4 టీవీ రిపోర్టర్‌తో బిహార్ ఓటరు
ఇదేమీ హాస్యంగా స్వీకరించవలసిన సంగతి కాదు. దేవుడు ఒకరికి ఒకరు అర్థం కాకుండా టీవీ రిపోర్టర్ లను, సామాన్యులను ఒకే చోట పుట్టించి ఈ లోకాన్ని అర్ధవంతం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడో తాత్వికంగా తర్కించవలసిన బిహార్ ఎన్నికల ‘బైట్’! ఆ రాష్ట్రంలో అక్టోబర్ 8, నవంబర్ 3 తేదీలలో పోలింగ్ జరిగింది. ఈ రోజు చివరిదైన మూడో విడత పోలింగ్ జరుగుతోంది. నాయకులు కూల్‌గా ఉన్నారు. ఓటర్లను కూల్‌గా ఉంచుతున్నారు. మీడియా వాళ్లే.. తమ కర్తవ్యాన్ని నిర్వహణలో భాగంగా శీతలం నుంచి ఉష్ణాన్ని పుట్టించే పనిలో ఉన్నారు. మొన్న ఒకనాడు ’బిహార్ తక్’ అనే ఒక లోకల్ టీవీ ఛానెల్ రిపోర్టర్ ముఖానికి మాస్క్ వేసుకుని గన్ మైక్ పట్టుకుని ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ పెద్దాయన దగ్గర వెళ్లి ఆయన ముఖం మీద మైక్ పెట్టాడు. ‘పెద్దాయనా పెద్దాయనా.. క్యా ఆప్ కే గావ్ మే వికాస్ పహుంచా హై’ అని అడిగాడు.
‘అభివృద్ధి మీ ఊరిదాకా వచ్చిందా?’ అని. వికాస్ అంటే అభివృద్ధి. పెద్దాయన కళ్లద్దాలలోంచి రిపోర్టర్ ప్రశ్నను విన్నాడు. ‘అభివృద్ధా! ఏమో సర్. అప్పుడు నేనిక్కడ లేను. జ్వరమొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లా..‘ అని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు దేశమంతటా వైరల్ అవుతోంది. వికాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? వికాస్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు వికాస్? ఎవరి వికాస్ అని మీమ్స్ వస్తున్నాయి. పెద్దాయన అమాయకంగా చెప్పినా ఉన్న విషయమే చెప్పాడని కొందరు ట్వీట్లతో చప్పట్లు, ఈలలు కొట్టారు. దేవుడు ఒకరికొకరు అర్ధంకాకుండా రిపోర్టర్ లను, ఓటర్లను పుట్టిస్తాడని మన అజ్ఞానాంధకారం కొద్దీ అనుకున్నా ఎన్నికల టైమ్ లో అందరికీ అన్నీ అర్థం చేయిస్తాడు గావును!
Comments
Please login to add a commentAdd a comment