Communist ideas
-
ట్రంప్ సోషలిస్టు వ్యతిరేకత మూలం..!
‘‘యూరోప్‌ను ఒక భూతం వెంటాడుతోంది... అది కమ్యూనిజం అనే భూతం’’ అని 1847–48లో తాము రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు అన్నారు. కాని నేడు ఆ భూతం అట్లాంటిక్‌ను దాటి అమెరికాను కూడా వెంటాడుతున్నట్లు కనపడుతోంది. దీనికి తార్కాణమే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రతిపక్షం డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు కాంగ్రెస్ సభ్యురాళ్ళపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు. ఈ నలుగురు చేసిన తప్పల్లా వారు, అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన వారిని నిర్బంధించే రిటెన్షన్ సెంటర్లలోని పరిస్థితులపై కాంగ్రెస్ కమిటీ ముందు మాట్లాడుతూ వాటిలోని నిర్బంధితుల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని చెప్పడమే! దీనికి గాను, ట్రంప్ వారిని టార్గెట్ చేసుకొని, ‘‘ఇక్కడ మీరు సంతోషంగా లేకపోతే, మీరు స్వదేశాలకు ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి’’ అంటూ ట్వీట్ చేసారు. ఈ నలుగురు డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ ప్రతినిధులూ, అమెరికా పౌరసత్వం ఉన్న వారే. కాగా వారి మూలాలు మాత్రం ఆఫ్రికా, అరబ్, దక్షిణ అమెరికా దేశాలలో ఉన్నాయి. వలసలతోనే నిర్మితమైన దేశం అయిన అమెరికాలో శ్వేత జాత్యేతర పౌరులపై , అందునా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) సభ్యులపై కూడా ట్రంప్ దాష్టీకం ఇది. ఇదంతా చాలదన్నట్లు ఆయన వారిని గురించి ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘... అతివాద వామపక్షవాదులకు ఇంకో పనిలేదు. మీరు ఈ దేశాన్ని ద్వేషిస్తే... ఇక్కడ సంతోషంగా లేకపోతే... ఇప్పుడే... ఈ క్షణమే మీ దేశాలకు వెళ్ళిపోవచ్చు ... ’’ అదీ విషయం. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అనేకమార్లు తనను విమర్శించే వారిపై ట్రంప్ వాడుతోన్న అస్త్రం వారు కమ్యూనిస్టులని నిందించడం. అమెరికాకు కమ్యూనిజం ‘ప్రమాదం’ ఉందంటూ హెచ్చరికలు జారీచేయడం ! గతంలో, అమెరికా అధ్యక్షుడిగా ఉండగానే, మెజారిటీ సామాన్య ప్రజలకు అనుకూలమైన ఆరోగ్య బిల్లు ‘ఒబామా కేర్’ను తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు నాటి మితవాద ప్రతిపక్షాలు ఒబామాను కూడా కమ్యూనిస్టు అనేదాకా పోయాయి. ఆ బిల్లును సమర్ధించిన కాంగ్రెస్ సభ్యులకు సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటూ బెదిరింపులూ, శాపనార్ధాలూ వచ్చాయి. కాగా, గత చరిత్రలో 1950లో నాటి మెకార్ధియిజమ్తో మొదలుకొని నేటి వరకూ అమెరికాలోని నాయకులూ, మీడియా కమ్యూనిజానికి వ్యతిరేకంగా తమ దేశ ప్రజలలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థూలంగా, అమెరికా ప్రజలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచిపోషించడంలో వారు గతమంతా విజయవంతమయ్యారనేది నిస్సందేహం. కానీ, నేడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. 2008లోని ఆర్థిక సంక్షోభం అనంతర కాలం నుంచీ, అమెరికాలోని మితవాదులూ, మీడియాల ప్రచారం భారీగా బెడిసికొడుతోంది. ‘ఫ్యూ’ వంటి అమెరికాకే చెందిన సర్వే సంస్థల అధ్యయనాల ప్రకారమే అమెరికా ప్రజలలో సోషలిస్టు అనుకూల, కార్పొరేట్ వ్యతిరేక భావాలు వేగంగా పెరుగుతున్నాయి. అలాగే, పాలక రాజకీయ నేతలూ, పక్షాలు అందరినీ, అన్నింటినీ కూడా ప్రజలు నమ్మడం మానేశారు. అమెరికా యువతలోని 80% మేరన నాడు శాండర్స్ వెనుకనా, ఆయన సోషలిస్ట్ భావజాలం వెనుకనా సమీకృతం అయ్యారు. వాస్తవానికి, 2008లో మొదలై నేటికీ ప్రపంచంలోని సామాన్య ప్రజలను నిరుద్యోగం, పెరుగుతోన్న క్షుద్బాధ, ఎదుగుబొదుగులేని వేతనాలూ, అసమానతల వంటి సమస్యలు రోజురోజుకూ మరింతగా వేధిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో 2020లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌పై పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న అరడజనుకు పైగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులందరూ నేడు ఏదో ఒక రూపంలో సోషలిస్టు ఎజెండాను ప్రకటించి ఉన్నారు. కాబట్టి నేడు ప్రపంచం అంతటా మార్పును కోరుకునే వారినీ, సామాజిక ఆర్థిక సమానత్వం, సమన్యాయం కోరుకునే వారినీ, అణచివేతలను ప్రశ్నించేవారినీ వారెవరైనా, ఆఖరుకు పోప్ ఫ్రాన్సిస్‌ను కూడా మితవాదులూ, వారి మీడియా కమ్యూనిస్టులు అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ మాటలూ, పరిణామాలన్నీ, నేడు మరోమారు 1848లో కమ్యూనిస్టు సిద్ధాంతం యూరోప్‌లోని చిన్నమూలకు పరిమితమైన కాలంలోనే ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో మార్క్స్, ఎంగెల్స్లూ చెప్పిన ఈ మాటలను గుర్తు చేయకమానవు ‘... అధికారంలో ఉన్న పార్టీ చేత కమ్యూనిస్టులని తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అదే తిట్లను తనకంటే పురోగాములైన ఇతర ప్రతిపక్ష పార్టీల మీదా, ప్రగతి వ్యతిరేకులైన తన శత్రువుల మీదా విసరకుండా ఎక్కడైనా ఉందా?...’ అదీ కథ. రానున్న కాలం కథ! నేడు యూరోప్, అమెరికాతో సహా ప్రపంచం అంతటా సాగుతోన్న భారీ కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారం కథ. అనతికాలంలోనే ఈ ప్రచారం బెడిసికొట్టి... దీనికి పూర్తి విరుద్ధమైన ఫలితాలను అనివార్యంగా తెచ్చిపెట్టగలదు.. ఇది చరిత్ర తాలూకు గతి తర్కం... ! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
శ్రామిక జన కేతనం ‘మే డే’
ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత ఏనాడో అమెరికాలో జరిగింది. ‘‘కమ్యూనిస్టు భూతాన్ని’’ నిర్మూలించటానికి కంకణం కట్టుకున్న అమెరికాలోనే ప్ర పంచ కార్మిక విజయాలకు అంకురార్పణ జరగటమే ఆ వింత. పారిశ్రామిక విప్లవం ఆవిర్భావంతో పెట్టుబడిదారీ వర్గం–కార్మిక వర్గం అనే రెండు ప్రత్యర్ధి వర్గాలు ఏర్పడ్డాయి. కార్మికులను బానిసల్లా చూసేవారు. రోజుకు 16 నుంచి 20 గంటల దాకా పనిచేయాల్సిన దుస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. 10 గంటలే పని చేస్తామనే డిమాండ్‌తో ఆందోళనలు , సమ్మెలు చేయటం ప్రారంభమైంది. దీంతో అమెరికాలో 1827లో తొలిసారిగా 10 గంటల పనిదినాన్ని ఆమోదిస్తూ శాసనం చేశారు. 1884లో అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఎనిమిది గంటల పనిదినానికి తీర్మానించింది. ఈ డిమాండ్‌ను సాధించడానికి 1886 మే 1న ఉద్యమించాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన చికాగో నగర కార్మికులు మే 1న సమ్మె ప్రారంభించారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు కాల్పులు జరగ్గా ఆరుగురు కార్మికులు మరణించారు. కాల్పులకు నిరసనగా హే మార్కెట్లో జరిపిన సభపై మళ్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు కార్మికులు, ఏడుగురు పోలీసులు చనిపోయారు. ఈ ఘర్షణ సాకుగా చూపి ఒక తప్పుడు కేసు బనాయించి నలుగురు కార్మిక నాయకుల్ని 11–11.1887న ఉరితీశారు. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ దమనకాండ కొనసాగింది. 1890లో మొదటి మేడే జరిగింది. ఇన్ని బలిదానాలో సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు మరింత మెరుగు పడాల్సిన ఆధునిక యుగంలో ముఖ్యంగా మనదేశంలో ఇవి రోజు రోజుకూ మృగ్యమవుతున్నాయి. విద్యావంతులే అధికంగా పనిచేసే అనేక కార్పొరెట్ రంగాల్లో 10–12 గంటలు పని చేయిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉంది. సెజ్ లోనే కాక అనేక పరిశ్రమల్లో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. అసంఘటిత రంగంలో ఆధునిక బానిస వ్యవస్థ యధేచ్చగా కొనసాగుతోంది. బాలకార్మికుల్ని గూర్చి చెప్పుకోకపోవటమే ఉత్తమం. పని ప్రదేశాల్లో మహిళ పరిస్థితి మరీ దారుణం.చికాగోలో ఉరితీసిన కార్మిక వీరుడు స్విస్ ‘‘మమ్మల్ని ఉరితీయటం ద్వారా కార్మికుల్ని ఆపలేరు, మీరు రగిలించిన నిప్పురవ్వ జ్వాలలై లేస్తాయి. దాన్ని మీరు ఆపలేరు’’ అన్న మాటల్ని కార్మికులు నిజం చేయాలి. (నేడు మేడే సందర్భంగా) చెరుకూరి సత్యనారాయణ, న్యాయవాది, గుంటూరు మొబైల్ ః 98486 64587 -
