణాల్లో శిక్షణ తీసుకునేవారు. బాగా ఖర్చు అయ్యేది. పంపన్న స్టోరీని షేర్ చేస్తూ... ‘ఇలాంటి పంపన్నలు జిల్లాకు ఒకరుంటే ఎంత బాగుంటుంది!’ అని రాసుకుంది నీరజ. కోల్‌కత్తాకు చెందిన మనీషా డిగ్రీ విద్యార్థి. ఉపన్యాస పోటీ కోసం ఒకసారి ‘ఉమెన్ ఎట్ వార్–సుభాష్‌చంద్రబోస్ అండ్ ది రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్’ పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనపై ఎంత ప్రభావం చూపిందంటే సైన్యంలో పనిచేయాలనే కోరిక మొలకెత్తింది. అది బలమైన ఆశయం అయింది. సామాజిక సేవలోనూ చురుకైన పాత్ర నిర్వహిస్తున్న రక్తం మండే, శక్తులు నిండే యువతను చూస్తుంటే ఆశాభావం అనే పతాకం స్వేచ్ఛగా ఎగురుతుంది. చదవండి: Suraj Bhai Meena Real Story: అడవిలో ఆడపులి.. అక్కడ 80 పులులు.. అన్నింటి పేర్లు ఆమెకు తెలుసు! -
కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. చదవండి: సిద్దిపేట లాల్ కమాన్‌పై ఉన్నట్టుండి వెలసిన కేసీఆర్ విగ్రహం కాగా భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో 2020 జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు. 16-బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. సంతోష్ 1982లో జన్మించారు. సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఆయన చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు. -
చైనీయులకు షాకిచ్చే త్రిశూల్.. వజ్ర..!
న్యూఢిల్లీ: పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం(పీఎల్ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. దీనిపై అపాస్టెరాన్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..‘చైనా బలగాలను ముఖాముఖి ఎదుర్కొనే సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలను తయారు చేయమంటూ భారత ఆర్మీ మాకు బాధ్యతలు అప్పగించింది. మేం రూపొందించిన త్రిశూల్, వజ్ర వంటి వాటిని చూసి ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్’ను తయారు చేశాం. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర.. ఇనుపరాడ్లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉండే ‘సప్పర్ పంచ్’అనే ఆయుధం ధరించి శత్రు సైనికుడిని కొడితే ఒకటీ రెండు దెబ్బలకే అతడు షాక్‌తో పడిపోవడం ఖాయం’అని మోహిత్ చెప్పారు. ‘ఈ ఆయుధాలను కేవలం భారత సైన్యం, భద్రతాబలగాల కోసం మాత్రమే రూపకల్పన చేశాం. ఇతర వ్యక్తులు లేదా సంస్థలకు వీటిని విక్రయించం’అని ఆయన అన్నారు. అయితే, వీటి తయారీ బాధ్యతలను ఆర్మీ ఎప్పుడు అప్పగించిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, నూతన రూపకల్పనలపై ప్రభుత్వం నుంచి గానీ, ఆర్మీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. #WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET — ANI (@ANI) October 18, 2021 చదవండి: గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. -
గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు..
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో ఉన్న గల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ తలెత్తి ఏడాది గడిచింది. చైనా దొంగ దెబ్బ తీయడంతో.. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20 మంది ముద్దుబిడ్డలు అమరులయ్యారు. అయితే, ఈ సంఘటనలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించారు. వారి కాల్పులకు మనవారు సైతం .. గట్టిగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ కాల్పులలో చైనాకు చెందిన 35 సైనికులు మరణించారు. గాల్వాన్ లోయలో అమరులైన మన దేశ ముద్దుబిడ్డలు.. వారి హోదా ఈ క్రింద ఇవ్వబడినాయి. ఆ భగవంతుడు వీర జవాన్ల ఆత్మకు శాంతిని, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 1. బి. సంతోష్ బాబు(కల్నల్) - సూర్యాపేట, తెలంగాణ 2. నాధూరం సోరెన్ ( నాయబ్ సుబేదార్) - మయూర్ బంజ్, ఒడిశా 3. మన్దీప్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - పాటియాల, పంజాబ్ 4. సత్నమ్ సింగ్ ( నాయబ్ సుబేదార్) - గురుదాస్‌పూర్, పంజాబ్ 5. కె. పళని (హవిల్దార్) - మధురై, తమిళనాడు 6. సునిల్ కుమార్ (హవిల్దార్) - పట్నా, బిహర్ 7. బిపుల్ రాయ్ ( హివిల్దార్) - మీరట్, ఉత్తర ప్రదేశ్ 8. దీపక్ కుమార్ (సిపాయి) - రీవా, మధ్యప్రదేశ్ 9. రాజేష్ అరంగ్ (సిపాయి) - బిర్భుమ్, పశ్చిమ బెంగాల్ 10. కుందన్ కుమార్ ఓజా (సిపాయి) - సాహిబ్ గంజ్, జార్ఖండ్ 11. గణేష్‌రామ్ (సిపాయి) - కాంకెర్, ఛత్తీస్‌ఘడ్ 12. చంద్రకాంత్ ప్రధాన్ (సిపాయి) - కందమాల్, ఒడిషా 13. గుర్విందర్ సింగ్ (సిపాయి) - సంగ్రూర్, పంజాబ్ 14. గుర్ తేజ్ సింగ్ (సిపాయి) - మాన్నా, పంజాబ్ 15. అంకుశ్ (సిపాయి) - హమిర్పూర్, హిమాచల్ ప్రదేశ్ 16. చందన్ కుమార్ ( సిపాయి) - భోజ్‌పూర్, బిహర్ 17. కుందన్ కుమార్ (సిపాయి) - సహస్ర, బిహర్ 18. అమన్ కుమార్ (సిపాయి) - సమస్తిపూర్, బిహర్ 19. జై కిశోర్ సింగ్ (సిపాయి) - వైశాలి, బిహర్ 20. గణేష్ హన్స్డ్ (సిపాయి) - తూర్పు సింగ్భమ్, జార్ఖండ్ -
కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
-
నేడు కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ
-
Suryapet: నేడు కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ
సాక్షి, సూర్యాపేట : వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఏర్పాటు, కోర్టు చౌరస్తాకు సంతోష్ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పు డు కార్యరూపం దాల్చబోతోంది. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్ర మం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరును నామ కర ణం చేస్తారని తెలిపారు. ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు పాత జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని చేపలు, పండ్ల మార్కెట్ బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తారని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. చదవండి: ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్ -
గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..
