
న్యూఢిల్లీ : తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో వద్ద చైనా సైనికుడొకరు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ని అతిక్రమించి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అతడిని భారత సైన్యం పట్టుకుంది. అతడిని ప్రశ్నిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 19వ తేదీన లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో దారితప్పి ఎల్‌ఏసీని దాటి వచ్చిన చైనా కార్పొరల్ వాంగ్ యా లాంగ్‌ను భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని ప్రవేశం వెనుక గూడచార్య ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు సైనికుడి అదృశ్యంపై చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌కే) స్పందించింది. తమ సైనికుడిని వెంటనే సురక్షితంగా విడుదల చేయాలని భారత ఆర్మీ అధికారులను కోరింది.
ఈ మేరకు ఆదివారం ఉదయం ఆదేశ ఆర్మీఅధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చీకట్లో దారి తప్పి ప్రమాదవశాత్తూ భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడని, అతన్ని వెంటనే తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. అతనిపై ఎలాంటి చర్యలకు పాల్పడకుండా వదిలిపెట్టి సరిహద్దుల్లో శాంతిని కొనసాగించాలని చైనా ఆర్మీ పేర్కొంది. కాగా గల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల సైనిక అధికారుల చొరవతో సుదీర్ఘ చర్చల అనంతరం శాంతి నెలకొంది. అయితే చైనా సైనికుడు ప్రవేశంపై ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని భారత్.. అతన్ని విచారించిన అనంతరం విడుదల చేస్తామని తెలిపింది. అయితే అర్థరాత్రి వేళ చైనా జవాన్ సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించడం కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment