బాలచందర్ శ్రీశ్రీ
స్మరణ
ఢిల్లీలో ముగ్గురు నిరుద్యోగులు. ‘ఏంటి... స్మోకింగ్ చేయవా... ఇక్కడ చాలాసార్లు దాంతోనే కడుపు నింపుకుంటాం తెలుసా’ అంటాడు కమలహాసన్ సినిమా ప్రారంభంలో. ఆకలి రాజ్యం రోజులు అవి. నిరుద్యోగ రోజులు. ‘మీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అని చెప్పే రోజులు. ఏ రాజధాని చేరినా నో వేకెన్సీ బోర్డులే. కాని ఆకలి ఊరుకోదు కదా. టైమ్‌కు అలారం మోగినట్టుగా పేగుల్ని మెలిపెడుతుంది. కడుపును రగిలిస్తుంది. మొదటి రీలులోనే ఎవడో ‘రేయ్ ఆకలిగా ఉందిరా’ అంటాడు. దానికి కమలహాసన్ ఊపిరి బిగపట్టి కవిత అందుకుంటాడు. శ్రీశ్రీ కవిత.
పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా
దగాపడిన తమ్ములారా
ఏడవకండేడవకండి
జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ యొస్తున్నాయ్...
సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కూపస్థ మండూకంలా ఉండదలుచుకోలేదా యువకుడు. అభ్యుదయం కావాలి. వెలుతురు కావాలి. క్షవరం చేయించుకుని వచ్చిన అతడిని ‘దూరం నిలబడు. మైల’ అంటాడు తండ్రి. మైలా? దీనికి జవాబు? శ్రీశ్రీ కవితే.
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు
నా వినిపించే నవీన గీతికి
భావం భాగ్యం ప్రాణం ప్రణవం....
పోస్టల్ ఆర్డర్‌కు తండ్రి డబ్బు ఇవ్వకపోతే ఆయన తంబూరా అమ్మేస్తాడా యువకుడు. మిగిలిన చిల్లరతో ద్రాక్షపళ్లు కొని చేతిలో పెడతాడు. ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఇంతకన్నా ఏం కారణం కావాలి. ఫో.. బయటకి ఫో. అతడు అప్పటికే ఢిల్లీకి టికెట్ కొనుక్కుని ఉన్నాడు. సూట్‌కేస్ అందుకుని ఇంటి నుంచి బయటకు నడుస్తుంటే తండ్రి హేళనగా రెట్టిస్తాడు... ‘ఏం... ఇప్పుడు గుర్తుకు రావడం లేదా శ్రీశ్రీ కవిత్వం?’ ఎందుకు లేదు? సిద్ధంగా ఉంది.
పోనీ పోనీ పోతే పోనీ
సతుల్ సుతుల్ హితుల్ పోనీ
రానీ రానీ వస్తే రానీ
కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ.....
దేశంలోని నిరుద్యోగ సమస్య చూసి విసుగెత్తిన బాలచందర్ 1980లో ‘ఒరుమయిన్ నిరం సివప్పు’ పేరుతో తమిళంలో సినిమా తీశాడు. తెలుగులో ఆ మరుసటి సంవత్సరమే ‘ఆకలి రాజ్యం’ పేరుతో. తమిళంలో ఆయన తన కథానాయకుడి ఆగ్రహానికి ఆలంబనగా సుబ్రమణ్య భారతి కవిత్వాన్ని సందర్భానుసారంగా వాడాడు. తెలుగులో అందుకు ప్రత్యామ్నాయం శ్రీశ్రీ కాకుండా వేరెవరు ఉంటారు? సాహిత్యాన్ని, కవిత్వాన్ని పలవరించే నాయకుడు, శ్రీశ్రీని గౌరవించే నాయకుడు మన వెండితెర మీద ఉండొచ్చని, ఉండాలని ఒక తమిళుడు చూపించాడు. విషాదం. గొప్ప సాహిత్యాన్ని తూకానికి అమ్ముకునే దౌర్భాగ్యానికి ఏడ్చే నాయకుణ్ణి కూడా. శ్రీశ్రీ ఇంతగా వినిపించిన సినిమాను శ్రీశ్రీ చూశారా? ఆ ప్రశ్నే అడిగితే- విన్నాను. ఇంకా చూడలేదు అని జవాబు చెప్పారు శ్రీశ్రీ ఏదో ఇంటర్వ్యూలో.
ఓ మహాత్మా.... ఓ మహర్షీ...