మోదీ, జిన్‌పింగ్‌ భేటీ సఫలం.. భారత బోర్డర్‌లో కీలక పరిణామం | Army Removed From Both Sides Of India-China Border At Eastern Ladakh | Sakshi
Sakshi News home page

మోదీ, జిన్‌పింగ్‌ భేటీ సఫలం.. భారత బోర్డర్‌లో కీలక పరిణామం

Published Fri, Oct 25 2024 9:13 AM | Last Updated on Fri, Oct 25 2024 10:56 AM

Army Removed From Both Sides Of India-China Border At Eastern Ladakh

ఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లడఖ్‌ ప్రాంతం నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు  భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇటీవల బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో భాగంగానే బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.

రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా భారత్‌, చైనా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా రెండు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందని భారత రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తూర్పు లఢఖ్‌ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు.

అలాగే, ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. లడఖ్ నుంచి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎల్‌ఏసీ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల బలగాలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మరికొన్ని రోజుల్లోనే డెస్పాంగ్‌, డెమ్చోక్‌ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను మళ్లీ ప్రారంభించనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో 2020 జూన్‌ 15న భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ సందర్బంగా భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. ఇదే సమయంలో చైనా కూడా తన సైన్యాన్ని కోల్పోయింది. దీంతో, నాటి నుంచి ఎల్‌ఏసీ వెంబడి రెండు దేశాల బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. అయితే, గాల్వాన్‌ దాడిలోనే తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు వీర మరణం పొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement