జిల్లా సాహితీ దిగ్గజాన్ని కోల్పోయింది. కమ్యూనిస్టు భావాలను అణువణువునా నింపుకొని శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రచనలు మరుగున పడకుండా వాటిని వెలుగులోకి తెచ్చిన సాహితీవేత్త, ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) మరణించారనే విషయం తెలుసుకున్న భట్లపెనుమర్రు వాసులు కన్నీటి పర్యంత మయ్యారు. మొవ్వ మండలంలో భట్లపెనుమర్రుకు చెందిన బసవయ్య, వెంకట నరసమ్మలకు 1932 డిసెంబరు 8వ తేదీన ప్రసాద్ జన్మించారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాన్ని అతి దగ్గర నుంచి చూసిన ఆయన కమ్యూనిజం వైపే పయనించారని గ్రామస్తులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం లో అన్న, బావ, పినతండ్రిని చలసాని కోల్పోయారని చెబుతున్నారు. హైస్కూల్ వరకు భట్లపెనుమర్రులోనే ఆయన చదువుకున్నారని పేర్కొంటున్నారు. విరసం స్థాపనలో చురుకైన పాత్ర... 1970 జూలై 4వ తేదీన విప్లవ రచయితల సంఘం స్థాపనలో ఆయన చురుకైన పాత్ర పోషించారని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. 1964లో సీపీఎంలో పనిచేశారని, 1969లో సీపీఐ (ఎంఎల్)లో ఆయన పనిచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. 1986-88 మధ్య విరసం ప్రధాన కార్యదర్శిగా, 1998-2000 మధ్య విరసం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తరచూ గ్రామానికి వచ్చే ఆయన చిన్న పిల్లల మనస్తత్వంతోనే మాట్లాడే వారని, సమాజానికి, సాహితీలోకానికి తనవంతుగా ఏదో చేయాలని తపన పడేవారని గ్రామపెద్దలు చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలను 20 సంపుటాలలో ముద్రించడానికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొంటున్నారు. భట్లపెనుమర్రులో పుట్టి సాహితీ లోకానికి ఎనలేని సేవలు అందించిన చలసాని ప్రసాద్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు మననం చేసుకుంటున్నారు. త్రిపురనేని గోపీచంద్ రచనలను పది సంపుటాలుగా వెలువడిన ముద్రణలకు తుమ్మల కృష్ణాబాయితో కలిసి సంపాదకత్వం వహించారని చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలు, విరసం తనకు రెండు కళ్లు అని తరచూ తమతో అనేవారని గ్రామపెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశ్రీ సాహిత్యనిధికి అంకితం ఇచ్చారు ‘చిరంజీవి శ్రీశ్రీ’ అనే పుస్తకాన్ని చలసాని రచించారు. ఈ పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యనిధికి ఆయన అంకితం ఇచ్చారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలపడానికి చలసాని అనుక్షణం తపించేవారు. కొడవటిగంటి కుటుంబరావు రచనలను ఆరు సంపుటాలుగా ముద్రించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. జిల్లాలో జన్మించి విరసం స్థాపనలో కీలకభూమిక పోషించిన చలసాని సాహితీ లోకానికి చేసిన సేవలకు వెలకట్టలేం. - సింగంపల్లి అశోక్‌కుమార్, ప్రముఖ రచయిత
Published Sun, Jul 26 2015 10:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
Advertisement