
స్వస్థలాల్లో ఓటు నమోదుపై ఈసీ విముఖత
న్యూఢిల్లీ: స్వస్థలాల్లో కంటే పౌరులు ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఓటరుగా పేరు నమోదుచేసుకుంటే మంచిదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ మంగళవారం వ్యాఖ్యానించారు. త్వరలో బిహార్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి అధికారులు ఓటర్ల జాబితాను తనిఖీ చేసి సవరించనున్న నేపథ్యంలో సీఈసీ ఓటర్ నమోదు అంశంపై మాట్లాడటం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో బూత్ లెవ్ ఆఫీసర్(బీఎల్‌ఓ)లనుద్దేశిస్తూ జ్ఞానేశ్ మాట్లాడారు.
‘‘వాస్తవానికి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారమైతే ఏ శాసనసభ నియోజకవర్గంలో అయితే ఓటరు నివసిస్తాడో అక్కడే అతనికి ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీలో నివసిస్తున్నారు. సొంతిల్లు బిహార్‌లోని పటా్నలో ఉంది. అయినాసరే మీరు ఢిల్లీలోనే ఓటర్‌గా పేరును నమోదుచేసుకోవాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు. ‘‘కొందరు గతంలో ఉన్న ప్రాంతంలో సంపాదించిన ఓటరు కార్డును అలాగే అట్టిపెట్టుకుని, కొత్త ప్రాంతంలో మరో ఓటర్ కార్డును సాధిస్తున్నారు. పోలింగ్ వేళ పాత ప్రాంతంలో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇది నేరం’’అని సమావేశంలో పాల్గొన్న కొందరు అధికారులు గుర్తుచేశారు.