న్యూఢిల్లీ: పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం(పీఎల్‌ఏ) వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది.
ఈ సంస్థ త్రిశూల్, వజ్ర వంటి పేర్లతో ప్రాణహాని కలిగించని సంప్రదాయ ఆయుధాలకు రూపకల్పన చేసింది. దీనిపై అపాస్టెరాన్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘చైనా బలగాలను ముఖాముఖి ఎదుర్కొనే సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలను తయారు చేయమంటూ భారత ఆర్మీ మాకు బాధ్యతలు అప్పగించింది. మేం రూపొందించిన త్రిశూల్, వజ్ర వంటి వాటిని చూసి ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘శివుని చేతిలో త్రిశూలం స్ఫూర్తిగా తీసుకుని ‘త్రిశూల్’ను తయారు చేశాం. త్రిశూల్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది.
దీనిని తాకిన శత్రు సైనికుడు కొద్ది సెకన్లలోనే షాక్‌తో పడిపోతాడు. శత్రువుల వాహనాలను అడ్డుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా, వజ్ర.. ఇనుపరాడ్‌లాగా కనిపించే ఈ ఆయుధం మెరుపులాంటి షాక్ కలిగిస్తుంది. శత్రు సైనికులపై ముఖాముఖి పోరులో దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లకు పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉండే ‘సప్పర్ పంచ్’అనే ఆయుధం ధరించి శత్రు సైనికుడిని కొడితే ఒకటీ రెండు దెబ్బలకే అతడు షాక్‌తో పడిపోవడం ఖాయం’అని మోహిత్ చెప్పారు. ‘ఈ ఆయుధాలను కేవలం భారత సైన్యం, భద్రతాబలగాల కోసం మాత్రమే రూపకల్పన చేశాం. ఇతర వ్యక్తులు లేదా సంస్థలకు వీటిని విక్రయించం’అని ఆయన అన్నారు. అయితే, వీటి తయారీ బాధ్యతలను ఆర్మీ ఎప్పుడు అప్పగించిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కాగా, నూతన రూపకల్పనలపై ప్రభుత్వం నుంచి గానీ, ఆర్మీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
#WATCH 'Trishul' and 'Sapper Punch'- non-lethal weapons-developed by UP-based Apasteron Pvt Ltd to make the enemy temporarily ineffective in case of violent face offs pic.twitter.com/DmniC0TOET
— ANI (@ANI) October 18, 2021
Comments
Please login to add a commentAdd a comment