srisri
-
సంఘర్షణ పర్వం
‘మానవ జీవితమే ఒక మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం/ నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే/ ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే’– ‘కురుక్షేత్రం’ చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన పాట ఇది. మానవ జీవితాన్నే మహాభారతంగా, మంచి చెడుల నడుమ నిత్యం జరిగే ఘర్షణగా ఆయన అభివర్ణించాడు. కాలాలు మారినా, తరాలు మారినా మంచి చెడుల మధ్య జరిగే ఘర్షణ సమసిపోయే పరిస్థితులు లేవు. భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితులు ఉండవేమో! ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని కూడా అన్నాడు శ్రీశ్రీ. ప్రపంచంలో దుర్బలులను పీడించే బలవంతుల జాతి ఉన్నంత వరకు ఘర్షణలు తప్పవు. ఘర్షణలు ముదిరినప్పుడు యుద్ధాలూ తప్పవు. అందుకే తన ‘నా దేశం నా ప్రజలు’ అనే ‘ఆధునిక మహాభారతం’లో శేషేంద్ర ఇలా అంటారు: ‘పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి/ నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు/ నేను సత్యాగ్రాహిని/ నా గుండెల్లో బద్దలవు తున్న అగ్నిపర్వతం/ నా గొంతులో గర్జిస్తున్న జలపాతం’. ఎగుడు దిగుడు సమాజం ఉన్నంత వరకు మనుషులకు సంఘర్షణ తప్పదు. సంఘర్షణే ఊపిరిగా బతకక తప్పదు. అనాది నుంచి ఈ సంఘర్షణే సాహిత్యానికి ముడి సరుకు. మన భారతీయ సాహిత్యంలో తొలినాటి కావ్యాలు రామాయణ, మహాభారతాలు. వాల్మీకి విరచిత రామాయణం ఆదర్శ జీవితానికి అద్దం పడుతుంది. వ్యాసుడు రచించిన మహాభారతం వాస్తవ ప్రపంచాన్ని కళ్లకు కడుతుంది. ఆధునిక సాహిత్యంలోనూ అనేక రచనలకు ప్రేరణగా నిలిచిన కావ్యాలు రామాయణ, మహాభారతాలు. రామాయణ, మహాభారత గాథల నేపథ్యంలో దాదాపు అన్ని భారతీయ భాష ల్లోనూ అనేక కథలు, నాటకాలు, నవలలు వెలువడ్డాయి. కొన్ని సినిమాలుగా తెరకెక్కాయి. మన తెలుగు సాహిత్యం మహాభారత అనువాదంతోనే మొదలైంది. నన్నయ మొదలుపెట్టిన మహా భారత అనువాదాన్ని తిక్కన, ఎర్రనలు వేర్వేరు కాలాల్లో పూర్తి చేశారు. తెలుగులో మాత్రమే కాదు, మన దేశంలోని అన్ని భాషల్లోనూ తొలినాటి కవులు రామాయణ, మహాభారతాలను కావ్యాలుగా రాశారు. మన పొరుగు భాష కన్నడంలో పంపన ‘విక్రమార్జున విజయం’ రాశాడు. ఇది ‘పంప భారతం’గా ప్రసిద్ధి పొందింది. మహాభారతంలోనే కాదు, అమృతోత్సవ భారతంలోనూ అనేకానేక ఘర్షణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సంక్లిష్టమైన మానవ జీవితంలోని నిత్య ఘర్షణలను ప్రతిఫలించి, సమాజంలోని చెడును చెండాడి, మంచివైపు మొగ్గుచూపేదే ఉత్తమ సాహిత్యంగా కాలపరీక్షను తట్టుకుని తరతరాల వరకు మనుగడలో ఉంటుంది. కాలక్షేపం కోసం రాసే ఆషామాషీ రచనలు కాలప్రవాహంలో ఆనవాలే లేకుండా కొట్టుకుపోతాయి. ‘రచయిత తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను’ అన్నారు రావి శాస్త్రి. భాషా ప్రాంతాలకు అతీతంగా రచయితలకు ఈ ఎరుక ఉండి తీరాలి. అలాంటి ఎరుక కలిగిన రచయితలు మనకు చాలామందే ఉన్నారు. అయితే, వారిలో గుర్తింపు కొందరికే దక్కుతోంది. ఒక ఎరుక కలిగిన రచయితకు గుర్తింపు దక్కినప్పుడు సాహితీ లోకం సంబరపడుతుంది. సుప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్పకు ‘పద్మభూషణ్’ దక్కడం అలాంటి సందర్భమే! ఆధునిక కన్నడ రచయితల్లో భైరప్పకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారత గాథ మర్మాలను విశదీకరిస్తూ, ఆనాటి ఆచారాలను, అంధ విశ్వాసాలను తుత్తునియలు చేస్తూ ఆయన రాసిన ‘పర్వ’ నవల ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ‘పర్వ’లో కోపోద్రిక్తురాలైన ద్రౌపది ‘ఆర్య ధర్మ మంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల సహవాసం, స్వయంవరం పేరుతో రాచకన్యలను అపహ రించి పెళ్లాడటం, కనీసం పదిమంది దాసీలనైనా పెళ్లి కానుకలుగా తెచ్చుకుని వాళ్లతో సుఖించడం’ అని నిరసిస్తుంది. ‘పర్వ’ నవలలో ఇదొక మచ్చుతునక మాత్రమే! ఇంత బట్టబయలుగా రాసేస్తే ఛాందసులు ఊరుకుంటారా? అందుకే, భైరప్పను కీర్తిప్రతిష్ఠలు వరించడంతో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి. ఆయన రాసిన ‘వంశవృక్ష’, ‘తబ్బలియు నీనాదె మగనె/ గోధూళి’ వంటి రచనలపైనా వివాదాలు రేగాయి. ‘వంశవృక్ష’ తెలుగులో ‘వంశవృక్షం’ పేరుతో బాపు దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. భైరప్ప 1996లో తన ఆత్మకథను ‘భిత్తి’ పేరుతో వెలుగులోకి తెచ్చారు. ఇది పదకొండు పునర్ముద్రణలను పొందింది. ఆయన నవలల్లో ‘దాటు’, ‘పర్వ’ వంటివి తెలుగులోనూ అనువాదం పొందాయి. సంఘర్షణలమయమైన మహాభారతాన్ని ‘పర్వ’గా అందించిన భైరప్ప జీవితంలోనూ అనేక ఘర్షణలు ఉన్నాయి. బాల్యంలోనే తల్లి, సోదరులు ప్లేగు వ్యాధికి బలైపోయారు. చిన్నా చితకా పనులు చేసుకుంటూనే ఉన్నత చదువులు చదివి, అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. స్వయంగా అనుభవించిన సంఘర్షణల వల్ల జీవితంపై తనదైన దృక్పథాన్ని ఏర్పరచుకుని, రచనా వ్యాసంగం మొదలుపెట్టి, సాహితీరంగంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. సంఘర్షణలు రాటుదేల్చిన రచయిత చేసే రచనల్లో జీవన సంఘర్షణలు ప్రతిఫలిస్తాయి. అవి ఆ రచయిత రచనలను అజరామరం చేస్తాయి. -
ఏమిటో ఈ కాలం అని ఉసూరుమనొద్దు... యువ ప్రపంచం... ఆశా కిరణం
‘తెల్లారి లేచింది మొదలు సెల్ఫోన్లో తలదూరుస్తారు. వాళ్లు ఉద్యోగాలు చేయడమే కష్టం. ఇక సైన్యంలో ఏం చేస్తారు!’ ‘మా రోజుల్లో గొప్ప దేశభక్తి భావన పొంగిపొర్లేది. ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తుందా? ఏమిటో ఈ కాలం!’ ... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. ‘గత కాలమే మేలు’ అనే భావనకు గురవుతుంటాం. అయితే ఒకసారి యువ ప్రపంచంలోకి తొంగిచూస్తే మనం ఊహించుకునేంత నిరాశాజనకమైన పరిస్థితి లేదనే విషయం అర్థమవుతుంది. దీనికి సోషల్ మీడియా ఒక అద్దంలా పనిచేస్తుంది. కొంత కాలం క్రితం ఒక కాలేజీ విద్యార్థి తన ఫేస్బుక్ పేజీలో శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’లోని ‘మహాసంకల్పం’ లోని కొన్ని వాక్యాలు కోట్ చేశాడు. ‘రా నేస్తం! పోదాం, చూదాం మువ్వన్నెల జెండా పండుగ’.. ‘మన భారతజన సౌభాగ్యం... ఇది నా స్వాతంత్య్రదిన మహాసంకల్పం’.. కేవలం వాక్యాల ఉటంకింపుకు మాత్రమే పరిమితం కాకుండా యువతగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో మన సైనికుల వీరమరణం యువతని బాగా కదిలించింది. ‘అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ఎంత ముఖ్యమో, త్యాగాలకు సిద్ధం కావడం కూడా అంతే ముఖ్యం’ అంటూ తమ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. కల్నల్ సంతోష్‌బాబు ఇప్పుడు ఎంతోమంది యూత్‌కు ఆరాధ్యం. సూర్యాపేటలోని అతడి నిలువెత్తు విగ్రహం ఫొటోని తమ ఫేస్బుక్ పేజీలో పెట్టుకొని... ‘శత్రువుని వణికించిన సమరయోధుడా.. నిలువెల్లా ధైర్యమైన అసమాన వీరుడా.. నీ త్యాగాల బాటలో నడుస్తాం’ అని రాసుకునేవారు ఎంతోమంది కనిపిస్తారు. ‘సంతోష్‌బాబు సైన్యంలో చేరడానికి వాళ్ల నాన్న ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అలాంటి నాన్నలు ఉంటే మనకు ఎంతమంది సంతోష్‌బాబులు ఉండేవారో’ అని అంటాడు వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సంజీవ్. తండ్రుల సంగతేమిటోగానీ ఒడిశాలోని రాయ్‌పూర్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పంపన్న ‘సోల్జర్ ట్రైనింగ్ అకాడమీ రియల్‌ట్రస్ట్’(స్టార్ట్)ను ప్రారంభించి ఎంతోమంది యువతీయువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. గతంలో సైన్యంలో చేరడం కోసం బెంగళూరులాంటి పట్టణాల్లో శిక్షణ తీసుకునేవారు. బాగా ఖర్చు అయ్యేది. పంపన్న స్టోరీని షేర్ చేస్తూ... ‘ఇలాంటి పంపన్నలు జిల్లాకు ఒకరుంటే ఎంత బాగుంటుంది!’ అని రాసుకుంది నీరజ. కోల్‌కత్తాకు చెందిన మనీషా డిగ్రీ విద్యార్థి. ఉపన్యాస పోటీ కోసం ఒకసారి ‘ఉమెన్ ఎట్ వార్–సుభాష్‌చంద్రబోస్ అండ్ ది రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్’ పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనపై ఎంత ప్రభావం చూపిందంటే సైన్యంలో పనిచేయాలనే కోరిక మొలకెత్తింది. అది బలమైన ఆశయం అయింది. సామాజిక సేవలోనూ చురుకైన పాత్ర నిర్వహిస్తున్న రక్తం మండే, శక్తులు నిండే యువతను చూస్తుంటే ఆశాభావం అనే పతాకం స్వేచ్ఛగా ఎగురుతుంది. చదవండి: Suraj Bhai Meena Real Story: అడవిలో ఆడపులి.. అక్కడ 80 పులులు.. అన్నింటి పేర్లు ఆమెకు తెలుసు! -
ఉస్మానియాతో నా ఊసులు
ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్ సిండికేట్ వారు ‘నవత’ పేరుతో ఒక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభోత్సవా నికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్!’’ అని నేనన్నమాటే ‘సృజన’ స్థాపనకు దారి తీసింది. నేను 1962–64 మధ్యకాలంలో ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ. చదివి నప్పటి కొన్ని జ్ఞాపకాల్ని పాఠకులతో పంచుకోవాలని ఆ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఉస్మానియాకు రప్పించిన ఉత్తరం నేను వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఏ (1958–1962) ప్యాస య్యాక చదువు ముగించి యేదన్నా ఉద్యోగం చూసుకోవాలన్నాడు మా నాయన గారు. ‘‘నిన్ను హైదరాబాద్ పంపించి ఎం.ఎ. చదివించేంత ఆర్థిక స్తోమత లేద’’ని ఆయన కచ్చితంగా చెప్పేశాడు. నాకేమో ఎం.ఎ. చదవాలన్న కోరిక గాఢంగా ఉండేది. ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీలోనే ఎం.ఎ. చదవా లన్న కోరిక ఎలా కల్గిందో చెప్పాలి– బీఏ చదువుతున్న రోజుల్లోనే నాకు ఆత్మీయులైన వరవరరావు, గంట రామారెడ్డి హైదరాబాద్‌లో ఎం.ఎ. చదువుతున్నారు. నాకూ, ఈ మిత్రులకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతుండేవి. ఒకసారి వరవరరావు ఓ పెద్ద ఉత్తరంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప¯Š ఎంత అందంగా ఉంటుందో రాశాడు. తనుండే ‘జు’ హాస్టల్ ముందు రోడ్డుకు ఇరుపక్కలా వరసగా ఎన్నో బొండుమల్లె చెట్లు ఉంటాయనీ, తెల్లవారి రోడ్డంతా ఈ బొండుమల్లెపూలు తెల్లగా పరచుకునే ఉంటాయనీ, చలికాలంలో మంచు బిందువులతో నిండిన ఆ పూలను చూడటం అద్భుతమైన అనుభవం అనీ, ఈ అపూర్వ దృశ్యాలకు నీ కళ్లు తెరచుకోవాలంటే నువ్వొకసారి ఇక్కడకు రావాలనీ ఆ 12 పేజీల ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం ఐదారుసార్లు చదువుకున్నాక, ఉస్మానియా క్యాంపస్ చూసి రావాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతున్న మిత్రులు శివకుమార్, తిరుపతయ్య, సత్యనారాయణరెడ్డిలను కూడా రావటానికి ఒప్పించి, 1960 జనవరిలో, మంచి చలికాలంలో హైదరాబాద్ వెళ్లి ‘జు’ హాస్టల్లో వరవరరావు ఉంటున్న రూంలోనే బస చేశాం. వరవరరావు, గంటా రామన్నలు సంతోషించి క్యాంపస్ అంతా తిప్పారు. మొట్టమొదలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చూపించారు. ఆ అద్భుత భవనాన్ని చూసి నేనెంత థ్రిల్లయ్యానో చెప్పలేను. ఆ ఆర్కిటెక్చర్ కళ్లు మిరి మిట్లు గొల్పింది. క్లాస్‌రూమ్స్, లాంజులు, వరండాలు కలలో చూస్తున్న దృశ్యాలుగా కనిపించాయి. మరుక్షణంలోనే, ఈ కాలేజీలో చదువుకునే అవ కాశాన్ని పొందకపోతే ఈ జన్మ వృథా అనుకున్నాను. వసతిగృహం–వామపక్ష శిబిరం మా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోయినా, మా నాయన గార్కి నేను ఎం.ఎ. చదవడం ఇష్టం లేకపోయినా నేనే మొండి ధైర్యంతో కొందరు మిత్రుల సహాయంతో ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. (ఎకనామిక్స్)లో చేరిపో యాను. ఎం.ఎ. తెలుగు కానీ, పొలిటికల్ సైన్స్ కానీ చెయ్యాలనుకున్నాను. కానీ ఎకనామిక్స్‌తో చేస్తే త్వరగా ఉద్యోగం దొరుకుతుందని వరవరరావు, రామన్న చెప్పడం వల్ల అందులో చేరాను. ‘జు’ హాస్టల్లో అడ్మిషన్ దొరికింది. కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి మాకు రూంమేట్. వరవరరావు మా రూంకొచ్చినప్పుడు మేం చర్చించుకుంటూ ఉంటే జైపాల్‌రెడ్డి కూడా పాల్గొనే వాడు. ఒకరోజు వరవరరావు సిటీలో జరిగిన సీపీఐ నాయకుడు ఎస్ఏ డాంగే పాల్గొన్న సభకు వెళ్లొచ్చి రూంకొచ్చాడు. డాంగే ఉపన్యాసం ఎంత గొప్పగా ఉందో, యేయే విషయాలను గూర్చి మాట్లాడాడో చెప్పడం మొదలెట్టాడు. అదంతా వింటున్న జైపాల్‌రెడ్డి ‘‘డాంగే అంటే మీకంత ఇష్టమా?’’ అని ప్రశ్నించి, డాంగేను, కమ్యూనిస్టు పార్టీని విమర్శించటం మొదలెట్టాడు. ఆ రోజుల్లో జైపాల్‌రెడ్డికి సి. రాజగోపాలచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ అంటే చాలా అభిమానం. స్వతంత్ర పార్టీ ముఖ్యంగా నెహ్రూగారు అమలు చేస్తున్న కొన్ని వామపక్ష విధానాలను వ్యతిరేకించటానికే స్థాపించారు. ఆరోజు నేను, వరవరరావు ఒకపక్క; జైపాల్‌రెడ్డి ఒక పక్క–దాదాపు రెండుగంటల సేపు వాదించుకున్నాం. ‘జు’ హాస్టల్లో ఉన్నన్ని రోజులు జైపాల్‌రెడ్డి, ఆయన మిత్ర బృందానికీ, మా మిత్ర బృందానికీ మధ్య వాదనలు జరుగుతూనే ఉండేవి. శ్రీశ్రీ వర్గంతో విశ్వనాథ వర్గం డీ ఒక్క రాజకీయాల్లోనే కాదు, సాహిత్యంలో కూడా విద్యార్థులం రెండు వర్గా లుగా చీలిపోయి వాదించుకునేవాళ్లం. ఒకటి శ్రీశ్రీ వర్గం, మరొకటి విశ్వనాథ వర్గం–వరవరరావు, నేను, సి. రాఘవాచారి లాంటి వాళ్లం శ్రీశ్రీ వర్గంగా; మాదిరాజు రంగారావు, ముదిగొండ వీరభద్రయ్య, వే. నరసింహారెడ్డి విశ్వ నాథ వర్గంగా ఉండేవాళ్లం. అందరం స్నేహంగానే ఉండేవాళ్లం కానీ, తీవ్ర మైన వాదోపవాదాలు జరుగుతుండేవి. ఇక్కడే సాహిత్యానికి సంబంధించిన ఒక ఉదంతాన్ని చెప్పాలి. ఒకసారి ముదిగొండ వీరభద్రయ్య రూంలో కూర్చొని వాదించుకుంటున్నాము. ఆ వాదనలో ‘‘కాదేదీ కవితకనర్హం’’ అన్న శ్రీశ్రీ మాటను కోట్ చేసి ‘‘ప్రతీది కవితా వస్తువు ఎలా అవుతుంద’’ని వీరభద్రయ్య అంటే, ఎందుకు కాదు అని మేం–అప్పుడు నాకు మార్లిన్‌మన్రో గుర్తొచ్చింది. మార్లిన్ మన్రో అంటే మేం చాలా ఇష్టపడేవాళ్లం. నేను వరవరరావుతో ‘‘మార్లిన్‌మన్రో మీద నువ్వో కవిత రాయాలి’’ అన్నాను. ఆ మాట వినగానే వీరభద్రయ్య ‘‘సెక్స్‌కు సింబల్ అయిన మార్లిన్‌మన్రో కూడా కవితావస్తువు అవుతుందా?’’ అన్నాడు. ‘‘ఎందుకు కాదు’’ అన్న వరవరరావు వెంటనే తన రూంకు వెళ్లి మార్లిన్‌మన్రో మీద ఒక కవిత రాసేశాడు. దాన్ని చదివి మేమంతా చాలా బావుందన్నాం. ఆ కవితను వరవరరావు అప్పుడే బాపు–రమణల సంపాదకత్వంలో వెలువ డ్తున్న ‘జ్యోతి’ మాసపత్రికకు పంపించాడు. ఆ కవితకు బాపు చక్కని మార్లిన్ మన్రో చిత్రాన్ని వేసి ప్రచురించాడు. దాన్ని వరవరరావు మాకు చూపించిన ప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యామో! తర్వాత ఆ కవితకు పారితోషికంగా రూ.10 మనియార్డర్ చేస్తే, అందరం సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్ హోట ల్కు వెళ్లి టీ తాగాం. పాఠం వదిలి పథేర్పాంచాలికి నేను క్లాస్ అటెండ్ చేసినప్పుడు మాత్రం చాలా డిస్సపాయింట్ అయ్యాను. క్లాస్ తీసుకున్న ముస్లిం ప్రొఫెసర్‌గారు చాలాకాలం ఉర్దూ మీడియంలో పాఠాలు చెప్పాడట. ఉర్దూలో రాసుకున్న నోట్స్ ముందు పెట్టుకొని, అతి కష్టంగా ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తూ పాఠం చెప్పాడు. మిగతా లెక్చరర్లు కూడా అంతే. నాకస్సలు కూర్చోబుద్ధి కాకపోయేది. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఆరోజుల్లో ఎం.ఎ. ఎకనామిక్స్ స్టూడెంట్స్‌కు క్లాసులు మొదటి మూడు రోజులు ఆర్ట్స్ కాలేజీలోనూ, తర్వాతి మూడురోజులు నిజాం కాలేజీ లోనూ జరిగేవి. నిజాం కాలేజీలో మాకు ప్రొఫెసర్ జసవాలా అనే ఆమె క్లాసులు తీసుకునేది. మేం రెండు సిటీ బస్సులు మారి వెళ్తే, ‘మేడం ఈరోజు క్లాసు తీసుకోవటంలేదు’ అని అక్కడుండే మరో లెక్చరర్‌గారు చెప్పేవాడు. ఎట్లాగూ సిటీకొచ్చాం, క్లాసు లేదు. యేదైనా సినిమాకు వెళ్దాం అని మార్నిం గ్షోలు నడుస్తున్న థియేటర్‌కు పరిగెత్తేవాళ్లం. గురుదత్ నిర్మించిన ‘ప్యాసా’ అన్నా, ‘కాగజ్కేపూల్’ అన్నా విపరీతమైన ఇష్టం. ఎన్నిసార్లు చూశానో! ఆ రోజుల్లోనే లిబర్టీ టాకీసులో సత్యజిత్‌రే ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’, ‘తీన్‌కన్యా’, ‘చారులత’ లాంటి సినిమాల్ని ప్రత్యేక ప్రదర్శ నలుగా ప్రదర్శించేవాళ్లు. క్లాసులు ఎగ్గొట్టి వరవరరావు, నేను పరిగెత్తేవాళ్లం. ఇలా ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో సినిమాలు, వామపక్ష రాజకీ యాలు; శ్రీశ్రీ–విశ్వనాథల సాహిత్యం–ఈ మూడింటితోటే గడిచిపోయింది. అటు కృష్ణమీనన్, ఇటు కృపలానీ.. ఆరోజుల్లోనే సి. రాఘవాచారి మంచి మిత్రుడయ్యాడు. మొదలు మాకు వరం గల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే మిత్రుడు. మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లో ఆయన లా కాలేజీలో చదువుతున్నాడు. ఆయనకు మొదట్నించి సీపీ ఐలో సభ్యత్వం ఉండేది. ఆయన లా కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్య క్షునిగా పోటీ చేసినప్పుడు నేనూ, వరవరరావు ప్రచారం చేశాం. ఆయన గెల్చాడు. ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకసారి లా కాలేజీలో వి.కె. కృష్ణ మీనన్ ఉపన్యాసం ఏర్పాటు చేశాడు. కృష్ణమీనన్ ఉపన్యాసం అంటే మాకు ఎనలేని అభిమానం. కొందరు రైటిస్టు విద్యార్థులు ఆ ఉపన్యాసాన్ని అడ్డుకో వాలని ప్రయత్నించారు. ఆరోజు కృష్ణమీనన్ గొప్ప ఉపన్యాసం చేశాడు. మేం ఎంత ఎక్సైట్ అయ్యామో చెప్పలేను. మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లోనే (1962లో) నార్త్ బొంబాయి నియోజకవర్గం నుండి పార్లమెంట్‌కు కాంగ్రె¯Š నుంచి కృష్ణమీనన్, రైటిస్టు పార్టీలన్నింటి తరఫున ఆచార్య కృపలాని పోటీ చేశారు. మా మిత్రబృంద మంతా కృష్ణమీనన్ గెలుస్తాడనీ; జైపాల్‌రెడ్డి, మిత్రబృందమంతా కృపలానీ గెలుస్తాడనీ వాదించుకునేవాళ్లం. కృష్ణమీనన్ 3 లక్షల మెజార్టీతో గెలిచాడని తెలిశాక పెద్ద పండుగ చేసుకున్నాం. అయితే మా సంతోషం ఎంతోకాలం నిలువలేదు. మీనన్ గెల్చిన కొద్ది నెలల తర్వాత–అంటే నవంబర్ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగలటంతో కృష్ణమీనన్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ వార్త తెలిశాక ‘జు’ హాస్టల్ ముందున్న బషీర్ క్యాంటీన్ వద్ద కృపలానీని సమర్థించిన బృందం పెద్ద పండుగ చేసుకుంటోంటే అప్పుడే అక్కడికి టీ తాగటానికి వెళ్లిన మేం యేమీ మాట్లాడలేని పరిస్థితి యేర్పడింది. శ్రీశ్రీని చూద్దామని వెళితే... ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్ సిండికేట్ అనే సంస్థ వారు ‘నవత’ పేరుతో ఒక త్రైమాసిక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభో త్సవానికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. సరిగ్గా అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్!’’ అని నేనన్న మాటే ‘‘సృజన’’ స్థాపనకు దారి తీసింది. ఎం.ఎ. ద్వితీయ సంవత్సరం (1963–64)లో ఉన్నప్పుడే ‘అంపశయ్య’ నవలకు బీజం పడింది. ఒకేరోజు నా మనస్సును తీవ్రంగా కలచివేసిన, జరి గిన సంఘటనలు ‘అంపశయ్య’ రాయటానికి పురికొల్పాయి. ఈ నవలను 1964లో మొదలెట్టి 1968లో పూర్తి చేశాను. ఇలా ఉస్మానియా యూనివర్శిటీలో మేం చదువుకున్న రోజుల్లో ఎన్నో చరిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి. అంపశయ్య నవీన్, వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఈ–మెయిల్ : naveen.ampasayya@yahoo.com -
శ్రీశ్రీ గీతాలతో ‘మహాఖడ్గం’
‘మహాప్రస్థానం, ఖడ్గసృష్టి’ల మేలుకలయికగా సీడీ నేటితరం కోసమేనంటున్న రూపకర్త గాంగేయశాస్త్రి రాజమహేంద్రవరం కల్చరల్ : ఒక తరాన్ని ఉర్రూతలూగించిన మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి’ కవితా సంపుటాల్లోని గీతాలను నేటి యువతరానికి మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ‘మహాఖడ్గం’ ఆడియో సీడీని రూపొందించాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువగాయకులు గానం చేసిన గీతాలను ఈ సీడీలో పొందుపరిచాను’ అని విశ్రాంత బ్యాంక్ మేనేజర్ చెరుకుపల్లి గాంగేయశాస్త్రి చెప్పారు. మార్చి 10న కళాగౌతమి ఆధ్వర్యంలో సీడీ ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీడీ రూపకల్పనలో తన లక్ష్యాలను బుధవారం ‘సాక్షి’కి ఇలా వివరించారు.. ‘గోదావరి పుష్కరగీతాలతో ‘పుష్కర గోదావరి’ ఆడియో సీడీని ఉపాధ్యాయుడు చెరుకూరి నాగేశ్వరరావు సహకారంతో రూపొందించాను. తరువాత నండూరి సుబ్బారావు రచించిన ఎంకి పాటల సీడీని రూపొందించాను. ఈనాటి తరం శ్రీశ్రీ గీతాల మాధుర్యాన్ని తెలుసుకోవడానికి నేటి సంగీత ధోరణులతో ‘మహాఖడ్గం’ సీడీని రూపొందించాను. ‘మహాప్రస్థానం’లోని ‘పొలాలనన్నీ, హలాల దున్నీ’ గేయాన్ని సి.ఆర్.శ్రీకాంత్ గుక్క తిప్పుకోకుండా ఆలపించారు. అలాగే ‘వేళకాని వేళల్లో–లేనిపోని వాంఛలతో’ గీతాన్ని నేను స్వయంగా పాడాను. అలాగే ‘భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని’, ‘ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం నీవన్నది’ పాటలను రికార్డు చేశాం. ‘ఖడ్గసృష్టి’లోని ‘ఓ మహాత్మా! ఓ మహర్షీ!’, ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు’, ‘కదలవోయి ఆంధ్రకుమారా!’, ‘కూటికోసం–కూలికోసం’ గీతాలను రికార్డు చేశాను. 1930వ దశకం నుంచే శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలను రచించినా తొలి ముద్రణ మాత్రం 1950లో జరిగింది. నేటికీ శ్రీశ్రీ గీతాలు నిత్యనూతనాలని సీడీలోని పాటలు విన్నవారు అంగీకరిస్తారు. తఈ గీతాలను నాతోపాటు పి.వి.ఎల్.ఎ¯ŒS.మూర్తి, వాసంతి ఆలపించారు’ అని గాంగేయశాస్త్రి చెప్పారు. -
శ్రీశ్రీ సృష్టించిన హాస్యాస్పదమైన సంప్రదాయం
శ్రీశ్రీ వచనపదాలను కూడా కొన్నిటిని సృష్టించారు. వాటిలో చిత్రించబడిన భావాలలో లయాబద్ధంచేసి నడిపించటానికి వీలులేనంత మహావేశమేమీ కనుపించదు. ‘వ్యత్యాసం’ అనే కావ్యంలో! ‘అదృష్టవంతులు మీరు వెలుగును ప్రేమిస్తారు; ఇరులను ద్వేషిస్తారు మంచికీ చెడుకీ నడుమ కంచుగోడ లున్నాయిమీకు’ అన్నారు. ఈ భావాలకు ఛందోబద్ధం చెయ్యటానికి వంగని తీవ్రత యేముంది? లయాబద్ధం చేసి నడిపితేనే వీటికి ఇంకా బలం కలిగేది. ఇలాంటి బలహీనమైన వచన పదాలను కొన్నిటిని సృష్టించడంతో, శ్రీశ్రీ తన్ను అనుకరించే యువకులలో ఒక హాస్యాస్పదమైన సంప్రదాయాన్ని సృష్టించిన వారయినారు. అర్థం పర్థం లేని చొప్పదంట్లు లాంటి వచన పదాలు కుప్పతిప్పలుగా మేట్లు పడుతున్నయ్. ఆయా కొన్ని గేయాల్లో కత్తిరించి పారవేయవలసిన వ్యర్థమైన పదాలు అక్కడక్కడ కనుపించుతున్నయ్. ‘మహాప్రస్థానం’లో ‘హరోంహరా అని కదలండి’ అన్నచోట ఈ ‘అని కదలండి’ అన్నమాటలు అనవసరమైన కంపతొడుగు. (తెన్నేటి సూరి రచనలు- మూడవ సంపుటం నుంచి; ఈ పుస్తకాన్ని ఈమధ్యే ‘నవచేతన’ వెలువరించింది.) - తెన్నేటి సూరి ఒకానొక రోజు నీకు తెలియకుండానే నిన్నొక నీటిబుడగ అనుసరిస్తూ నడుస్తుంది పగలూ రాత్రుల తూకం మధ్య నీడగా రాలిపోయిన కాలం నీలిరంగుల ఆకై మొలకెత్తుతుంటే నిదురపట్టక చీకటితో సంభాషించే పక్షికి నువ్వు విసిరికొట్టిన ఆలోచనలు రొట్టెముక్కల్లా కనిపిస్తాయి నీటిబుడగ నీడలు తూకంలో తూగవు నువ్వు ఆకులా రంగువెలిసేప్పుడు నీటిబుడగ వేడెక్కుతుంది నువ్వొదిలొచ్చిన అక్షరాలు నీ నీడలా మిగిలిపోతే నువ్వూ నీటిబుడగ ఒకేసారి పగిలిపోతారు సిరా అయిపోయిన కలాన్ని కాలం తన సంచిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటుంది. - మెర్సీ మార్గరెట్ 9052809952 శిఖరం పుస్తక పరిచయం శిఖరం (కవితా సంకలనం); హిందీమూలం: అటల్ బిహారీ వాజ్‌పేయి; అనుసృజన: జలజం సత్యనారాయణ; పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: ధ్వని పబ్లికేషన్స్, 7-5-297, లక్ష్మీనగర్ కాలనీ, మహబూబ్‌నగర్. ఫోన్: 9849444944 అటల్ బిహారీ వాజ్‌పేయిని బీజేపీ తొలిసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నప్పుడు, ఆయన స్టార్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ వార్తపై స్పందన కోరగా, భావోద్వేగంగా ఇలా పలికారు: ‘ఓ ప్రభూ! నన్ను అంత ఎత్తుగా ఎదగనీకు ఇతరుల నెవ్వరినీ గుండెలకు హత్తుకోలేనంతగా అంతటి హృదయ కాఠిన్యాన్ని ఎప్పుడూ నాకివ్వకు’! ఈ మాజీ ప్రధానికి అజాతశత్రువుగా పేరుంది. శిఖర సమానుడన్న ప్రశంస ఉంది. అలా ఆయన కవిత్వానువాద సంకలనానికి ‘శిఖరం’ అన్నపేరు ఎంచుకోవడం నప్పింది. ఆ పేరుతో ఇందులో ఒక కవిత ఉండటం గమనార్హం! పై వాక్యాలు ఆ కవితలోనివే! వాజ్‌పేయి సాహిత్య వాతావరణం ఉన్న ఇంట్లో పుట్టారు. ‘మేరీ ఎక్యావన్ కవితాయే’ వెలువరించారు. రాజకీయాల్లో తలమునకలైనప్పటికీ ఆయనలో ఉన్నది కవి హృదయమే. ఒకచోట ఇలా అంటారు: ‘నన్ను సంతలో/ ఒంటరిగా నిలబెట్టి/ మిత్రులు ఒక్కొక్కరే జారిపోయారు’. మరోచోట: ‘ఇప్పుడు/ కృష్ణుడు లేని/ మహాభారతం కావాలి!/ ధర్మనియతిలేని రాజ్యంలో/ రాజు ఎవడైతేనేం/ కన్నీళ్లు కార్చాల్సింది/ నిరుపేద నిర్భాగ్యులే’. ‘అనువాదం అనేది ఒక సాలెగూడు అల్లికను మరో సాలెగూడు అల్లికగా మార్చడమే. అనువాదంలో మూలంలోని నుడికారం కొంత నష్టమవుతుంది. ఈ అనువాదంలో ఆ నష్టమేమి కనిపించకపోగా అనువాదకుడు కవీ, భావుకుడూ కూడా కాబట్టి మరింత పుష్టమైందనే భావించవచ్చు’ అని దీనికి రాసిన ముందుమాటలో ఎన్.గోపి ప్రశంసించారు. - పి. శివశంకర్ నిదరోడు చంద్రుడు ఊహలకు రెక్కలు కత్తిరించి కాయితమ్మీదకి ఎంతగా నది ఊయలూపినా నిద్దరోడు చంద్రుడు మూగ చినుక్కి స్వరాలద్దుతోంది ప్రకృతి పతనంలోనూ ఎంతందం జలపాతం కన్రెప్పలు మూస్తే ఏదీ అంత పెద్ద ప్రపంచం లోపల నేను బైట ప్రపంచం కిటికీ రాయబారం - గోపరాజు రాధాకృష్ణ 9948823500 -