మాస్కో: భారత్, చైనా దేశాల మధ్య తూర్పు లద్ధాక్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జరిగిన ఘర్షణలో చైనాకే ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లిందని రష్యా న్యూస్ ఏజన్సీ టీఏఎస్ఎస్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. 2020 జూన్ 15న ఎల్ఏసీ వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. కాగా, ఈ ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటాపోటిగా సైనిక దళాలను సరిహద్దుల్లో మోహరించాయి. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సైనిక, దౌత్య చర్చలు పలు దశల్లో కొనసాగాయి. ఘర్షణ జరిగిన పది నెలల అనంతరం బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఇరు దేశాల మధ్య స్పష్టత వచ్చింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్లో ప్రస్తావించారు. -
పరమవీర చక్ర ఇస్తే బాగుండేది!
హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు మహావీర చక్ర అవార్డును అందించనున్నట్లు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ విషయంపై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ స్పందించారు. గాల్వాన్ లోయలో చైనాతో వీరుడికి మహావీర్ చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా, గర్వముగా ఉంది. కానీ, "100 శాతం సంతృప్తిగా లేను" అని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. ఆ మహావీరుడికి పరమవీర చక్ర పురస్కారం అందుకోవడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు.(చదవండి: చైనా యాప్‌లకు మరో భారీ షాక్!) మహావీర్ చక్ర పురస్కారాన్నితక్కువగా ఏమి చూడటం లేదు, కానీ పరమవీర చక్ర పురస్కారం దక్కితే పూర్తి న్యాయం జరిగేదని నా వ్యక్తిగత అభిప్రాయం. తన కుమారుడు చూపిన శౌర్యం రక్షణ దళాలలో పనిచేసే వారితో సహా చాలా మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం సంతోష్ బాబు లేకున్నా అందరి మనసుల్లో వున్నారు. సంతోష్ బాబులా ఆర్మీలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని సంతోష్ బాబు తండ్రి పేర్కొన్నారు. గల్వాన్ లోయలో గత ఏడాది 2020 జూన్ 15న జరిగిన భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన 20 మంది భారతీయ సైనికుల్లో 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బాబు కూడా ఉన్నారు. తన కుమారుడు అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించి చైనా దళాలతో వీరోచితంగా పోరాడానని మిస్టర్ ఉపేంద్ర అన్నారు. గత ఏడాది సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.ఐదు కోట్ల పరిహారం, అతని భార్యకు గ్రూప్ -1 పోస్టుతో పాటు హైదరాబాద్ లో నివాస స్థలం కూడా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. -
కల్నల్ సంతోష్‌బాబుకు మహావీరచక్ర
సాక్షి, సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్ 15న సంతోష్ వీరమణం పొందిన విషయం తెలిసిందే. చదవండి: (మన కనక రాజుకు పద్మశ్రీ) తండ్రి కల నెరవేర్చిన కుమారుడు.. దేశ సేవ చేయాలన్న తన తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ ఆశయాన్ని నెరవేర్చాడు సంతోష్‌బాబు. సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్ 1983లో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సూర్యాపేటలోని సంధ్య హై స్కూల్లో, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. పాఠశాలలో మౌర్య, గుప్తా హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. నేషనల్ ఢిపెన్స్ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్లో కల్నల్‌గా పదోన్నతి వచ్చింది. బిహార్ 16వ బెటాలియన్ కామాండింగ్ అధికారిగా ఉన్న కల్నల్ సంతోష్‌బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్ సంతోష్‌బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్‌బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్ అందజేశారు. కల్నల్ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.