సంగారెడ్డి పట్టణంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్. చిత్రంలో రేవంత్, ఉత్తమ్, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారత భూభాగంలోకి 2020లో చొచ్చుకొచ్చిన చైనా సైన్యంతో పోరాటంలో అమరుడైన తెలంగాణవాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని ప్రధాని మోదీ నాడు అవమానించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కల్నల్ సంతోష్‌బాబు మరణం అనంతరం ప్రధాని స్పందిస్తూ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని అబద్ధమాడారని దుయ్యబట్టారు.
దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించకపోతే సంతోష్‌బాబు ఎలా అమరుడయ్యారని ప్రశ్నించారు. భారత భూభాగంలో సుమారు 2 వేల చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమిస్తే ప్రధాని ఏం చేస్తున్నారని రాహుల్ నిలదీశారు. ఢిల్లీ విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు భారత సైన్యం.. చైనా సైన్యంతో చర్చలు జరుపుతోందన్నారు. భారత్‌జోడో యాత్రలో భాగంగా గురువారం సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో 23 కి.మీ. మేర రాహుల్ పాదయాత్ర చేపట్టారు. యాత్రకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివంపేట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా ఎండగట్టారు.
భూముల కోసమే బీహెచ్‌ఈఎల్ ప్రైవేటీకరణ..
బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అన్ని రాష్ట్రాల్లో వేలాది ఎకరాల భూములున్నాయని, వాటిని మోదీ కార్పొరేట్ మిత్రులకు అప్పగించేందుకే ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దళితులు, ఆదివాసీల భూములు సైతం కేంద్రం లాక్కుంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నాయని మండిపడ్డారు. కొత్తగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు అనుమతులిస్తుంటే.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్‌లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నారు..
దేశంలో నిరుద్యోగ సమస్యను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కావాలనే సృష్టిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. తద్వారా ప్రజలను ఎప్పుడూ భయాందోళనలో ఉంచి పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దుతో కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయని, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ, కర్ణాటకలో జీన్స్ పరిశ్రమలే ఇందుకు నిదర్శనమన్నారు.
జీఎస్టీ, నోట్ల రద్దుతో గ్రానైట్ పరిశ్రమలో 2 లక్షల మంది నిరుద్యోగులయ్యారన్నారు. జీన్స్ పరిశ్రమతో 4 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. దేశ ప్రజల్లో ద్వేషం, ఆందోళన సృష్టించి ఒకరినొకరు కొట్టుకునేలా చేసి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల అభిమానం ఉన్నంత వరకు తన యాత్రను ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తూర్పు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, షబ్బీర్ అలీ, వి. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్, గాలి అనిల్‌కుమార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శించడమంటే సూర్యునిపై ఉమ్మి వేసినట్టే అవుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. రాహుల్ పాదయాత్రలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే భద్రతాలోపాలు తలెత్తాయని మధుయాష్కీ ఆరోపించారు.
వీరకోలతో రాహుల్ సందడి
సంగారెడ్డి టౌన్: భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లతో మార్మోగింది. యాత్ర సాగే క్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోతరాజుల విన్యాసాలను అనుకరిస్తూ వీరకోలతో నృత్యం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ జగ్గారెడ్డి చేతిలోని వీరకోల అందుకొని కాసేపు సరదాగా కొట్టుకొని పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. అంతకు ముందు అక్కడున్న కళాకారులతో కలసి నృత్యం చేశారు.
వెల్‌డన్ జగ్గారెడ్డి..
భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సంగారెడ్డి నియోజకవర్గంలో గురువారం జరిగిన యాత్రకు ఘన స్వాగతం లభించడంతో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని రాహుల్ అభినందించారు. వెల్‌డన్ జగ్గారెడ్డి అని కితాబిచ్చారు. అంతకుముందు సాయంత్రం పాదయాత్ర క్రమంలో నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండిపోయిన జగ్గారెడ్డి కోసం రాహుల్ కాసేపు వేచి చూశారు. జగ్గారెడ్డి వచ్చాక ఆయనతో కలసి మళ్లీ నడక ప్రారంభించారు. కాగా, శుక్రవారం రాహుల్ విశ్రాంతి తీసుకోనున్నారని.. శనివారం మళ్లీ యాత్ర ప్రారంభమవుతుందని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 7న జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది.
Comments
Please login to add a commentAdd a comment