రెండు శ్రీలూ రెండు సాహిత్య ప్రతీకలు
మరో ప్రపంచం తాత్విక కవి శ్రీశ్రీ. మార్క్సిస్టు దృక్పథానికి సాహిత్య అన్వయ ద్రష్ట - శ్రీశ్రీ. శ్రామిక వర్గ ప్రజా కవి - శ్రీశ్రీ. శ్రీశ్రీలో రెండుగా శ్రీలూ - రెండు చీలి పోయిన వర్గ సమాజానికి సాహిత్య ప్రతీకలు. ‘ఈ శతాబ్దం నాది’ అని ఎలు గెత్తి చాటి చెప్పిన శ్రీశ్రీ కలంలో ఈనాటి వర్త మాన సామాజిక సంఘర్షణలోని ఆక్రోశం కూడా ప్రతిధ్వని స్తుంది. ‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ అన్నది వ్యక్తి గతం కాదు. తాను ఏ శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజలది అని ఉద్దేశం. మంటల చేత మాట్లాడించి, కన్నీళ్ల చేత కవాతు చేయించి చెమటా నెత్తురులను రాపిడి పెట్టి -అగ్ని కిరీటపు ధగధగలతో ఎర్రబావుటా నిగనిగల్ని తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎగరేసిన చైతన్యాగ్ని శిఖ శ్రీశ్రీ. ‘అరసం’ కానివ్వండి, ‘విరసం’ కాని వ్వండి. -శ్రీశ్రీ ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణంతో మమేకమైనవాడే. ఉద్యమాలతో నిరంతరం మమేక మయ్యే సమష్టి వ్యక్తిత్వం - శ్రీశ్రీ. ఉత్పత్తి విధానాన్ని సామాజీకరించిన పెట్టుబడి దారీ వ్యవస్థకీ, ఉత్పత్తి సాధనాల్ని ప్రజలపరం చేయాలనే సామ్యవాద వ్యవస్థకీ మధ్య సంఘర్షణ గుణాత్మకంగా పరిష్కారం అయ్యేంతవరకూ శ్రీశ్రీ కవిత్వం ప్రాసంగికతని కల్గే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘సామ్రాజ్యవాద ప్రపంచీక రణ’’ ఆర్థిక, సాంస్కృతిక విధానానికీ, శ్రీశ్రీ ‘‘మరో ప్రపంచ’’ దృక్పథమే కచ్చితమైన, శాస్త్రీయమైన, గతితార్కికమైన, చారిత్రకమైన ప్రత్యామ్నాయం. ఈ వాస్తవాన్ని అవగాహన చేసుకున్నది, పసి గట్టినదీ బలంగా సామ్రాజ్యవాద మేధావులే! కాబట్టే -‘అనాథలంతా, అశాంతులంతా, అనేకు లింకా దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవ శంఖం పూరి స్తారోయ్’ అన్న హెచ్చరిక వెనుక ప్రమాదాన్ని గ్రహించి శ్రామికవర్గ ఐక్యతని చీలికలు పీలికలుగా పోగులుపెట్టి తునకల సిద్ధాంతంతో ‘అత్యాధుని కతా’ వాదంగా సాహితీ, సాంస్కృతిక రంగాలలో ప్రవేశపెట్టి - వైరుధ్యాల సంక్లిష్టతని గందరగోళం స్థాయికి చేరుస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం. శ్రీశ్రీ కవిత్వం విప్లవ భావజాలాన్ని ఎర్ర బావుటా నిగనిగల్తో తెలుగునేల మీద ఆవిష్కరిం చింది. చాలామంది విప్లవం, అభ్యుదయం వైరు ధ్యం ఉన్నట్లుగా రెండూ రెండు భిన్న అంశాలుగా భావిస్తుంటారు. ఈ వర్గ సమాజం ఉన్నంతకాలం శ్రీశ్రీ కవిత్వం బతికే ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం బతికున్నంతకాలం శ్రీశ్రీ బతికే ఉంటాడు. శ్రీశ్రీ బతి కున్నంతకాలం మరో ప్రపంచం ఆశయం బతికే ఉంటుంది. మరో ప్రపంచం ఆశయం బతికున్నంత కాలం సాహిత్య సాంస్కృతిక రంగాలలో గుణాత్మక మార్పులకేసి పరిమాణాత్మక మార్పులు ప్రవహిస్తూనే ఉంటాయి. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పు వైపు పోగుపడకుండా ప్రతి మలుపులోనూ శ్రీశ్రీపై, అతని కవిత్వంపై ఈనాటికీ జరుగుతున్న దాడులు నిజానికి శ్రీశ్రీ మీద కాదు శ్రీశ్రీ... ఏ మరో ప్రపంచ తాత్వికతని ఏ అశాంతుల, అనాథల, అనేకుల (బహుజనాలలో) ఏ పీడితుల (దళితులు) పక్షం వహించి గొంతెత్తి, కలమెత్తి ప్రాతినిధ్యం వహించాడో ఆ శ్రామిక వర్గ దృక్పథం మీద దాడులవి. కుటుంబరావుగారు శ్రీశ్రీ గురించి ఇలా అంటారు ‘‘నిజమే - శ్రీశ్రీని దాటి తెలుగు సాహి త్యం చాలా దూరమే వచ్చేసింది. కానీ శ్రీశ్రీ అంత ఎత్తుకి ఇంకా ఎదగలేదు.’ దీనిని సమీక్షిం చుకోవాలి. మాట్లాడ్డం మాట్లాడ్డం కోసం కాదు. వినడం వినడం కోసం కాదు. రాయడం రాయడం కోసం కాదు. చదవడం చదవడం కోసం కాదు. సాహిత్యం సాహిత్యం కోసం కాదు. భావజాల రంగంలో సంఘర్షణ భౌతిక శక్తిగా మారి నూతన ప్రజాతంత్ర విప్ల వాన్ని పూర్తి చేసుకోవలసిన కూడలిలో ఉన్నాం. అక్షరాలుగా మిగిలిపోకుండా, పదాలుగా కూడబలు క్కొని వాక్యాలుగా కవాతు చేద్దాం! సూర్యరశ్మి అం తటి వేడీ వెలుతురూ ఉన్న రసాత్మక కావ్యాన్ని ఆచ రణాత్మకంగా ఆవిష్కరిద్దాం! పదండి ముందుకు..! - పీఎస్ నాగరాజు వ్యాసకర్త ప్రజాసాహితి సంపాదకుడు మొబైల్ : 94419 13829 (నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా) -
బర్త్‌డే గిఫ్ట్
అక్షరాల్లో అగ్నికణాలు నింపి తెలుగు రచనా ప్రపంచంలో చైతన్య శిఖరారోహణ చేసిన మహాకవి శ్రీశ్రీ. అలాంటి చైతన్యాన్ని రగిలించే పాత్రలో సూపర్‌స్టార్ కృష్ణ కనిపిస్తారు. ఆయన ప్రధానపాత్రలో ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీశ్రీ’. ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన ఈ చిత్రం కృష్ణ పుట్టినరోజు (మే 31) కానుకగా జూన్ 3న రిలీజవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘అలనాటి శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే అన్నదే కథాంశం. మహాకవి శ్రీశ్రీగారు తన ఆవేశాన్ని రచనల్లో చూపిస్తే, మా చిత్రంలో శ్రీశ్రీ చేతల్లో చూపిస్తారు. కృష్ణగారు సినిమా ఇండస్ట్రీకొచ్చి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం, వారి ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కృష్ణ తనయుడు, హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. విజయనిర్మల, సీనియర్ నరేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇ.ఎస్.మూర్తి, కెమెరా: సతీష్ ముత్యాల. -
రాలిన సాహితీ దిగ్గజం
-
రాలిన సాహితీ దిగ్గజం
సాహితీ శిఖరం కరిగిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమ దీప్తి నింగికెగసింది. తన రచనలతో సమాజ మేల్కొలుపునకు అనుక్షణం పరితపించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు కనుమరుగయ్యాడు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) శనివారం విశాఖపట్నంలో కాలం చేశారు. దీంతో ఆయన స్వస్థలం పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు కన్నీటిసంద్రమైంది. - చలసాని ప్రసాద్ మృతితో విషాదంలో భట్లపెనుమర్రు - చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు వాదే - విరసం స్థాపనలో కీలక పాత్ర మచిలీపట్నం/కూచిపూడి : జిల్లా సాహితీ దిగ్గజాన్ని కోల్పోయింది. కమ్యూనిస్టు భావాలను అణువణువునా నింపుకొని శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రచనలు మరుగున పడకుండా వాటిని వెలుగులోకి తెచ్చిన సాహితీవేత్త, ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) మరణించారనే విషయం తెలుసుకున్న భట్లపెనుమర్రు వాసులు కన్నీటి పర్యంత మయ్యారు. మొవ్వ మండలంలో భట్లపెనుమర్రుకు చెందిన బసవయ్య, వెంకట నరసమ్మలకు 1932 డిసెంబరు 8వ తేదీన ప్రసాద్ జన్మించారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాన్ని అతి దగ్గర నుంచి చూసిన ఆయన కమ్యూనిజం వైపే పయనించారని గ్రామస్తులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం లో అన్న, బావ, పినతండ్రిని చలసాని కోల్పోయారని చెబుతున్నారు. హైస్కూల్ వరకు భట్లపెనుమర్రులోనే ఆయన చదువుకున్నారని పేర్కొంటున్నారు. విరసం స్థాపనలో చురుకైన పాత్ర... 1970 జూలై 4వ తేదీన విప్లవ రచయితల సంఘం స్థాపనలో ఆయన చురుకైన పాత్ర పోషించారని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. 1964లో సీపీఎంలో పనిచేశారని, 1969లో సీపీఐ (ఎంఎల్)లో ఆయన పనిచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. 1986-88 మధ్య విరసం ప్రధాన కార్యదర్శిగా, 1998-2000 మధ్య విరసం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తరచూ గ్రామానికి వచ్చే ఆయన చిన్న పిల్లల మనస్తత్వంతోనే మాట్లాడే వారని, సమాజానికి, సాహితీలోకానికి తనవంతుగా ఏదో చేయాలని తపన పడేవారని గ్రామపెద్దలు చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలను 20 సంపుటాలలో ముద్రించడానికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొంటున్నారు. భట్లపెనుమర్రులో పుట్టి సాహితీ లోకానికి ఎనలేని సేవలు అందించిన చలసాని ప్రసాద్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు మననం చేసుకుంటున్నారు. త్రిపురనేని గోపీచంద్ రచనలను పది సంపుటాలుగా వెలువడిన ముద్రణలకు తుమ్మల కృష్ణాబాయితో కలిసి సంపాదకత్వం వహించారని చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలు, విరసం తనకు రెండు కళ్లు అని తరచూ తమతో అనేవారని గ్రామపెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశ్రీ సాహిత్యనిధికి అంకితం ఇచ్చారు ‘చిరంజీవి శ్రీశ్రీ’ అనే పుస్తకాన్ని చలసాని రచించారు. ఈ పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యనిధికి ఆయన అంకితం ఇచ్చారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలపడానికి చలసాని అనుక్షణం తపించేవారు. కొడవటిగంటి కుటుంబరావు రచనలను ఆరు సంపుటాలుగా ముద్రించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. జిల్లాలో జన్మించి విరసం స్థాపనలో కీలకభూమిక పోషించిన చలసాని సాహితీ లోకానికి చేసిన సేవలకు వెలకట్టలేం. - సింగంపల్లి అశోక్‌కుమార్, ప్రముఖ రచయిత ప్రసాద్‌ను మరిచిపోలేం చలసాని ప్రసాద్ మా గ్రామం వాడే. ఏడాది క్రితం గ్రామానికి వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదువుకునే రోజుల్లో చెరువులో ఈదటం, చెట్లు ఎక్కటం వంటి సంఘటనలను మననం చేసుకున్నాం. ప్రసాద్ శ్రీశ్రీకి అనుంగు శిష్యుడిగా ఉండేవారు. శ్రీశ్రీ చివరి దశలో రచించిన సాహిత్యాన్ని సేకరించి ముద్రణకు నోచుకోవడానికి ప్రసాద్ ఎంతగానో కృషి చేశారు. చలసాని ప్రసాద్ అన్న, బావ, పినతండ్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాల్పుల్లో మరణించారు. - డాక్టర్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం పేదలకు సాయం చేయాలని తపించేవారు చలసాని ప్రసాద్ చిన్నతనం నుంచే ఉద్యమాలను అతి దగ్గర నుంచి చూశారు. పేద వారికి సాయం చేయాలనే తపన ఆయనలో ఉండేది. గ్రామానికి వచ్చిన ప్రతిసారీ మాతో పలు అంశాలపై చర్చించేవారు. కమ్యూనిస్టు భావజాలాన్ని నింపుకొన్న ఆయన చివరి వరకు కమ్యూనిస్టు గానే కొనసాగారు. మా గ్రామానికి చెందిన ప్రసాద్ విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించటంలో కీలక పాత్ర పోషించారని తెలుసుకున్న మేము ఎంతగానో గర్వపడే వాళ్లం. ప్రసాద్ తండ్రి బసవయ్యతో నాకు పరిచయం ఎక్కువ. - గొట్టిపాటి గోపాలకృష్ణయ్య, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం సాహితీలోకానికి తీరని లోటు అందరం సాహితీవేత్తలమే అయినా ప్రసాద్ ముక్కుసూటిగా మాట్లాడేవారు. చలసాని ప్రసాద్ మరణం సాహితీ లోకానికి తీరనిలోటు. సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. - రావి రంగారావు, సాహితీవేత్త -
ముందుమాటకు ప్రామాణిక పత్రం
అడిగింది శ్రీశ్రీ అయినా రాసింది చెలం అయినా పనిగట్టుకుని రాయించినవాడు మాత్రం తన అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని శ్రీశ్రీ చెప్పుకున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. - ‘యోగ్యతాపత్రం’కు 75 ఏళ్లు యోగ్యతాపత్రానికి ఈనెల 17వ తేదీతో 75 ఏళ్ళు పూర్తవుతాయి. 20వ శతాబ్దపు 30వ దశకంలో శ్రీశ్రీ విరచితమైన 41 గేయాల మహాప్రస్థానం కావ్యాన్ని అనుభవించి పలవరించిన చెలం గొడవ ఇది. 1940 జూలై 17వ తేదీన మూడు ఖండికలుగా దానిని రాసాడు. తన గేయాల సంకలనం మహాప్రస్థానంకు ముందుమాట రాయమని చెలంను శ్రీశ్రీ అడగగా కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గరలేవని పీఠిక, ముందుమాట, ఉపోద్ఘాతం, ప్రశంస, పరిచయం లాంటి సాంప్రదాయక మర్యాదలను కాదని మహాప్రస్థానం ఝంఝానిల షడ్జ్యధ్వానాన్ని యోగ్యతాపత్రంగా ప్రకటించాడు. అడిగింది శ్రీశ్రీ అయినా రాసింది చెలం అయినా పనిగట్టుకుని రాయించినవాడు మాత్రం తన అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని శ్రీశ్రీ చెప్పుకున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. యోగ్యతాపత్రం ద్వారా తెలుగు సాహిత్యంలో ముందుమాట, పీఠికల స్వరూప స్వభావాలను, లక్షణాలను పూర్తిగా మార్చివేసినవాడు చెలం. సాహితీ విమర్శకు ప్రామాణికాలు ఉన్నట్లే ముందుమాటకు కూడా యోగ్యతాపత్రం ద్వారా ప్రమాణాలు రూపొందాయంటే అతిశయోకి ్త కాదు. యోగ్యతాపత్రం చదివితే చాలు మహాప్రస్థానం చదవక్కరలేదని భావించిన వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని లండన్ నగరంలోని విదేశాంధ్ర ప్రచురణల వారు 1980 డిసెంబర్లో మహాప్రస్థానం గీతాలను శ్రీశ్రీ స్వయంగా గానం చేయగా రూపొందించిన క్యాసెట్స్తో పాటు శ్రీశ్రీ స్వంత దస్తూరీలో ఆ గీతాలను ఫాసిమైల్ రూపంలో విడుదల చేసే సందర్భంలో మహాప్రస్థానంపై తాను వినిపించిన అభిప్రాయంలో శ్రీశ్రీ వెల్లడించారు. ‘ప్రగతి’ వారపత్రికలో తాను నిర్వహించిన ‘ప్ర-జ’ (ప్రశ్నలు-జవాబులు) శీర్షికలో పిచ్చిరెడ్డి అనే ఎం.ఎ. విద్యార్థి ‘యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థానం గీతాలను మరి చదవనక్కరలేదని నేన ంటాను, దీనికి మీరేమంటారు’ అనే ప్రశ్న పంపాడని, అందుకు ‘మీరు సార్థక నామధేయులని’ తాను జవాబిచ్చినట్లు శ్రీశ్రీ తెలిపారు. ఆయనకు ఆ ప్రశ్న అతిగా అనిపించినా యోగ్యతాపత్రం చదివిన వారికి అది ఎంత టి ప్రభావాన్ని చూపిందో ఆ సందర్భం వెల్లడించింది. తెలుగు సాహిత్యంలో నేటివరకు ఏ పుస్తకానికి, కావ్యానికి కూడా యోగ్యతాపత్రం లాంటి ప్రశంస, ముందుమాట, పీఠిక రాలేదు. సాధారణంగా ఏ పుస్తకంలోనైనా, కావ్యంలోనైనా కవి అనుసరించిన శైలి, శిల్పం, తీసుకున్న వస్తువులాంటి వాటిపైనో ముద్రారాక్షసాలపైనో ముందుమాటల్లో రాస్తారు. కానీ యోగ్యాతాపత్రం మాత్రం మహాప్రస్థానంను శ్రీశ్రీ ఎందుకు, ఎవరికోసం, ఎలా రాసారో అనే విషయంతో పాటు దాన్ని ఎందుకు, ఎలా చదవాలో కూడా వివరిస్తుంది. మహాప్రస్థానం గేయాలు దిక్కుల్ని, దేవతల్ని, అధికారులను ఊగించి ప్రశ్నించేవని ఈ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ కన్నీళ్ళూ కలిపి తయారుచేసిన కొత్త టానిక్ అని ప్రకటిస్తుంది. రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రపంచ ఘోష విని తట్టుకోగల చావ ఉంటేనే మహాప్రస్థానాన్ని తెరవమని యోగ్యతాపత్రం హెచ్చరిస్తుంది. యోగ్యతాపత్రం ద్వారా తెలుగు వచనం ఎలా ఉండాలో ఏ ఉద్వేగాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఛీత్కారాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఇది దానికున్న అదనపు విలువ. యోగ్యతాపత్రం తరువాత గొప్పగా చెప్పుకోదగింది చింతా దీక్షితులు ‘ప్రజా వాఙ్ఞయం’కు రాసిన ‘ప్రస్తావన’. దానిని కూడా చెలమే 1955 డిసెంబర్లో రాసాడు. దానికి ఈ ఏడాది చివరితో 60 ఏళ్ళు నిండుతాయి. అలా ఈ ఏడాది యోగ్యతాపత్రంకు వజ్రోత్సవ సంవత్సరం, ప్రస్తావనకు షష్ట్యబ్ది సంవత్సరం. - కె. ఎస్ ఎన్ ప్రసాద్ ఫోన్: 8500392089 సభాచారం - ‘వేదిక’ కార్యక్రమంలో జూలై 12న సాయంత్రం 5:30కి ఆలంబన(కూకట్పల్లి విలేజ్, హైదరాబాద్)లో జయకాంతన్ నవల ‘కళ్యాణి వెడ్స్ దివాకర్’(అనువాదం: జిల్లేళ్ల బాలాజీ)ను ఉష; ఆంగ్లకథ ‘మై గ్రాండ్‌మదర్ టెల్స్ మి దిస్ స్టోరీ(మాలీ ఆంటపాల్)ని నిర్వాహకుడు అనిల్ అట్లూరి(ఫోన్: 8142642638) పరిచయం చేస్తారు. కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘శతపత్ర సుందరి’పై చర్చ కూడా ఉంటుంది. - జూలై 17న ఉదయం 10 నుంచీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు, చీరాల, ప్రకాశం జిల్లాలో ‘కారంచేడు దళిత నరమేధానికి 30 ఏళ్లు-అనంతర బహుజన సాహిత్యం’పై సదస్సు, కవి సమ్మేళనం జరగనుంది. నూకతోటి రవికుమార్(ఫోన్: 9848187416) కన్వీనర్‌గా జరిగే ఈ కార్యక్రమంలో ఎ.సుబ్రహ్మణ్యం, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చందర్, ఉ.సాంబశివరావు, బొనిగల రామారావు, పులిగుజ్జు సురేష్, సూరేపల్లి సుజాత, చల్లపల్లి స్వరూపరాణి, సి.కాశీం, పడవల చిట్టిబాబు, దుర్గం సుబ్బారావు, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొంటారు. - అంబేడ్కర్ ఫిలాసఫీ ఆఫ్ కాస్ట్ డెమోక్రసీ గ్రంథం ప్రచారోద్యమంలో భాగంగా ‘జాతిపిత అంబేడ్కర్ వర్ణ నిర్మూలన సిద్ధాంతం’ నాటకం 53వ ప్రదర్శన ఈ జూలై 18న 3 గంటలకు చీమకుర్తి నాగేశ్వరరావు కళామండపం(ప్రకాశం జిల్లా చీమకుర్తి)లో జరగనుంది. 54వ ప్రదర్శన, ఆగస్టు 8న 3 గంటలకు పొన్నూరు అంబేడ్కర్ కళాక్షేత్రం(గుంటూరు జిల్లా పొన్నూరు)లో! వివరాలకు సౌదా అరుణ ఫోన్: 9247150243 కథాంజలి-3 (ఎస్సారె కథలు) పేజీలు: 240; వెల: 130 ప్రతులకు: సాహితీ ప్రచురణలు విజయవాడ-2; ఫోన్: 0866-2436643 1.సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక రచన: డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి; పేజీలు: 268; వెల: 200 2.శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు-వ్యాసాలు (1929-1936); సంపాదకుడు: డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేజీలు: 160; వెల: 150; ప్రతులకు: వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, తాళ్లకాల్వ గ్రామం, గాండ్లపెంట మండలం, అనంతపురం-515521; ఫోన్: 9441317766 -
శ్రీశ్రీని ‘శాసించినవాడు’
1955 ఎన్నికల తదనంతరం ప్రగతిశీల సాహిత్య శిబిరంలో స్తబ్దత చోటుచేసుకున్న కాలాన ‘‘మహామహుడు, మహావ్యక్తి, మహాకవి- స్తబ్దతకే మారుపేరు, మరోపేరుగా మారిన ఆ రోజున తెలుగుజాతి శపిస్తుంది శఠిస్తుంది, శఠిస్తుంది శపిస్తుంది’’ అంటూ శ్రీశ్రీని ‘‘ఒక వ్యక్తిగా తలచలేదెప్పుడూ, సంస్థగా, వ్యవస్థగా, రెక్కవిప్పిన రెడ్రివల్యూషన్గా, జాతిని దిద్దిన మహోద్యమంగా పరిగణించాము’’ అంటూ 1963లోనే అనితరసాధ్యమైన ఒక ఆదేశాన్ని శ్రీశ్రీకి జారీచేసినవాడు సివి. ‘మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్యుని బహిరంగలేఖ’ అనే కవిత ముగింపుగా ‘‘తెలుగుజాతి పేరిట తిరిగి కలం పట్టమని శాసిస్తున్నాను’’ అనటం ఎంత సాహసం! ఎంతో ఆత్మవిశ్వాసం, సమరశీలతవైపే శ్రీశ్రీ వుంటాడు అన్న స్పష్టమైన అంచనా వుంటే తప్ప అలాంటి ఆదేశ స్వరాన్ని వినిపించటం సాధ్యంకాదు. గత 60 ఏళ్ల సుదీర్ఘకాలంలో 45 ఏళ్లపాటు ఎత్తినకలం దించకుండా సివి 24 పుస్తకాలు రాశారు. నా దృష్టిలో ఉన్నంతవరకు రెండు, మూడు పత్రికలలో తప్ప ఇంకెందులో వారి పుస్తకాలపై సమీక్షలు రాలేదు. ఈ తరహా విస్మరణను బద్దలుగొట్టాలనే దృష్టితోనే ‘ప్రజాసాహితి’లో పనిగట్టుకుని సమీక్షలు చేయించాము. విశ్లేషణ వచ్చిన ప్రతిసారీ సివి ఇంకా జీవించివున్నారా? అని పాఠకులు అడిగేవారు. ‘ప్రజాసాహితి’లో సుమారు 125 మంది రచయితలతో ‘అమరావతి రాజధాని’ ప్రక్రియపై ఖండన ప్రకటన (జనవరి 2015) విడుదల చేసినపుడు, అందులో సంతకం చేసినవారిలో సివి కూడా వుండటం యాదృచ్ఛికం కాదు, ప్రయత్నపూర్వకమే! - దివికుమార్ (సివి సాహిత్యంపై విజయవాడ, వేదిక కల్యాణమండపంలో సదస్సు జరుగుతున్న సందర్భంగా...) పుస్తక పరిచయం ‘ఒక తరం స్వరం’ 1970లలో ప్రగతిశీల, హేతువాద యువకుల ఆలోచనల్ని ప్రభావితం చేశారు సివి(చిత్తజల్లు వరహాలరావు). సి.విజయలక్ష్మి, అరుణశ్రీ వంటి కలంపేర్లతోనూ రాసిన సివి మొత్తం 24 పుస్తకాల్ని వెలువరించారు. అవన్నీ మళ్లీ కొత్తగా ‘ప్రజాశక్తి’ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బక్కపలుచటి ‘కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం’(పేజీలు: 32; వెల: 25) నుంచి ‘వచనకవితా మహాకావ్యం’గా పేర్కొన్న ‘పారిస్ కమ్యూన్’ (పేజీలు: 648; వెల: 400) వరకు ఉన్నాయి. ‘రాజ్యమూ, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి, ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్నీ, దాని స్వరూప స్వభావాల్నీ, దాని క్రమపరిణామాన్నీ’ ‘కౌటిల్యుని అర్థశాస్త్రం-పుట్టు పూర్వోత్తరాలు’(పేజీలు: 152; వెల: 80)లో వివరించారు. ‘పశుపాలకుల్లా, దేశదిమ్మరుల్లా, ఆటవికుల్లా, మనదేశంలోకి ప్రవేశించిన ఆర్యులు, మనకిచ్చింది బూడిద తప్ప మరేమీకాదంటే, దానిలో ఆవగింజంత అతిశయోక్తి సైతం లేదు. అంచేత, మన ప్రాచీన నాగరికతా సంస్కృతులకు బీజాలు వేసింది ద్రావిడులే’ అని ‘సింధు నాగరికత’(పేజీలు: 144; వెల: 80)లో తేల్చారు. ఇంకా, ‘ప్రాచీన భారతంలో చార్వాకం’, ‘భారత జాతి పునరుజ్జీవనం’, ‘మధ్య యుగాల్లో కులవ్యవస్థ’, ‘నరబలి’(కావ్యం), ‘డార్విన్ పరిణామవాదం’, ‘సత్యకామ జాబాలి’(కావ్యం), ‘హేతువాద నాస్తికోద్యమం-రంగనాయకమ్మకి సమాధానం’ లాంటి పుస్తకాల్లో సివి ఆలోచనాధారను అర్థం చేసుకోవచ్చు. ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27-1-54, కారల్ మార్క్స్ రోడ్, గవర్నర్ పేట, విజయవాడ-2; ఫోన్: 0866-577533 - శేషసాయి యువ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ 23 భారతీయ భాషల్లో ప్రకటించిన ‘యువ పురస్కారం’, తెలుగుకుగానూ దళిత కథకుడు, కవి డాక్టర్ పసునూరి రవీందర్‌ను వరించింది. ఈ అవార్డు కింద 50 వేల నగదు, తామ్రపత్రం ఇస్తారు. ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథా సంకలనానికి ఈ గౌరవం దక్కింది. వృత్తిరీత్యా పాత్రికేయుడైన రవీందర్ స్వస్థలం వరంగల్. స్మారక పురస్కారం భారతనిధి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో విశాఖ రచయితల సంఘం, విశాఖ సంస్కృతి మాసపత్రిక జూలై 3న విశాఖ పౌరగ్రంథాలయంలో విశాఖ నగర చరిత్ర రాసిన అంగర సూర్యారావుకు ‘బలివాడ కాంతారావు స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నాయి. సురవరం రచనల పరిచయం ‘ఛాయ’ ఆధ్వర్యంలో జూలై 5న(ఆదివారం) సాయంత్రం 5:30కి హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆడిటోరియం(దోమల్‌గూడ)లో జరిగే కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి రచనల్ని అంబటి సురేంద్రరాజు పరిచయం చేయనున్నారు. - పసునూరి రవీందర్ పంజాగుట్ట కొన్ని మట్టితో కప్పినవీ కొన్ని సిమెంటుతో కట్టినవీ తేదీలూ తిథులూ శిలాఫలకాలు తల్లులూ తండ్రులూ సతుల్, సుతుల్ కొన్ని పైకప్పు కప్పినవీ కొన్ని చలువరాళ్లు వేసినవీ జాడలూ నీడలూ పక్కపక్కనే గోరీలు ప్రేయసీప్రియులూ భార్యాభర్తలూ కొన్ని చిట్టిచిట్టివీ కొన్ని ముద్దుముద్దువీ వెలుతురు సోకని కలలు నవ్వులు మెరవని బుగ్గలు తెగిపోయిన పేగులు ---- యోధులు, పరాజితులు, విముక్తులు మందభాగ్యులు-అల్పాయుష్కులు ఇంకను కొన్ని- అవాంఛిత గర్భాలు పసికన్నులు-పసిడి వన్నెలు --- నీళ్లులేక ఎండిపోయిన తులసిమొక్కలు రావిచెట్లపై ఆశలు చావని గబ్బిలాలు సంతకం చేయకుండా వదిలేసిన వీలునామాలు పగలు సూర్యుడు-రాత్రి చంద్రుడు కాటికాపరులు --- నలుదిక్కులా ఆకాశహర్మ్యాలు జరీ అంచు నియాన్ లైట్లు రోడ్ నంబర్ మూడు అది చూడు! హోర్డింగుపై డస్కీ సెక్సీ సాలభంజిక సమాధి రాళ్లకింద తీరనికోరిక -లివింగ్, డెడ్ మరియూ అన్ డెడ్! --- కొన్ని మట్టికొట్టుకుపోయినవీ కొన్ని పిచ్చిమొక్కలు మొలిచినవీ కుండపెంకులు చిల్లరనాణాలు శిథిల కంకాళాలు చెదలు కీటకాలు --- ఇక... మధ్యలోనే వెళ్లిపోయిన చిచ్చాలూ చేలాగాళ్లను తలచుకొని! మరణించిన రాత్రిలో మృతదేహం వెతుక్కొని చీకటి ఆకాశంలోకి స్మృతిగీతాన్ని విసిరేసి --- నడచివచ్చిన కాలాన్ని గమనించనే లేదు... ఇది డెడ్ ఎండ్! -ఇప్పుడైతే మరి... బతికున్నట్టే కదా జీవించాలి!? - అరుణ్‌సాగర్ తీయని కలలు మంచి రాత్రులు ఆమె మెత్త కవర్ల మీద రంగురంగుల దారాలతో ఎంతో కాయిష్ పడి అల్లికల పోతలు పోసింది ఆమె ప్రమేయం లేకుండానే బతుక్కు అంటు కట్టబెట్టబడింది మంచం పైన ఒక స్త్రీ ఒక పురుషుడు ఆమె తలలో ఎన్ని కలలో ఎరుగము అతని మెదడులో ఎన్నెన్ని శుభరాత్రులో తెలువము శరీరాలు ఒక్కటై సరీసృపాలు వెంటది వెంట మనసులు వేరైపోతున్నాయి కలత కలలతో కలవర రాత్రులతో దేహాలు నకీలిగా మసలుతున్నాయి రాను రాను తలల మీది పోతపోసిన లిపి అసలు లోతు తెలిసిన గుడ్‌నైట్, స్వీట్డ్రీమ్స్ల అక్షరాలు అక్కెర పూర్తియై వెకిలిగా వెలితిగా మకిలిగా చెక్కుచెదరక చెదిరి బెదిరి చూస్తున్నాయి అంటు కట్టబడ్డాక సొంటు ఉంటుంది కదా ఇప్పుడు ఇరువురూ కేవలం పాత్రధారులయ్యారు - జూకంటి జగన్నాథం గమనిక: 10, 12 లైన్లకు మించిన కవితల్ని పంపవద్దు. ప్రచురించడం వీలుపడదు. కవులు గమనించగలరు. - ఎడిటర్ -
ఆశల పల్లకీలో మన్మథ
పరంపరానుగతంగా పరిభ్రమించే యుగచక్రంలోకి నేటినుంచి మరో నూతన సంవత్సరం వచ్చి చేరబోతున్నది. మన్మథ నామ సంవత్సరానికి చోటిచ్చి జయ నామ సంవత్సరం నిష్ర్కమిస్తున్నది. మూడు కాలాలనూ, ఆరు రుతువులనూ తురుముకొని వచ్చే కొత్త సంవత్సరం తనతోపాటు ఎన్నో ఆశలనూ, ఆకాంక్షలనూ మోసుకొస్తుంది. కాలం పుటల్లో ఒదిగిపోయిన పాత సంవత్సరం సుఖదుఃఖాల, మంచీచెడుల, సంతోషవిషాదాల కలనేతగా సాగిపోయినా రాబోయే కాలం మాత్రం తమకు మంచే చేస్తుందని, సంతోషంలోనే ముంచెత్తుతుందని, కష్టాలనన్నిటినీ కడతేరుస్తుందని, తమ జీవితాన్ని సుఖమయం చేస్తుందని విశ్వసించడం సగటు జీవి లక్షణం. అందుకే ఉగాదితోపాటు విడుదలయ్యే కొత్త పంచాంగంలో రాశి ఫలాలను చదవాలని, ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకోవాలని ఆత్రుతపడతారు. తమ రాశికి రాజ పూజ్యమే రాసిపెట్టి ఉండాలని... అవమానాలున్నా అవి కనిష్టంగా మిగలాలని ఆశిస్తారు. ఇక ఆరోజు సాగే పంచాంగ శ్రవణం కోసం అందరికందరూ ఉవ్విళ్లూరుతారు. పంటలెలా పండుతాయో, ఈతిబాధల సంగతేమిటో, విపత్తుల తీరుతెన్నులెలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆశలకు తగ్గట్టే ఉగాది తనతోపాటు వసంత రుతువును తెస్తుంది గనుక ఈ సమయంలో ప్రకృతి సైతం మనల్ని సంభ్రమాశ్చర్యపరిచేలా సింగారించుకుంటుంది. మత్త కోకిలల కుహూకుహూరావాలు... వేపపూల ఘుమఘుమలు... మరుమల్లెల సుగంధం మనల్ని మరో ప్రపంచపుటంచుల్ని తాకిస్తుంటే, చెట్లన్నీ కొత్త బట్టలు తొడుక్కున్న ట్టుగా లేత పచ్చని చిగుళ్లతో వింత సోయగాలను సంతరించుకుంటాయి. ఈ సృష్టిలో రోజులన్నీ మంచివేనని, ఘడియలన్నీ ఉత్తమమైనవేనని... శుభసంకల్పమే దేనికైనా ముఖ్యమని విజ్ఞుల ఉద్ఘాటింపులున్నా పంచాంగంలో ‘మంచి ముహూర్తాన్ని’ ఎంచుకోవడం మామూలే. మొదలెట్టే పనికి ఆటంకాలెదురు కాకుండా ఉండాలంటే, చకచకా సాగాలనుకుంటే ఈ ‘వెతుకులాట’ ఉత్తమమనిపిస్తుంది. అలాగని మనిషి నిర్లిప్తంగా ఉండిపోడు. అంతా విధి లిఖితమని ఊరుకోడు. సవాళ్లను ఎదుర్కొనడా నికి, అగడ్తలను అధిగమించడానికి మనోస్థైర్యంతో, పట్టుదలతో నిత్యం ప్రయత్ని స్తూనే ఉంటాడు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘దుఃఖంలోనే ఆశాదీపిక...చీకటిలోనే తారాగీతిక’లను వెదుక్కుంటూనే ఉంటాడు. ఆ అన్వేషణ రేపో మాపో ముగిసి పోయేది కాదు. అది అనంతం. ఈ భూమ్మీద మనిషి ఉన్నంతవరకూ సాగే ప్రయా ణం. నూతన సంవత్సర ఆగమనం వేళ ఆశల్ని చిగురింపజేసుకోవడం అందులో భాగమే. ఏదో ఒక పేరుతో రావడం తెలుగు సంవత్సరాల విశిష్టత. ఇందులో భయపెట్టేవి, సంభ్రమపరిచేవి, ఆశపెట్టేవి ఉంటాయి. రౌద్రి, రక్తాక్షి, రాక్షస వంటివి ఉన్నట్టే... విరోధి, వికారి, పరాభవ, దుర్ముఖి, దుర్మతి ఉంటాయి. ఇంకా...విజయ, జయ, ప్రమోదూత ఉంటాయి. ఇలా ప్రభవాది 60 సంవత్సరాల్లో మన్మథ 29వ సంవత్సరం. ఇది సుఖసౌఖ్యాలను కలిగించే సంవత్సరమని, ప్రకృతి సోయగాలను రెట్టింపుచేసే సంవత్సరమని ఊరిస్తున్నారు. ప్రేమోద్దీపనను వ్యాప్తి చేస్తుందంటున్నారు. నిజా నిజాలేమిటని తర్కించక్కరలేదు. అరవైయ్యేళ్లనాడు ఇదే సంవత్సరం ఏం చేసి వెళ్లిందో చూసి చెప్పేయొచ్చు. కానీ, అలా వెనక చూపులు చూడటం నిరాశావాదుల పని. ఏదో ఒరుగుతుందని ఆశించి ముందుకెళ్లడమే మనిషి లక్షణం. ఉగాదిని మనం ఒక్కరమే కాదు...పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు మొదలుకొని మణిపూర్, అస్సాంల వరకూ చాలామంది జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు. పండగ జరిపే రోజులు వేరు. మహారాష్ట్రలో గుడిపాడ్వా, కేరళలో విషు, రాజస్థాన్‌లో తపన, పంజాబ్‌లో బైశాఖి, అస్సాంలో బిహు మన ఉగాదిని పోలినవే. ఈసారి మన ఉగాదికి మరో విశిష్టత కూడా ఉంది. భూగోళమంతటా పగలూ, రాత్రీ సమానంగా ఉండే ఈక్వినాక్స్ (విషువత్తు) సంభవించే మార్చి 21నే మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. కొన్నేళ్లపాటు మన తెలుగు నేలన ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలు, దాంతో పాటు వచ్చి చేరిన అపోహలు, అపార్థాలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. నిరుడు జయ ఉగాది నాటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయినా లాంఛనంగా విడిపోవడానికి మరికొంత సమయం పట్టింది. కనుక రెండు రాష్ట్రాలుగా ఉగాది జరుపుకోవడం తెలుగు ప్రజలకు ఇది మొదటిసారి. ఇతరేతర సమస్యలు ఎన్ని ఉన్నా రెండు రాష్ట్రాల అధినేతలూ సమష్టిగా కదిలి తెలుగుకు లభించిన ప్రత్యేక శిష్ట భాషా ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తారనుకుంటే పట్టనట్టు ఉండిపోతున్నారని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇరు రాష్ట్రాలమధ్యా పరిష్కరించుకోవాల్సిన సమస్యలే కాదు... కొత్త రాష్ట్రాలు కావడంవల్ల ఎక్కడికక్కడ తలెత్తినవీ ఉన్నాయి. ఏటా మూడు, నాలుగు పంటలు పండే తమ భూములపై రాజధాని నగరం దిగబడుతున్నదని తెలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంత రైతాంగం, రైతు కూలీలు కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. భయపడి భూములిచ్చినవారూ, ఇవ్వబోమని భీష్మించినవారూ కూడా ఇందులో ఉన్నారు. హామీలు నమ్మి తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని, బ్యాంకుల్లో తాకట్టుపడిన బంగారం మళ్లీ ఇంటి తలుపు తడుతుందని ఎదురుచూసిన రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. మన్మథ పేరెట్టుకున్నంత మాత్రాన ఈ ఏడాదంతా బాగుంటుందని అలాంటివారంతా అనుకోవడం సాధ్యమేనా? ఒకటి కాదు...రెండు మూడు ఉగాదులు కలిసి కట్టగట్టుకు వచ్చినా వారిలో అలుముకున్న నిరాశానిస్పృహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. ఒక కవి అన్నట్టు కాలం అద్దంలాంటిది. అందులో కనబడే అందమైన దృశ్యమైనా, భీతిగొలిపే చిత్రమైనా... అది మన ప్రతిబింబమే! స్వస్వరూప జ్ఞానంతో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటే బంగారు భవిష్యత్తు మనదవుతుంది. ఆ ఎరుక అందరిలోనూ... మరీ ముఖ్యంగా పాలకుల్లో కలగాలని ఆశిద్దాం. -
బాలచందర్ శ్రీశ్రీ
స్మరణ ఢిల్లీలో ముగ్గురు నిరుద్యోగులు. ‘ఏంటి... స్మోకింగ్ చేయవా... ఇక్కడ చాలాసార్లు దాంతోనే కడుపు నింపుకుంటాం తెలుసా’ అంటాడు కమలహాసన్ సినిమా ప్రారంభంలో. ఆకలి రాజ్యం రోజులు అవి. నిరుద్యోగ రోజులు. ‘మీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అని చెప్పే రోజులు. ఏ రాజధాని చేరినా నో వేకెన్సీ బోర్డులే. కాని ఆకలి ఊరుకోదు కదా. టైమ్‌కు అలారం మోగినట్టుగా పేగుల్ని మెలిపెడుతుంది. కడుపును రగిలిస్తుంది. మొదటి రీలులోనే ఎవడో ‘రేయ్ ఆకలిగా ఉందిరా’ అంటాడు. దానికి కమలహాసన్ ఊపిరి బిగపట్టి కవిత అందుకుంటాడు. శ్రీశ్రీ కవిత. పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా దగాపడిన తమ్ములారా ఏడవకండేడవకండి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ యొస్తున్నాయ్... సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కూపస్థ మండూకంలా ఉండదలుచుకోలేదా యువకుడు. అభ్యుదయం కావాలి. వెలుతురు కావాలి. క్షవరం చేయించుకుని వచ్చిన అతడిని ‘దూరం నిలబడు. మైల’ అంటాడు తండ్రి. మైలా? దీనికి జవాబు? శ్రీశ్రీ కవితే. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం.... పోస్టల్ ఆర్డర్‌కు తండ్రి డబ్బు ఇవ్వకపోతే ఆయన తంబూరా అమ్మేస్తాడా యువకుడు. మిగిలిన చిల్లరతో ద్రాక్షపళ్లు కొని చేతిలో పెడతాడు. ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఇంతకన్నా ఏం కారణం కావాలి. ఫో.. బయటకి ఫో. అతడు అప్పటికే ఢిల్లీకి టికెట్ కొనుక్కుని ఉన్నాడు. సూట్‌కేస్ అందుకుని ఇంటి నుంచి బయటకు నడుస్తుంటే తండ్రి హేళనగా రెట్టిస్తాడు... ‘ఏం... ఇప్పుడు గుర్తుకు రావడం లేదా శ్రీశ్రీ కవిత్వం?’ ఎందుకు లేదు? సిద్ధంగా ఉంది. పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ..... దేశంలోని నిరుద్యోగ సమస్య చూసి విసుగెత్తిన బాలచందర్ 1980లో ‘ఒరుమయిన్ నిరం సివప్పు’ పేరుతో తమిళంలో సినిమా తీశాడు. తెలుగులో ఆ మరుసటి సంవత్సరమే ‘ఆకలి రాజ్యం’ పేరుతో. తమిళంలో ఆయన తన కథానాయకుడి ఆగ్రహానికి ఆలంబనగా సుబ్రమణ్య భారతి కవిత్వాన్ని సందర్భానుసారంగా వాడాడు. తెలుగులో అందుకు ప్రత్యామ్నాయం శ్రీశ్రీ కాకుండా వేరెవరు ఉంటారు? సాహిత్యాన్ని, కవిత్వాన్ని పలవరించే నాయకుడు, శ్రీశ్రీని గౌరవించే నాయకుడు మన వెండితెర మీద ఉండొచ్చని, ఉండాలని ఒక తమిళుడు చూపించాడు. విషాదం. గొప్ప సాహిత్యాన్ని తూకానికి అమ్ముకునే దౌర్భాగ్యానికి ఏడ్చే నాయకుణ్ణి కూడా. శ్రీశ్రీ ఇంతగా వినిపించిన సినిమాను శ్రీశ్రీ చూశారా? ఆ ప్రశ్నే అడిగితే- విన్నాను. ఇంకా చూడలేదు అని జవాబు చెప్పారు శ్రీశ్రీ ఏదో ఇంటర్వ్యూలో. ఓ మహాత్మా.... ఓ మహర్షీ... -
ప్లేట్స్ అండ్ ఫిల్లోస్.. వడ్డించిన హిస్టరీ
‘ఆ రాణి ప్రేమ పురాణం. ఆ ముట్టడికైన ఖర్చులు .. ఇవి కాదోయ్ చరిత్ర సారం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ అసలు ఏ చరిత్రా పట్టని నేటి తరానికి ప్రేమాయణాలైనా చెప్పాల్సిందే. అందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుందీ గృహోపకరణాల షోరూమ్. అక్కడ దొరికే ఒక్కో వస్తువు ఒక్కో చరిత్రను చెబుతుంది. ఇవన్నీ డిజైనర్ పీస్‌లు. ఇక్కడ దొరికిన ప్రొడక్ట్‌ను పోలింది మరెక్కడా దొరకదు. ఆ యూనిక్‌నెస్ మీ సొంతం కావాలంటే బంజారాహిల్స్‌లోని ‘గుడ్ ఎర్త్’కు వెళ్లాల్సిందే! దేశ చరిత్ర... కర్ణాటకలోని బీదర్‌లో వందల ఏళ్ల నాటి శిల మీద ఒక ఆకృతి ఉంటుంది. దాని స్ఫూర్తితో రూపొందిన బిద్రీ కలెక్షన్‌ను కృష్ణ మెహతా డిజైన్ చేశారు. ఇక కాశ్మీర్‌లోని ప్రసిద్ధ గార్డెన్ నిశాత్బాగ్ను స్ఫురింపజేస్తూ మరో సెట్ అబ్బుర పరుస్తుంది. ఒంటెలను మేపేవారి కోసం ఎడారిలో నీడనిచ్చే ‘పల్మనేరియా’ చెట్టు మరో కలెక్షన్లో కనిపిస్తుంది. హోమ్‌నీడ్స్ ఒక్క క్రాకరీనే కాదు, కర్టైన్స్, బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, సోఫా కుషన్స్.. అన్ని రకాల హోమ్‌నీడ్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఇక్కడ లభించే పిల్లో కవర్స్‌పై ఉండే చార్మినార్ చరిత్ర, నిజాం విశేషాలు, తాజ్‌మహల్ వింతలు.. మిమ్మల్ని హాయిగా నిద్రపుచ్చుతాయి. ‘రత్నాకార’ పేరుతో శ్రీలంక, భారత్‌కు మధ్య సముద్రం అడుగున రత్నాలు లభించే దారిని సూచించే మ్యాప్ మరో పిల్లోపై కొలువుదీరింది. ఆశా మదన్ వీటిని డిజైన్ చేశారు. బారాదరి... ఆఖరి కులీ కుతుబ్ షా అబ్దుల్ పాదుషా. ఆయన ఆస్థానంలో నృత్యం చేసే కళాకారిణి ప్రేమావతిని ఆయన విపరీతంగా అభిమానించేవాడు. ఆమె మరణం తరువాత 1662లో గుర్తుగా ‘బారాదరి’ (12 దారుల కోట)ను కట్టించాడు. ఈ కథ మొత్తం ఒక క్రాకరీ సెట్ వివరిస్తుంది. ఒక ప్లేట్‌పైన నిజాం రాజు బొమ్మ ఉంటుంది అలా మొదలై 12 ప్లేట్లు మొత్తం కథను చెప్పేస్తాయి. ఈ బారాదరి సెట్‌ను పవిత్రా రాజారాం డిజైన్ చేశారు. ఒక్క హైదరాబాద్ చరిత్ర మాత్రమే కాదు.. కాశ్మీర్, కర్ణాటక ప్రాంతాల్లోని సాంస్కృతిక కట్టడాల చరిత్రలను చెప్పే సెట్స్ ఉన్నాయిక్కడ. - శిరీష చల్లపల్లి -
మేస్టారూ... మిస్సింగ్ యూ...
ఆత్మీయుడి పలుకు చేకూరి రామారావు... చేరా... మేస్టారు.... తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా పలికే ఆ పేరు భౌతికంగా వీడ్కోలు తీసుకుంది. తెలుగు మాటకు, వాక్యానికి, కవిత్వానికి ఎనలేని సేవ చేసిన ఆ అవిశ్రాంతమూర్తి విశ్రాంతికి మబ్బుల దొంతరల్లోకి తరలి వెళ్లింది. పాత మార్గానికో బలం, కొత్తదారికో ధైర్యం, యువ గొంతుకకు మద్దతు, నవ భావధారకు తోడ్పాటు... ఇవన్నీ చాలా నిరాడంబరంగా దృఢంగా చేసిన గురుతుల్యులు చేరా. ఆయనను తలచుకోవడం సగర్వంగా జరిగే పనే. కాని మంచి రచన చేయడమే ఆయన పట్ల చూపగల అసలైన కృతజ్ఞత. భాషకు సంబంధించి గట్టి ప్రయత్నం చేయడమే ఆయనకు సమర్పించగల నిజమైన నివాళి. స్మృతి కిణాంకం అంటే? సాహిత్య కిర్మీరం అనగా? సాహిత్య వ్యాస రింఛోళి- ఇది తెలుగా పాళీ భాషా ఫ్రెంచా? అని ఇంటలెక్చువల్ క్యూరియాసిటీతో రగిలిపోడం కాదు. చదువులేక, చదువు రాక అడగడం. అది కూడా ఆ పుస్తకాలకి అట్ట మీద బొమ్మలెయ్యాలి గనక. అయినా చేరా మేస్టారు చీప్‌గా చూసేవాడు కాదు. ఓపిగ్గా అర్థాలు వివరాలు చెప్పేవాడు. విశాలాంధ్ర ఎడిటర్ రాఘవాచారిగారి జోకొకటుంది. మనిషికి ఒకటే ఆప్షన్. చదవడమో లేక రాయడమో. చదువెలాగూ లేదు గనక రాయక తప్పేదేముంది మరి. ఇది మనలాంటి టాలా టోలీ జర్నోలితరతి వ్యవహారం. కానీ మేస్టారి సంగతి అలా కాదు. ఎంతగానో చదివి అంతగానూ రాశాడు. ఆయనకున్న ఆప్షన్ అదీ. చేరాతలు పుస్తకానికి నండూరి రామ్మోహనరావుగారు ముందుమాట రాశారు. 1980-90ల కాలం తెలుగు వచన కవితకు స్వర్ణయుగమన్నారు. అప్పుడు మాకా విషయం తెలీదు. కాని అప్పుడు మేం అనుభవించింది వేరే స్వర్ణయుగం అని కూడా తెలియదు. ఇప్పుడనిపిస్తోంది. ఆ రోజులూ మనుషులూ... కబుర్లూ... వారితో బాతాఖానీలూ... ఉదయం డైలీ జోరు. సాయంత్రమైతే వరవరరావుగారొచ్చి చౌరాస్తాలో పేవ్మెంట్ మీద ఒంటరి టీకొట్టు బయట బండరాయి మీద కూచునేవాడు. పనులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్తే కబుర్లు. సాయంత్రం చేరా. రామ్‌నగర్ మురికి ఫ్లాట్‌లో పిల్ల కవి రూమ్‌లో చేరేవాళ్లం. కిరసనాయిల్ స్టౌ మీద ఖాదర్ బిరియానీ వంట. ప్రిలిమ్స్‌లో పక్కన త్రిపురనేని శ్రీనివాసూ, గుడిహాళం రఘునాథంలాంటి మందంతా జేరి ఉద్రేకపడిపోయీ ఊగిపోయీ ఆ రాతకోతలేంటి ఆ ముష్టి కవిత్వంలో ఏదో ఎక్కడో ఉందంటూ పొగడ్తలేంటీ అంటూ చేరా మీద ముక్కుల్లోంచీ చెవుల్లోంచీ నిప్పులు కురిపించేవారు. ఆడపిల్ల రాసిందంటే అద్భుతమనేడమేనా? వెనకా ముందూ లేదా? కవిత్వమనేదొకటుంటుంది గదా అని ఆయన్ని కైమా కొట్టేవారు. చిన్నగా నవ్వేవాడు. ‘కోపం బెరుంగడు’. తాపీగా తన పాయింట్ చెప్పేవాడు. చాలా రీజనబుల్‌గా ఉండేది. అయినా సరే ‘వుయ్ డిఫర్ విత్ యు’ అని ఠలాయించేవాళ్లు. ‘ఐ బెగ్ యు డిఫర్ విత్ మీ’ అని నవ్వేవాడు. అందరూ ఆయన్ని కమ్యూనిస్టంటారుగాని నిజంగా ఆయన లిబరల్ డెమోక్రాట్ నిజమైన రిపబ్లికన్ అనిపిస్తుంది. లేపోతే మంచి యాంటీ కమ్యూనిస్టులైన నండూరిలాంటి వారు ఆయన్ని అంతగా ప్రేమించరు. మళ్లీ ఆ కాలం గురించి. ఆకుచెప్పులేసుకుని, చెరిగిన జుబ్బా, చంకలో వ్యాసాల కట్ట పెట్టుకుని బాలగోపాల్ వచ్చేవాడు. పలకరించడానికి ఎన్ని కితకితలు పెట్టినా అన్నీ మోనో సిలబుల్స్లోనే సమాధానాలు. పలుకే బంగారం. సాయంత్రం క్రాస్‌రోడ్స్‌లో రెగ్యులర్ జాయింట్‌కి పతంజలీ, శివాజీ, దేవీప్రియ, నేనూ విఫలమైన కవి సబ్ ఎడిటర్లూ కలిసి వెళ్తే ఒక క్యూబికల్లో బూదరాజు రాధాకృష్ణ, పక్కన జ్యోతి మంత్లీ ఎడిటర్ గోపీతో హరి పురుషోత్తమరావు అప్పుడప్పుడు స్మైల్‌గారు. ఏవో కొంపలు మునిగిపోయినట్టు ‘ఇప్పుడూ భద్రిరాజు కృష్ణమూర్తి చెప్పిందేమిటి? నోమ్ చామ్స్కీ రాసిందానికీ దీనికీ తేడాని ఎలా చూడాలోయ్’ అంటూ చర్చ. స్టాలిన్ భాషాశాస్త్రం గురించి రచ్చ కూడా. క్రాస్‌రోడ్స్ నుంచి కాస్త దూరం జరిగితే రాంభట్ల కృష్ణమూర్తి. ‘ఏం ఫ్రెండూ’ అంటూ బ్రాండెడ్ పలకరింపు. బుల్ ఫిన్స్ మైథాలజీలోనే యుడిపస్ కాంప్లెక్స్ ఉంది. దాన్ని ఫ్రాయిడే కనిపెట్టాడనుకోడం రాంగ్. అస్సీరియా మెసపుటోమియా కల్చర్స్ చూస్తే అసలు సంగతి తెలుస్తుందని నాన్ స్టాప్ లెక్చర్స్. కాసేపయితే గజ్జెల మల్లారెడ్డి. తెలుగునాట భక్తిరసం వట్టికే రాయలేదు అని మొదలెట్టి నాన్‌స్టాప్‌గా జోకులేసి నవ్వించడం. ఈనాడు పేపర్ నుంచి రాచమల్లు రామచంద్రారెడ్డిగారొస్తే ‘సంవేదన’ నుంచి ‘అనువాద సమస్యల’ వరకూ ఎన్ని ప్రశ్నలు కురిపించినా ముక్తసరే మరి. క్రాస్‌రోడ్స్‌లో ఏ.ఆర్.క్రిష్ణ ఇంటికి పతంజలీ నేనూ వెళ్తే అక్కడ రావిశాస్త్రితో పార్టీ. చేరాతో పాటూ ఎప్పుడూ వీళ్లందర్నీ కలవడం మామూలు వ్యవహారంగా ఉండేది. పెద్ద విశేషంగా ఫీలయ్యే వాళ్లం కాదు. చేరా అంటే ఎప్పుడూ కలిసే మనిషే కదా అనిపించేది. స్మృతి కిణాంకానికీ రింఛోలీకీ కవర్ బొమ్మలేయడం, వెనక మాటలు రాయడం రోజువారీ పనిలాగా అనిపించేది. ఆయన ఇంటికెళ్లడం, ఆవిడ అన్నం పెడితే తినడంలో ఏదో గొప్ప కనిపించేది కాదు. ఒకసారి మరో పుస్తకం అట్ట బొమ్మ కోసం వచ్చి ఆయన నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఎదురుగా ఉన్న కవిని ఇతను కె.రాజేశ్వరరావు అని పరిచయం చేశాను. విష్ చేశాడు. ఈ పుస్తకం ప్రూఫ్ రీడింగ్ తల నెప్పిగా ఉందన్నాడు. కె.రా. బాగా చూడగలడని చెప్పా. ఓ గంట మా కబుర్ల తర్వాత కె.రా కొన్ని పేజీలు చూపించి ఈ పద్యాల్లో గణ విభజన తప్పిందన్నాడు. ఆయన చూసి వెంటనే నిజమేనన్నాడు. మీరు ఇలా చూడకపోతే అచ్చయి బయటికెళ్తే పరువు పోయేదన్నాడు. చాలాకాలం తర్వాత మళ్లీ నా స్టుడియోలో మా మీట్. పాబ్లో నెరూడా దీర్ఘకవితకి కె.రా. అనువాదానికి బొమ్మలేస్తున్నా. ఏమిటవి అంటే చెప్పా. ముందుమాట కూడా రాస్తున్నానన్నా. వెంటనే ఆయన ‘నాకూ చాన్స్ ఉంటే కొన్ని మాటలు రాస్తా. వీలుంటేనే’ అని ఆఫర్ చేశాడు. నాచన సోముడూ, శ్రీనాథుడూ, మయకోవ్‌స్కీ, నెరుడా అంటూ అందర్నీ అప్ప జెప్పే ధారణ శక్తిగల వాళ్లిక పుట్టరు. అంతా కొత్తతరం వస్తోంది. వీళ్లకీ విషయాలు తెలీవని బెంగపడ్డాడు. తర్వాత రాసిచ్చాడు కూడా. గొప్ప మోడెస్టీ. బోలెడు లిబరలిజం. ఎదుటి అభిప్రాయం ఎంత దుర్మార్గంగా ఉన్నా నిజంగా సహించే భరించే రూసో. మళ్లీ మానవ హక్కులన్నా ఖైదీల విడుదల కోసమైనా కమిటీల్లో ఉండి సభలకొచ్చే కమిట్మెంట్. అరుదైన కాంబినేషన్. ముందు చెప్పిన స్వర్ణయుగం పేర్లలాగే మాష్టారి పేరూ చెప్పుకుంటాం. తెలుగు భాషా, కవిత, వచనం అన్నీ కూడబలుక్కుని ఆయన గురించి బెంగపడతాయి. మేస్టారూ.. మేం కూడా నిజంగా మిస్సింగ్ యూ! - మోహన్, ఆర్టిస్ట్, 7702841384 ఆయన సంపూర్ణ స్త్రీవాది బోధకుడి మాట ఆయన మా సహ ప్రయాణికుడు. ఆయన నికార్సైన మా మనిషి. ఆయన సంపూర్ణమైన స్త్రీవాది. ఆయన మా చేరా మాస్టారు. చేకూరి రామారావుగారు తెలుగు సాహితీ ప్రపంచంలో భాషాశాస్త్రమూ సాహిత్యమూ అత్యంత బాగా తెలిసిన అరుదైన ప్రతిభాశాలి. అమెరికాలో పిహెచ్.డి పూర్తి చేసి ఉస్మానియాలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయనకు- నిలువెత్తు ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని ఎంతగానో ఇష్టపడే ఆయనకు- విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలోని లేత గులాబీ రంగు పూలతో మిలమిలలాడే బఠానీ తీగలంటే భలే ఇష్టం. హైదరాబాద్‌లో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో తను స్పీకర్ అయినా కాకపోయినా సభకి ఒక శ్రోతగా వచ్చే అతి కొద్దిమంది ప్రముఖ సాహితీకారుల్లో చేరా ఒకరు. ఆయనకి సాహిత్యమంటే అంత ప్రేమ. చేరాతలు కోసం సాహితీ లోకం పాఠకులు చాలా ఆసక్తిగా ఆత్రంగా ఆదివారం రోజు యెదురు చూసేవారు. ఆ వారం యే కవి గురించి రాయబోతున్నారు. యేం రాయబోతున్నారు వారమంతా వొక చర్చ వొక ఊహ పోటీపడి యెదురు చూసేవి. ఆ ఆదివారం ఆ కవికి పండగ. కవిత్వానికి సంబరం. పాఠకులు సాహితీకారులు మెచ్చుకునేవారు. విభేదించేవారు. విమర్శించేవారు. వారమంతా అలా గడిచేది. అయినా అందరూ మళ్లీ వచ్చే ఆదివారం కోసం యెదురు చూస్తూ ఉండేవారు. మాస్టారి కాలమ్‌కి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. స్త్రీవాద కవిత్వాన్ని మాస్టారు తన కాలమ్‌లో పరిచయం చేసేవారు. విశ్లేషించేవారు. యెన్ని కవితలు రాశావన్నది ప్రాతిపదిక కానే కాదు. యెంత కొత్తగా రాశారు అన్నదే చూసేవారు. కవిత, కథ, నవల, కాలమ్, వ్యాసం యే స్త్రీవాద రచనా ప్రక్రియైనా కావొచ్చు మాస్టారు పూర్తిగా శ్రద్ధగా చదివేవారు. ఆ రచన మీద తన అభిప్రాయాన్ని పత్రికలకి పంపించేవారు. ఆ కాలంలో వో వైపు స్త్రీవాద రచనలని ఖండించేవారుండేవారు. మరోవైపు శాసించేవారుండేవారు. వీరందరికీ యెదురొడ్డి మావైపు నిలుచున్న నిలువెత్తు స్నేహితులు చేరాగారు. సాహిత్యంలో సమకాలీన సమాజానికి ప్రతిస్పందనగా వచ్చిన ప్రతి రూపాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆ రూపానికి వెనుక ఉన్న శక్తులని సమర్థించుకుంటూ రూపాన్ని తీర్చిదిద్దడానికి దోహదం చేశారు. సాహిత్యంలో కొత్తగా వినపడుతున్న గొంతులలో దేనికి దాన్ని విడివిడిగా చూసి బలపర్చాల్సిన గొంతుకలకి తన గొంతుని కలుపుతూ వచ్చిన భాషా సాహితీ దిగ్గజం చేకూరి రామారావుగారు. మన చేరా మాస్టారు. - కుప్పిలి పద్మ, 9866316174 ఆయన మాట లేకుండా పాఠం నడవదు చేరా ఇక లేరన్న వార్త వినగానే గుండె బరువెక్కిపోయింది. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. మా గురువులు- జి.ఎన్.రెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి గార్లతో చేరాకి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. జి.ఎన్.రెడ్డి, అడపా రామకృష్ణారావు, చేకూరి రామారావు అమెరికాలో కలసి ఒక గదిలో ఉంటూ చదువుకున్నారట. చేరా గొప్ప స్నేహశీలి అని జి.ఎన్.రెడ్డిగారు అంటూ ఉండేవారు. భాషాశాస్త్రంలోనే కాదు పాకశాస్త్రంలోనూ ఆయన ఉద్దండుడు అని అనేవారు. కేతు విశ్వనాథ రెడ్డి, చేరా, కె.కె.రంగనాథాచార్యులు ఈ ముగ్గురూ సార్వత్రిక విశ్వ విద్యాలయం పాఠ్యాంశాల రూపకల్పనలో ప్రధాన భాగస్వాములు. సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వారు అందించిన సేవ ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిది. ఇక చేరా, కేతుగార్ల స్నేహ సంబంధాలు మాటల్లో చెప్పేవి కావు. చేరా అభిప్రాయాలను కేతు చాలా గౌరవించేవారు. చేరాని కేతుసార్ చాలా సరదాగా ‘కవీ’ అని పిలిచేవారు. చేరా వెంటనే పలకక పోతే ‘మహా కవీ’ అని రెట్టించేవారు. చేరా మాత్రం ఒక చిరునవ్వు నవ్వి ఊరకుండేవారు. ఎందుకు సార్ అలా పిలుస్తారు అని అడిగితే అది నాకో సరదా అనేవారు కేతు నవ్వుతూ. చేరా ఉపన్యాస ధోరణి ఎంతో బావుంటుంది. చిన్న చిన్న వాక్యాలు స్పష్టంగా సూటిగా ఉంటాయి. ఎంత లోతైన విషయాన్నైనా ఎంత గంభీరమైన విషయాన్నైనా చాలా సాదాసీదాగా చెప్పడం ఆయన విధానం. సటిల్ హ్యూమర్ ఆయన మాటల్లో కనిపించేది. ఒకసారి ఉస్మానియా పునశ్చరణ తరగతుల్లో ఆయన ‘వ్యాకరణం ఎందుకు చదవాలి’ అని ఓ ఉపన్యాసం ఇచ్చారు. క్లాసంతా నవ్వుల పువ్వులే. చేరా అనగానే తెలుగు వాక్యం, చేరాతలు, ఆయన నిరంతర అధ్యయనం, ఆయన భాషా శాస్త్ర వ్యాసాలు, విమర్శ, సాహిత్య వ్యాసాలు ఇలా ఎన్నో ఎన్నో గుర్తుకు వస్తున్నాయి. మాత్రా ఛందస్సు, ముత్యాల సరంపై చేరా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వచన పద్యం గురించి సంపత్కుమారాతో చేసిన వాదోపవాదాలు, చర్చలు చాలా విలువైనవి. చేరా ప్రస్తావన లేకుండా ఈరోజు ఏ విశ్వ విద్యాలయంలోనూ భాషా బోధన జరగదు. భాషా శాస్త్ర అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసినవాడు చేరా. - తుమ్మల రామకృష్ణ, 9949055015 స్నేహితుడి జ్ఞాపకం - చేకూరిన నిధి! ఉస్మానియాలో చేకూరి రామారావుకి పెంచికల చిన నరసింహారెడ్డి సీనియర్. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో భాషాశాస్త్ర విభాగం అధిపతిగా పని చేసి ఊరి బాగు కోసం గద్వాల ప్రాంతంలోని ‘గట్టు’ గ్రామంలో అ‘విశ్రాంత’ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఫోన్ చేశాను. హలో అన్నారు. ‘తెలిసిందా?’ అన్నాను. ఎంతసేపటికీ మారు మాట రాలేదు. ఒక నిశ్చేష్ట! కొంతసేపటికి తన మిత్రుడు చేకూరిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఉస్మానియాలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా పనిచేసిన గెరాల్డ్ కెల్లీని శాఖాధిపతి భద్రిరాజు కృష్ణమూర్తిగారు చేరాకు పరిచయం చేశారు. వారిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. కెల్లీ స్ఫూర్తి చేరా రచన ‘తెలుగులో నామినీకరణం’లో ప్రతిఫలిస్తుంది. నోమ్ చామ్స్కీ ‘ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్’ను తెలుగుకు అన్వయిస్తూ వాక్యనిర్మాణాలను వివరిస్తూ చేరా పరివర్తనా వ్యాకరణం రాశారు. ‘మాండలీకాలను బట్టి లిఖిత భాషా మారాల్సిందే’ అని పెద్దలతోనూ స్పష్టంగా చెప్పారు. నాటకం, నవల తదితర ప్రక్రియల్లో తెలుగు వెనుకబడిందేమో కాని కవిత్వం విషయంలో ఇతర భాషల కంటే ముందుంది. ఈ పరిణామానికి ముఖ్యకారకుడు చేరా. స్త్రీవాద కవిత్వాన్ని, భిన్న సామాజిక వర్గాల యువ కవులనూ ఆయన ప్రోత్సహించారు. తాను పరిచయం ప్రోత్సహించిన కవుల్లో వారిలో వారికి భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉండేవి. గమనించి నవ్వుకునేవాడు. ఉస్మానియా క్యాంపస్‌లో, విద్యానగర్‌లో ఆయన ఇల్లెప్పుడూ కవిత్వాన్ని ఆవాహన చేసుకునే యువకులతో నిండి ఉండేది. పక్షుల వైవిధ్యాన్ని బట్టి వాటికి అనువైన గూడును కట్టి ఆదరించిన భాషావృక్షం చేరా. కవిత్వం అనే గుడ్డును పొదిగి కవి అనే పక్షికి తొలి ఆహారం అందించిన వాడు కూడా! ఈ సమాజం బాగోలేదు. దీన్ని పునర్నిర్మించాలి అనే అభ్యుదయవాదులతో పేచీ పడకుండానే ‘పాత సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలి’ అని వాదించేవాడు చేరా. శ్రీశ్రీపై పీహెచ్డీ చేసిన మిరియాల రామకృష్ణను మెచ్చుకున్నప్పుడు నగ్నముని కొయ్యగుర్రాన్ని ఆధునిక మహాకావ్యం అన్నప్పుడు ఆత్మీయుల నుంచే విమర్శలొచ్చాయి. స్పష్టత-చిరునవ్వు చేరా ప్రత్యేకత. