యువతా మేలుకో.. నిన్ను నువ్వే ఏలుకో!
యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే..
అన్న మహాకవి శ్రీశ్రీ వాక్కును నిజం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జనాభాలోనూ.. ఓటర్లలోనూ యువజనుల వాటా గణనీయంగా ఉన్నా.. నిర్ణయాత్మక శక్తి వారికున్నా.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో వారు కూరలో కరివేపాకుల్లా మిగిలిపోతున్నారు.
ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాలను ఏలిన పార్టీలు, ప్రభుత్వాలు రాజకీయ అవసరాలకు యువజనులను వాడుకొని వదిలేస్తున్నాయి తప్ప యువత ఆవేశాన్ని.. వివేచనను.. సృజనాత్మకతను రాష్ట్ర, దేశాభివృద్ధికి వినియోగించుకోవడం లేదు. ఎన్నికల్లో అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని హామీలు ఇచ్చే పార్టీలు.. ఆనక విస్మరిస్తున్నాయి. స్వార్థపూరిత రాజకీయాలతో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. దివంగత వైఎస్ హయాంలో తప్ప అంతకుముందు.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు యువత అవసరాలను పూర్తిగా విస్మరించాయి.
ఈ పరిస్థితి మారాలి.. ఈ తరం మాదని యువత ఎలుగెత్తి చాటాలి.. కీలకమైన ఎన్నికల యుద్ధంలో నవరాష్ట్ర నిర్మాణానికి ఉపకరించే యువ నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక భాగస్వాములై తమదైన ముద్ర వేయాలి.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఈ తరం యువతదే.. ఏ రంగంలోనైనా వారిదే ఆధిపత్యం అని ఆకాశానికెత్తేసే నాయకులు.. వాస్తవానికి యువతరానికి ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడంలేదు. భావి నిర్ణేతలుగా ఎదగాల్సిన యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకపోగా రాజకీయ నిర్ణయాధికారాల్లోనూ.. సమాజ నిర్మాణంలోనూ వారికి తగిన భాగస్వామ్యం కల్పించడంలో పాలక పక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి.
గణనీయ సంఖ్యలో ఉన్న యువ ఓట్లను కొల్లగొట్టడమే తప్ప.. వారి కలలను సాకారం చేసేందుకు పెద్దగా ప్రయత్నించింది లేదు. 2004కు ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వాలు గానీ.. 2009 తర్వాత ఇప్పటివరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గానీ యువతకు అవకాశాలు కల్పించకుండా వారి ఆశలను కూల్చేశాయి. 2004కు ముందు లక్షల రూపాయల ఫీజులు కట్టి ఉన్నత చదువులు లేక.. ఉద్యోగ నియామకాలు లేక.. విద్యుత్ సంక్షోభం కారణంగా ఉపాధి అవకాశాలు కానరాక యువశక్తి దాదాపు నిర్వీర్యమైంది.
రాజన్నతో ఎగసిన యువ తరంగం
2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టడంతో యువత తలరాత మారింది. స్కాలర్‌షిప్ మొత్తాల పెంపు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వంటి విఫ్లవాత్మక నిర్ణయాలతో పేద యువత కూడా ఉన్నత చదువులకు నోచుకున్నారు. ఇక పారిశ్రామిక విధానాలు, ఉద్యోగ మేళాలు, వరుస నియామక నోటిఫికేషన్లతో వేలు, లక్షల కొలువులు నిరుద్యోగుల తలుపు తట్టడంతో యువజనులు ఉద్యోగ భద్రత పొంది.. జీవితాల్లో స్థిరపడగలిగారు. రాజకీయంగానూ ఎంతో మంది యువనేతలకు దివంగత నేత తన పాలనలో కీలక భాగస్వామ్యం కల్పించారు.
శిష్టకరణ, పొందర వంటి ఆర్థికంగా వెనుకబడిన కులాలను బీసీల్లో చేర్చడం ద్వారా ఆయా వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. కానీ ఆయన అకాల మరణం యువజన వికాసాన్ని మళ్లీ మసకబారింది. వైఎస్ అనంతర పాలకవర్గాలు యువకిరణాలు అంటూ ప్రగల్భాలు పలికినా వాస్తవానికి యువతకు చేసిందేమీ కనిపించలేదు. చివరికి విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లింపులనే ఏళ్ల తరబడి పెండింగుల్లో పెట్టేసి.. వారి విద్యావకాశాలకు గండికొట్టారు.
కొత్త శకం ప్రారంభిద్దామా..
పార్టీలు, ప్రభుత్వాల సంకుచిత నిర్ణయాలతో ఎన్నాళ్లీ అగచాట్లు.. జనాభాలో గణనీయ సంఖ్య యువతదే. ఓటర్లలోనూ వారిదే నిర్ణయాత్మక సంఖ్య. ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదులో జిల్లాలో 18-29 మధ్య వయస్సున్న 5 లక్షల మంది(సుమారు 27 శాతం)కి పైగా యువజనులు ఓటర్లుగా నమోదయ్యారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరు రాజకీయాధికారంలోనూ ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నారు. స్వార్థ రాజకీయ నేతల నీడ నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు. రాష్ట్రం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. మెజారిటీ ప్రజల మనోగతానికి భిన్నంగా బలవంతపు విభజనకు గురయ్యారు.
అవశేష ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా పునర్నిర్మించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. మౌలిక, విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలతోపాటు కొత్త రాజధాని నిర్మాణం వంటి బృహత్తర బాధ్యత మనముందు ఉంది. ఇదే తరుణంలో రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయి. సరైన దిశా నిర్దేశం చేసి.. చురుకైన నిర్ణయాలు, నిండైన ఆత్మవిశ్వాసంతో నవ రాష్ట్రాన్ని నిర్మించగల సత్తా ఉన్న యువ నాయకత్వం ఎంతో అవసరమన్న విషయాన్ని యువతరం గుర్తించాలి. తమకు లభించిన ఓటు ఆయుధంతో.. వివేచనా శక్తితో.. అటువంటి నాయకత్వాన్ని గెలిపించుకొని రాష్ట్రంలో కొత్త శకాన్ని ఆవిష్కరించాలి.
అందుకోసం.. యువజనులారా.. కదలిరండి..
నెత్తురు మండే, శక్తులు నిండే.. సైనికుల్లా ముందుకు దూకండి..
ఎన్నికల రణక్షేత్రంలో..స్వార్థ రాజకీయులను తరిమికొట్టండి..
మీదైన యువ ప్రభుత్వానికి పట్టం కట్టండి..