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణల్లో గీతా రామస్వామికి, సార్వత్రిక విశ్వవిద్యాలయపు సిలబస్ రూపకల్పనకు ఆయన కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. సరళమైన తెలుగు వాక్యం ఆయన సొత్తు. అయినా ఛందస్సు అంటే మహాప్రేమ. పాతకాలపు ఆభరణాల్ని మెరుగు పెట్టుకోవాలే తప్ప కరిగించకూడదు బూడిదే మిగులుతుంది అనేవారు. తిరుపతిలో ఒక సాహితీసభ జరిగింది. ఛందస్సుపై విశేష కృషి చేసిన కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత రావూరి దొరస్వామిశర్మ పాల్గొన్నారు. అంత సాంప్రదాయవాది, పెద్దాయన చేరాను చూసి ‘మీ దర్శనం నాకు ‘చేకూరి’న భాగ్యం’ అన్నారు. చేరా తెలుగు భాషకు చేకూరిన భాగ్యం. గిడుగు రామ్మూర్తి తర్వాత తెలుగుభాషకు సేవచేసిన ముఖ్యుల్లో భద్రిరాజు కృష్ణమూర్తి సరసన నిలుస్తారు చేకూరి. గిడుగు ఉత్తరాంధ్ర. భద్రిరాజు కోస్తా. చేరా తెలంగాణ. మారిన పరిస్థితుల్లో ‘చేరా’ స్మారక పురస్కారాలూ పీఠాలు ఆశించడం తెలుగు వారి దురాశ కాదు కదా’’ - పున్నా కృష్ణమూర్తి -
పద్యానవనం: సకలజనరంజనం కర్తవ్యం
‘‘నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తార్చినాను నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను నేను వేస్తంభాల నీడలో నొక తెల్గు తోట నాటి సుమాలు దూసినాను నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను...’’ ఇదిగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే... అంటాడు శ్రీశ్రీ. ‘...మురికి గుడిసెల్లో నివసించే పరమ దరిద్రుల నుదుటి మీద ఏ కన్నంలోంచో జాగా చేసుకొని ఎలాగైనా పరామర్శ చేస్తావు కదూ?’ అని శరచ్చంద్రికను ప్రశ్నిస్తూ, పేదల పక్షం వహించమని పరోక్షంగా అభ్యర్థిస్తాడు మహాకవి. నిజమే! కాలం అనేకానేక పరిణామాలకు నిరంతర సాక్షి, ద్రష్ట, కొన్నిసార్లు తీర్పరీ! కాలం కళ్లెదుట జరిగిన పలు పరిణామాల క్రమంలో అంతిమంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎలా తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు? అంటే, సమాధానాలు తేటమయ్యే క్రమంలోనే ఆ ప్రశ్నలు రోజు రోజుకు మరింత మసకబారి పోతాయి. చరిత్ర పుటల్లో పదాలు, వాక్యాలు, పంక్తులవుతాయి. వ్యక్తులతో నిమిత్తం లేకుండా చరిత్ర గతిలో పర్యవసానాలే మిగులుతాయి. ఉద్యమ గొప్పతనం ఉద్యమకాలంలో తెలియదు. వ్యక్తులు, జనసమూహాల ఇష్టాయిష్టాల్ని బట్టో, కొంతమంది ఇతరేతర ప్రయోజనాల్ని బట్టో కాకుండా, రేపటి ఫలాలను బట్టే నిన్నటి ఉద్యమం వెనుక సహేతుకత నిర్ధారణ అవుతుంది. శీర్షభాగాన ఉండి ఉద్యమం నడిపిన వారికి, విమర్శించే నాటికన్నా ఆచరించే నాడు బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. పేదరికంతో, వేదనతో, ఇబ్బందులతో అలమటించే ప్రతి మనిషి ఆర్తికి స్పందనై పాలన ప్రతిబింబించాలి. ఒక బాదుషా కాదని మరో బాదుషాకు కిరీటం తొడగడానికి రాలేదు ఈ కొత్తశకం. ఏలికల కన్నా ముఖ్యంగా పంట ప్రతి కృశీవలునికి దక్కాలి. అందుకే ప్రజాకవి ఇక్బాల్ అంటాడు, (జిస్ ఖేత్ దహఖుకొమయస్సేర్ నహోరోజీ ఉస్ ఖేత్‌కె హర్ ఖూషయె గందంకో జలాదో) ‘‘యే చేను కృషివలునికి తిండి ఈయదో ఆ చేనులో ప్రతి మొక్కను కాల్చేయండి’’ అని. ‘యద్భావం తద్భవతి’. సత్సంకల్పంతో మొదలెడితే సత్ఫలితాలే లభిస్తాయి. అయితే, ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి. ఇల్లలకగానే పండుగ కాదు. మహాత్మాగాంధీ చెప్పినట్టు గమ్యం మాత్రమే కాదు, మార్గం కూడా ఉదాత్తమైనదే కావాలి. స్వాతంత్రోద్యమ పథాన ఉన్నపుడు పరవాలేదు, అటువంటి మార్గదర్శకత్వం నిరంతరం లభించేది పండిత్ జవహార్‌లాల్ నెహ్రూకి. స్వాతంత్రానంతరం ప్రభుత్వ బాధ్యతల్లోకి రావడానికి గాంధీజీ ససేమిరా అన్నారు. భారత ప్రథమ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నెహ్రూకు ఒక గగుర్పాటు కలిగింది. బాపూజీ తోడు అడుగడుగున లభించదు. సాంఘిక అసమానతలు, ఆర్థిక అంతరాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉండే ఇంత పెద్ద దేశాన్ని పాలించడం ఎలా? నిర్ణయాలు తీసుకోవడం ఎలా? ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి ఎందరెందరో బలిదానాల యజ్ఞ ఫలాల్ని అందరికీ అందించడం ఎలా? చేయగలనా? అన్న శంక వెంటాడుతోంది. వెంటనే గాంధీజీ దగ్గరకు వెళ్లిపోయారు. ‘బాపూ, చెప్పండి ఎలా పాలించాలి, నాకేదో కొంచెం భయంగా ఉంది, ఏదైనా మార్గం నిర్దేశించండి’ అని అడిగినపుడు పూజ్య బాపూజీ స్పందన సర్వకాల సర్వావస్థల యందూ గొప్ప మార్గనిర్దేశనమే! గాంధీజీ వెంటనే తన ముందు దస్త్రాల్లోంచి... దీన వదనంతో, ఎముకల గూడులాగున్న బక్క, నిరుపేద సామాన్యుడి ఫోటో ఒకటి తీసి, ‘‘చాచా! ఆందోళన పడొద్దు. ఇదుగో ఈ ఫొటోను నీ టేబుల్‌పై ఉంచుకో, దేశ పథనిర్దేశకుడిగా నీవు విధానపరమైన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒకసారి ఈ ఫొటో వంక చూడు తదేకంగా! సదరు నిర్ణయం ఏ కొంచెమైనా ఇతని ఉన్నతికి తోడ్పడుతుందా? అని ఆలోచించు. అవుననిపిస్తే నిస్సందేహంగా నిర్ణయం తీసేసుకో’ అని సలహా ఇచ్చారు. ఆ స్పృహ ఇప్పుడు కావాలి. పాలకులకు ఆ సోయి ఉండాలి. ఈన గాచి నక్కల పాల్జేసిన గతి పట్టించకుండా అప్రమత్తమై మెలగాలి. బహుముఖీయ భావనై ఈ పద్యంలో మహాకవి దాశరథి పేర్కొన్నట్టు అందరూ కత్తులు దూయరు. ఉద్యమ వాకిట్లో వనాలు నాటి సుమాలు దూసినవారు ఎందరో! పాటై పల్లవించిన వారు, పద్యమై విజృంభించినవారు, పరపాలనా శృంఖలాలు తెగ్గొట్టినవాళ్లు, ఆకాశం ఎత్తైఆర్చినవారు, సకల జనులై సమ్మెకట్టిన వాళ్లు, ఆశతో-నిరాశతో ఆవిరైన వాళ్లు... ఇలా ఎందరెందరో. వారందరి ఆశయాల ఫలాల్ని వారసులకు, వాటాదారులకు, వాస్తవ హక్కుదారులకు దఖలు పరచాలి. సకలజనరంజన తక్షణ కర్తవ్యం. - దిలీప్‌రెడ్డి -
మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు?
డైట్‌సెట్ - 2014 తెలుగు డైట్‌సెట్ ప్రవేశ పరీక్షలో తెలుగు సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మాతృభాష తెలుగే కదా అని అభ్యర్థులు అశ్రద్ధ చేయకూడదు. పోటీ పరీ క్షలో ప్రతి విభాగం ముఖ్యమైందే. ప్రతి ప్రశ్న, ప్రతిమార్కూ కీలకమే. అభ్యర్థులు మంచి ర్యాంకు సాధించాలంటే మొదట తెలుగు విభాగంపై పట్టు సాధించాలి. దీంట్లో ఎక్కువ గా కవులు- రచయితలు, వారి కాలాలు, వారి బిరుదులు, రచనలు, కావ్య ప్రక్రియలు, ప్రసిద్ధ కొటేషన్లు లాంటి సాహిత్య అంశాలు; సంధులు సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, అర్థా లు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి- వికృతులు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు, నామ్నీకరణం, వాక్య భేదాలు లాంటి వ్యాకరణాంశాలపై ప్రశ్నలు వస్తాయి. మాదిరి ప్రశ్నలు 1. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఎవరి ఆస్థాన కవి? 1) తుళువ నరసింహరాయలు 2) రెండో నరసింహరాయలు 3) సాళువ నరసింహరాయలు 4) హరిహర బుక్కరాయలు 2. ‘కొడుకుల్ బుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై’ పద్యం ఏ శతకం లోనిది? 1) భాస్కర శతకం 2) దాశరథీ శతకం 3) సుభాషిత రత్నావళి 4) శ్రీ కాళహస్తీశ్వర శతకం 3. జాషువాకు ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? 1) ఫిరదౌసి 2) గబ్బిలం 3) ముంతాజ్ మహల్ 4) క్రీస్తు చరిత్ర 4. ‘ఆధునిక వచన రచనకు పట్టుగొమ్మ’ అని ఎవరినంటారు? 1) చాసో 2) కొడవటిగంటి 3) శ్రీపాద 4) గురజాడ 5. వ్యక్తిని లేదా వ్యవస్థను విమర్శించడం ఏ ప్రక్రియలో సాధారణం? 1) కథానిక 2) నవల 3) గల్పిక 4) వైజ్ఞానిక కల్పన వ్యాసం 6. మహాత్ముని ఆస్థాన కవి అనిపించుకున్నవారు? 1) బసవరాజు అప్పారావు 2) తుమ్మల సీతారామమూర్తి చౌదరి 3) త్రిపురనేని రామస్వామి చౌదరి 4) గరిమెళ్ల సత్యనారాయణ 7. పుట్టపర్తి రచించిన మేఘదూతం ఒక? 1) గేయకావ్యం 2) కవితా సంకలనం 3) వచన కవితా సంపుటి 4) ఖండకావ్యం 8. }పాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఆత్మకథ 1) మూన్నాళ్ల ముచ్చట 2) బ్రతుకు మూట 3) అనుభవాలు- జ్ఞాపకాలు 4) అనంతం 9. ఏ రచనతో శ్రీశ్రీ అభ్యుదయ కవిగా పేరుగాంచాడు? 1) ఖడ్గసృష్టి 2) మహాప్రస్థానం 3) మరో ప్రస్థానం 4) చరమరాత్రి 10. శృంగార శాకుంతలం ఎవరి రచన? 1) శ్రీనాథుడు 2) పిల్లలమర్రి పినవీరభద్రుడు 3) పింగళి సూరన 4) పిల్లలమర్రి చినవీరభద్రుడు 11. స్వారోచిష మనుసంభవం అనే పేరున్న కావ్యం? 1) అనరుద్ధ చరిత్ర 2) సారంగధర చరిత్ర 3) మనుచరిత్ర 4) వసు చరిత్ర 12. ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది? 1) కందుకూరి వీరేశలింగం 2) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ 3) సురవరం ప్రతాపరెడ్డి 4) చేకూరి రామారావు 13. ఏ కవి వర్ణనలు ప్రబంధ కవులకు మార్గదర్శకం అయ్యాయి? 1) ఎర్రన 2) తిక్కన 3) నన్నెచోడుడు 4) అల్లసాని పెద్దన 14. అనువాద పద్ధతి, శైలిలో తెలుగు కవులు ఎవరి కవితా మార్గాన్ని అనుసరించారు? 1) నన్నయ 2) తిక్కన 3) శ్రీనాథుడు 4) పోతన 15. ఎవరి సీస పద్యాలకు విశిష్ట స్థానం ఉంది? 1) తిక్కన 2) కాసుల పురుషోత్తమ కవి 3) శ్రీనాథుడు 4) పింగళి సూరన 16. పుట్టపర్తి నారాయణాచార్యుల బిరుదు? 1) సరస్వతీ పుత్రుడు 2) అభినవ పోతన 3) అభినవ తిక్కన 4) కవి మిత్రుడు 17. పేరడీ ప్రక్రియకు ఆద్యులు? 1) శ్రీశ్రీ 2) వేదుల సత్యనారాయణ శాస్త్రి 3) జరుక్ శాస్త్రి 4) కృష్ణశాస్త్రి 18. పిల్లలమర్రి పినవీరభద్రుని జైమినీ భారతం ఏ కావ్యం? 1) వీరరస 2) శృంగార 3) శాంతరస 4) కరుణరస 19. సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళ నమైన పుట్టపర్తి నారాయణాచార్యుల రచన? 1) పండరి భాగవతం 2) సాక్షాత్కారం 3) మేఘదూతం 4) శివ తాండవం 20. నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణం కానిది? 1) అక్షర రమ్యత 2) సూక్తి వైచిత్రి 3) నానారుచిరార్థసూక్తి నిధిత్వం 4) ప్రసన్న కథా కవితార్థయుక్తి 21. గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువదిం చినవారు? 1) దాశరథి రంగాచార్యులు 2) దాశరథి కృష్ణమాచార్యులు 3) సినారె 4) ఆరుద్ర 22. వార్తాపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను వాడినవారు? 1) తాపీ ధర్మారావు 2) కాశీనాథుని నాగేశ్వర రావు 3) కందుకూరి 4) గురజాడ 23. {తిపురనేని రామస్వామి చౌదరి కలం నుంచి జాలువారిన సూత పురాణం ఏ వాదానికి చెందింది? 1) స్త్రీవాదం 2) హేతువాదం 3) మైనారిటీ వాదం 4) దళిత వాదం 24. బారిష్టర్ పార్వతీశం నవలాకారుడు? 1) మొక్కపాటి నరసింహశాస్త్రి 2) పానుగంటి లక్ష్మీనరసింహం 3) విశ్వనాథ సత్యనారాయణ 4) చిలకమర్తి లక్ష్మీనరసింహం 25. చంపూ రామాయణం, చంపూ భారతం- కావ్యాలను రాసినవారు? 1) పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు 2) పురాణపండ సుబ్రహ్మణ్యశాస్త్రి 3) కందుకూరి వీరేశలింగం 4) అల్లంరాజు రంగసాయి కవి 26. దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ఏ ప్రక్రియ? 1) నవల 2) కథా సంపుటి 3) కవితా సంపుటి 4) కావ్యం 27. అనుభూతి ప్రాధాన్యంతో కవితలు రాసినట్లు ప్రసిద్ధి చెందినవారు? 1) ఆరుద్ర 2) తిలక్ 3) జాషువా 4) దాశరథి 28. శారద లేఖలు రచనతో లేఖా సాహిత్యాన్ని పరిపుష్టం చేసినవారు? 1) ఆచంట శారదా దేవి 2) మల్లాది సుబ్బమ్మ 3) బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 4) కనుపర్తి వరలక్ష్మమ్మ 29. మనుష్యుడే నా సంగీతం- మానవుడే నా సందేశం అన్న కవి ఎవరు? 1) దాశరథి 2) సినారె 3) శ్రీశ్రీ 4) నగ్నముని 30. ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది? 1) జ్ఞాన వాశిష్టం 2) రామేశ్వర మహత్యం 3) సుభాషిత రత్నావళి 4) విశ్వామిత్ర చరిత్ర 31. {Vంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రచయిత రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి మరో పేరు? 1) శ్రీకారం 2) అంతరంగం 3) ఆముఖం 4) విష్కంభం 32. ఉదయశ్రీ ఖండకావ్య సంపుటాలను రచించిన కవి? 1) రాయప్రోలు సుబ్బారావు 2) జంధ్యాల పాపయ్యశాస్త్రి 3) జాషువా 4) కృష్ణశాస్త్రి 33. అనుభూతి చిత్రణంతో అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ప్రాధాన్యం ఉండే ప్రక్రియ ఏది? 1) ఏకాంకిక 2) కథానిక 3) గల్పిక 4) స్వీయ చరిత్ర 34. సినిమా జీవితాన్ని మన కళ్ల ఎదుట ఆవిష్క రించే ‘పాకుడు రాళ్లు’ నవలా రచయిత? 1) యన్.ఆర్. నంది 2) రాచకొండ విశ్వనాథ శాస్త్రి 3) దాశరథి రంగాచార్య 4) రావూరి భరద్వాజ 35. అయ్యగారి వీరభద్రరావు రచించిన, అశరీరి, దయ్యాల కొంప మొదలైనవి ఏ ప్రక్రియ? 1) కథ 2) కథానిక 3) నాటిక 4) వ్యాసం 36. గోలకొండ పత్రిక సంపాదకులు? 1) కాశీనాథుని నాగేశ్వరరావు 2) ముట్నూరి కృష్ణారావు 3) సురవరం ప్రతాపరెడ్డి 4) కందుకూరి వీరేశలింగం 37. యండమూరి భద్రాచార్యుల బిరుదు కానిది? 1) అభినవ హరిశ్చంద్ర 2) అభినవ కుచేల 3) సువర్ణ హస్త ఘంటాకంకణ 4) నాట్యాచార్య 38. పరిశోధన, పరిశీలన, ఎవరి వ్యాస సంకలనాలు? 1) జి.వి. సుబ్రహ్మణ్యం 2) యస్వీ రామారావు 3) నాయని కృష్ణకుమారి 4) నండూరి రామ్మోహనరావు 39. బోయ జంగయ్య రచించిన ప్రసిద్ధ నవల? 1) జాతర 2) ఎచ్చరిక 3) పావురాలు 4) జగడం 40. గౌతమి కోకిల బిరుదాంకితులు? 1) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 2) వేదుల సత్యనారాయణ శాస్త్రి 3) గుర్రం జాషువా 4) దువ్వూరి రామిరెడ్డి 41. కైఫియత్తు ఏ భాషా పదం? 1) లాటిన్ 2) జర్మన్ 3) హిందూస్తానీ 4) గ్రీక్ 42. నార్ల వెంకటేశ్వరరావు ‘నాయకత్వం’ పాఠ్యభాగం ఏ కోవకు చెందింది? 1) వార్తా వ్యాఖ్య 2) పీఠిక 3) సాహిత్య విమర్శనా వ్యాసం 4) సంపాదకీయ వ్యాసం 43. {తిపురనేని గోపీచంద్ ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ సంపుటిలోని కథలను ఏమని పేర్కొన్నారు? 1) గల్పికలు 2) స్కెచ్‌లు 3) పేరడీలు 4) స్వగతాలు 44. పంజాబ్‌లో తుమ్మచెట్టును ఏమని పిలుస్తారు? 1) కికార్ 2) కురువేళం 3) గోబ్లి,బాల్ 4) స్వర్ణపుష్పం 45. విజ్ఞాన చంద్రిక గ్రంథమండలిని ఎవరు స్థాపించారు? 1) సురవరం ప్రతాపరెడ్డి - 1925 2) కొమర్రాజు లక్ష్మణరావు - 1906 3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు-1905 4) కందుకూరి వీరేశలింగం- 1897 46. అంబేద్కర్ తన జీవిత నిర్మాతలు, గురువులుగా ఎవరిని పేర్కొన్నారు? 1) విద్య, స్వాభిమానం, శీలం 2) గాంధీజీ, కబీర్, భగవద్గీత 3) భగవాన్ బుద్ధ, భక్త కబీర్, జ్యోతిబాపులే 4) శీలం, ఆత్మాభిమానం, భగవంతుడిపై విశ్వాసం 47. చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస అనే విమర్శ వ్యాఖ్యాన గ్రంథం రాసినవారు? 1) తాపీ ధర్మారావు 2) పుట్టపర్తి నారాయణాచార్యులు 3) విశ్వనాథ సత్యనారాయణ 4) జి.వి. సుబ్రహ్మణ్యం 48. గోరాశాస్త్రి ఆయా పత్రికల్లో ఏ పేరుతో శీర్షికను నిర్వహించారు? 1) కౌండిన్య 2) ఆనందవీణ 3) మాణిక్యవీణ 4) వినాయకుడి వీణ 49. చాసో బొండుమల్లెలు కథానికతో పాటు ఇతర రచనల్లో ఏ ప్రాంతం మాండలికాన్ని ప్రయోగించారు? 1) తెలంగాణ 2) విశాఖ 3) గోదావరి 4) రాయలసీమ 50. స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యల ను ప్రధాన ఇతివృత్తంగా అనేక నవలలు రాసినవారు? 1) కందుకూరి వీరేశలింగం 2) చిలకమర్తి లక్ష్మీనరసింహం 3) గుడిపాటి వెంకటాచలం 4) కొడవటిగంటి కుటుంబరావు సమాధానాలు 1) 3 2) 4 3) 4 4) 2 5) 3 6) 2 7) 1 8) 3 9) 2 10) 2 11) 3 12) 3 13) 1 14) 1 15) 3 16) 1 17) 3 18) 1 19) 4 20) 2 21) 2 22) 1 23) 2 24) 1 25) 4 26) 3 27) 2 28) 4 29) 3 30) 1 31) 3 32) 2 33) 3 34) 4 35) 3 36) 3 37) 1 38) 3 39) 1 40) 2 41) 3 42) 4 43) 2 44) 1 45) 2 46) 3 47) 1 48) 4 49) 2 50) 3 -
మహనీయం: వీళ్లూ ఫేస్బుక్లో ఉన్నారు...!
తెలుగు సాహితీ ప్రముఖుల పేరు మీద కూడా ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ, దేవకొండ బాలగంగాధర తిలక్, ఆరుద్రల దగ్గర నుంచి వేటూరి వరకూ అనేక మంది దివంగత రచయితలు, భావుకుల పేరుతో ఫేస్బుక్ పేజ్లున్నాయి. వీటిల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. పుస్తకాల్లో ఉండిపోయిన ఆయా రచయితల భావనలను ఈ ఫేస్బుక్ పేజెస్ ద్వారా డిజిటలైజ్ చేస్తున్నారు అభిమానులు. పూల సౌరభం గాలి వీస్తున్నవైపే వ్యాపిస్తుంది. మహనీయుల గొప్పతనపు పరిమళాలు అన్ని దిక్కులా విస్తరిస్తాయి. తరాలు మారిన వాటి సువాసన తగ్గదు. అందుకు నిదర్శనం కొన్ని ఫేస్బుక్ పేజీలు! శాస్త్రం, వ్యక్తిత్వం, వేదాంతం, రాజకీయం, పోరాటం ఈ రంగాల్లోని ఎంతో మంది మహనీయులు ఈ తరం వాళ్లు కాదు. అయితే వారి మాటల్లోని స్ఫూర్తి ఒక నిరంతర ధార. అది ఇప్పుడు సోషల్నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో కూడా కొనసాగుతోంది. దివంగతులు అయిన అనేక మంది ప్రముఖుల పేరుతో ఫేస్బుక్ పేజ్లున్నాయి. వారి తత్వాన్ని బోధిస్తూ స్ఫూర్తిని పంచుతున్నాయి. వినోద ప్రపంచంలో విహారానికి అవకాశం ఇస్తున్న ఫేస్బుక్లో తరచి చూస్తే జ్ఞానం, విజ్ఞానాలను బోధించే పేజ్లెన్నో ఉన్నాయి. వాటిని లైక్ చేస్తే చాలు ఎన్నో ఆసక్తికరమైన పోస్టులు పలకరిస్తాయి. వాటి నిర్వహణ, వాటికి లభిస్తున్న ఆదరణ ఒక ఆసక్తికరమైన సామాజిక పరిణామం. సోక్రటీస్, అర్టిస్టాటిల్, మార్క్‌ట్వెయిన్, షేక్స్పియర్, టాల్‌స్టాయ్, శ్రీశ్రీ, తిలక్, ఆస్కార్ వైల్డ్ వంటి మహనీయులు మరణించి ఏ లోకంలో ఉన్నారో కానీ... వారి పేరు మీదున్న ఫేస్బుక్ పేజ్‌లు మాత్రం వారి వారి తత్వాలను తట్టి చెబుతున్నాయి. హ్యూమరిజాన్నీ, హ్యూమనిజాన్నీ పంచుతున్నాయి. మహనీయుల గురించి తలుచుకోవడం అంటే వాళ్ల జయంతి రోజున, వర్ధంతి రోజున మాట్లాడుకోవడం అనే ఒక మొక్కుబడి సంప్రదాయానికి విరామం ఇస్తున్నాయి ఈ పేజ్‌లు. వారి గురించి అనునిత్యం చెబుతూ, వారిని గుర్తు చేస్తున్నాయి. వారి మాటలు, వారి తత్వం మన నిత్య జీవితంలో పాటించదగినదన్న విషయాన్ని తట్టిచెబుతున్నాయి. అనునిత్యం అప్డేట్స్ ఉంటాయి! ఆయా ప్రముఖుల జీవితాల్లో జరిగిన ప్రముఖమైన సంఘటనల గురించి, వారు వివిధ సందర్భాల్లో చెప్పిన సూక్తులు, వారు గ్రంథస్తం చేసిన మాటలు, వారి వ్యక్తిగత పద్ధతులు, కష్టం వచ్చినప్పుడు వారు వ్యవహరించిన తీరు.. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ గొప్ప వాళ్ల జీవితం నుంచి, వారి తత్వం గురించి తెసుకోదగిన విషయాల గురించి ఇంగ్లిష్‌లో అప్డేట్స్ ఉంటాయి. ఎవరు నిర్వహిస్తారు? ప్రముఖులపై ఉన్న అభిమానమే ఇలాంటి పేజ్‌లకు ఊపిరిపోస్తోంది. ఆయా వ్యక్తుల అభిమానులు వీటిని నిర్వహిస్తున్నారు. వారి తత్వం గురించి వివరిస్తూ ఈ తరాన్ని ఎడ్యుకేట్ చేస్తూ గత స్ఫూర్తి చెరిగిపోకుండా చూస్తున్నారు. కొన్ని పేజ్‌లకు అనేక మంది అడ్మిన్స్ ఉంటారు. ఆదరణ ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. ఈ పేజ్‌లకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. పోస్టులకు లైక్ కొడుతూ, వాటిని షేర్ చేసుకొంటూ వారిపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకొంటున్నారు. పోరాటం, శాంతి సహనంల గురించి నెల్సన్మండేలా కోట్స్‌ను అందించే పేజ్‌కు దాదాపు 50 లక్షలమంది అభిమానులున్నారు.విలియం షేక్స్పియర్ పేరు మీదున్న పేజ్‌కు 13 లక్షలమంది అభిమానులున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేరు మీదున్న పేజ్‌కు పది లక్షల మంది ఫాలోయర్లున్నారు. -
యువతా మేలుకో.. నిన్ను నువ్వే ఏలుకో!
యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే.. అన్న మహాకవి శ్రీశ్రీ వాక్కును నిజం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జనాభాలోనూ.. ఓటర్లలోనూ యువజనుల వాటా గణనీయంగా ఉన్నా.. నిర్ణయాత్మక శక్తి వారికున్నా.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో వారు కూరలో కరివేపాకుల్లా మిగిలిపోతున్నారు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాలను ఏలిన పార్టీలు, ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు యువజనులను వాడుకొని వదిలేస్తున్నాయి తప్ప యువత ఆవేశాన్ని.. వివేచనను.. సృజనాత్మకతను రాష్ట్ర, దేశాభివృద్ధికి వినియోగించుకోవడం లేదు. ఎన్నికల్లో అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని హామీలు ఇచ్చే పార్టీలు.. ఆనక విస్మరిస్తున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలతో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. దివంగత వైఎస్ హయాంలో తప్ప అంతకుముందు.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు యువత అవసరాలను పూర్తిగా విస్మరించాయి. ఈ పరిస్థితి మారాలి.. ఈ తరం మాదని యువత ఎలుగెత్తి చాటాలి.. కీలకమైన ఎన్నికల యుద్ధంలో నవరాష్ట్ర నిర్మాణానికి ఉపకరించే యువ నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక భాగస్వాములై తమదైన ముద్ర వేయాలి. శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఈ తరం యువతదే.. ఏ రంగంలోనైనా వారిదే ఆధిపత్యం అని ఆకాశానికెత్తేసే నాయకులు.. వాస్తవానికి యువతరానికి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడంలేదు. భావి నిర్ణేతలుగా ఎదగాల్సిన యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా రాజకీయ నిర్ణయాధికారాల్లోనూ.. సమాజ నిర్మాణంలోనూ వారికి తగిన భాగస్వామ్యం కల్పించడంలో పాలక పక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. గణనీయ సంఖ్యలో ఉన్న యువ ఓట్లను కొల్లగొట్టడమే తప్ప.. వారి కలలను సాకారం చేసేందుకు పెద్దగా ప్రయత్నించింది లేదు. 2004కు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వాలు గానీ.. 2009 తర్వాత ఇప్పటివరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గానీ యువతకు అవకాశాలు కల్పించకుండా వారి ఆశలను కూల్చేశాయి. 2004కు ముందు లక్షల రూపాయల ఫీజులు కట్టి ఉన్నత చదువులు లేక.. ఉద్యోగ నియామకాలు లేక.. విద్యుత్ సంక్షోభం కారణంగా ఉపాధి అవకాశాలు కానరాక యువశక్తి దాదాపు నిర్వీర్యమైంది. రాజన్నతో ఎగసిన యువ తరంగం 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టడంతో యువత తలరాత మారింది. స్కాలర్షిప్ మొత్తాల పెంపు, ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటి విఫ్లవాత్మక నిర్ణయాలతో పేద యువత కూడా ఉన్నత చదువులకు నోచుకున్నారు. ఇక పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ మేళాలు, వరుస నియామక నోటిఫికేషన్లతో వేలు, లక్షల కొలువులు నిరుద్యోగుల తలుపు తట్టడంతో యువజనులు ఉద్యోగ భద్రత పొంది.. జీవితాల్లో స్థిరపడగలిగారు. రాజకీయంగానూ ఎంతో మంది యువనేతలకు దివంగత నేత తన పాలనలో కీలక భాగస్వామ్యం కల్పించారు. శిష్టకరణ, పొందర వంటి ఆర్థికంగా వెనుకబడిన కులాలను బీసీల్లో చేర్చడం ద్వారా ఆయా వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. కానీ ఆయన అకాల మరణం యువజన వికాసాన్ని మళ్లీ మసకబారింది. వైఎస్ అనంతర పాలకవర్గాలు యువకిరణాలు అంటూ ప్రగల్భాలు పలికినా వాస్తవానికి యువతకు చేసిందేమీ కనిపించలేదు. చివరికి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లింపులనే ఏళ్ల తరబడి పెండింగుల్లో పెట్టేసి.. వారి విద్యావకాశాలకు గండికొట్టారు. కొత్త శకం ప్రారంభిద్దామా.. పార్టీలు, ప్రభుత్వాల సంకుచిత నిర్ణయాలతో ఎన్నాళ్లీ అగచాట్లు.. జనాభాలో గణనీయ సంఖ్య యువతదే. ఓటర్లలోనూ వారిదే నిర్ణయాత్మక సంఖ్య. ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదులో జిల్లాలో 18-29 మధ్య వయస్సున్న 5 లక్షల మంది(సుమారు 27 శాతం)కి పైగా యువజనులు ఓటర్లుగా నమోదయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరు రాజకీయాధికారంలోనూ ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నారు. స్వార్థ రాజకీయ నేతల నీడ నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు. రాష్ట్రం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. మెజారిటీ ప్రజల మనోగతానికి భిన్నంగా బలవంతపు విభజనకు గురయ్యారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా పునర్నిర్మించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మౌలిక, విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలతోపాటు కొత్త రాజధాని నిర్మాణం వంటి బృహత్తర బాధ్యత మనముందు ఉంది. ఇదే తరుణంలో రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి. సరైన దిశా నిర్దేశం చేసి.. చురుకైన నిర్ణయాలు, నిండైన ఆత్మవిశ్వాసంతో నవ రాష్ట్రాన్ని నిర్మించగల సత్తా ఉన్న యువ నాయకత్వం ఎంతో అవసరమన్న విషయాన్ని యువతరం గుర్తించాలి. తమకు లభించిన ఓటు ఆయుధంతో.. వివేచనా శక్తితో.. అటువంటి నాయకత్వాన్ని గెలిపించుకొని రాష్ట్రంలో కొత్త శకాన్ని ఆవిష్కరించాలి. అందుకోసం.. యువజనులారా.. కదలిరండి.. నెత్తురు మండే, శక్తులు నిండే.. సైనికుల్లా ముందుకు దూకండి.. ఎన్నికల రణక్షేత్రంలో..స్వార్థ రాజకీయులను తరిమికొట్టండి.. మీదైన యువ ప్రభుత్వానికి పట్టం కట్టండి..