రాలిన సాహితీ దిగ్గజం
-
రాలిన సాహితీ దిగ్గజం
సాహితీ శిఖరం కరిగిపోయింది. కమ్యూనిస్టు ఉద్యమ దీప్తి నింగికెగసింది. తన రచనలతో సమాజ మేల్కొలుపునకు అనుక్షణం పరితపించిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు కనుమరుగయ్యాడు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) శనివారం విశాఖపట్నంలో కాలం చేశారు. దీంతో ఆయన స్వస్థలం పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు కన్నీటిసంద్రమైంది. - చలసాని ప్రసాద్ మృతితో విషాదంలో భట్లపెనుమర్రు - చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు వాదే - విరసం స్థాపనలో కీలక పాత్ర మచిలీపట్నం/కూచిపూడి : జిల్లా సాహితీ దిగ్గజాన్ని కోల్పోయింది. కమ్యూనిస్టు భావాలను అణువణువునా నింపుకొని శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రచనలు మరుగున పడకుండా వాటిని వెలుగులోకి తెచ్చిన సాహితీవేత్త, ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు, సాహితీ విమర్శకుడు చలసాని శ్రీనివాస వరప్రసాద్ అలియాస్ ప్రసాద్ (83) మరణించారనే విషయం తెలుసుకున్న భట్లపెనుమర్రు వాసులు కన్నీటి పర్యంత మయ్యారు. మొవ్వ మండలంలో భట్లపెనుమర్రుకు చెందిన బసవయ్య, వెంకట నరసమ్మలకు 1932 డిసెంబరు 8వ తేదీన ప్రసాద్ జన్మించారు. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాన్ని అతి దగ్గర నుంచి చూసిన ఆయన కమ్యూనిజం వైపే పయనించారని గ్రామస్తులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం లో అన్న, బావ, పినతండ్రిని చలసాని కోల్పోయారని చెబుతున్నారు. హైస్కూల్ వరకు భట్లపెనుమర్రులోనే ఆయన చదువుకున్నారని పేర్కొంటున్నారు. విరసం స్థాపనలో చురుకైన పాత్ర... 1970 జూలై 4వ తేదీన విప్లవ రచయితల సంఘం స్థాపనలో ఆయన చురుకైన పాత్ర పోషించారని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. 1964లో సీపీఎంలో పనిచేశారని, 1969లో సీపీఐ (ఎంఎల్)లో ఆయన పనిచేశారని గ్రామస్తులు చెబుతున్నారు. 1986-88 మధ్య విరసం ప్రధాన కార్యదర్శిగా, 1998-2000 మధ్య విరసం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తరచూ గ్రామానికి వచ్చే ఆయన చిన్న పిల్లల మనస్తత్వంతోనే మాట్లాడే వారని, సమాజానికి, సాహితీలోకానికి తనవంతుగా ఏదో చేయాలని తపన పడేవారని గ్రామపెద్దలు చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలను 20 సంపుటాలలో ముద్రించడానికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొంటున్నారు. భట్లపెనుమర్రులో పుట్టి సాహితీ లోకానికి ఎనలేని సేవలు అందించిన చలసాని ప్రసాద్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు మననం చేసుకుంటున్నారు. త్రిపురనేని గోపీచంద్ రచనలను పది సంపుటాలుగా వెలువడిన ముద్రణలకు తుమ్మల కృష్ణాబాయితో కలిసి సంపాదకత్వం వహించారని చెబుతున్నారు. శ్రీశ్రీ రచనలు, విరసం తనకు రెండు కళ్లు అని తరచూ తమతో అనేవారని గ్రామపెద్దలు గుర్తు చేసుకుంటున్నారు. శ్రీశ్రీ సాహిత్యనిధికి అంకితం ఇచ్చారు ‘చిరంజీవి శ్రీశ్రీ’ అనే పుస్తకాన్ని చలసాని రచించారు. ఈ పుస్తకాన్ని శ్రీశ్రీ సాహిత్యనిధికి ఆయన అంకితం ఇచ్చారు. తన రచనల ద్వారా సమాజాన్ని మేలుకొలపడానికి చలసాని అనుక్షణం తపించేవారు. కొడవటిగంటి కుటుంబరావు రచనలను ఆరు సంపుటాలుగా ముద్రించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది. జిల్లాలో జన్మించి విరసం స్థాపనలో కీలకభూమిక పోషించిన చలసాని సాహితీ లోకానికి చేసిన సేవలకు వెలకట్టలేం. - సింగంపల్లి అశోక్‌కుమార్, ప్రముఖ రచయిత ప్రసాద్‌ను మరిచిపోలేం చలసాని ప్రసాద్ మా గ్రామం వాడే. ఏడాది క్రితం గ్రామానికి వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదువుకునే రోజుల్లో చెరువులో ఈదటం, చెట్లు ఎక్కటం వంటి సంఘటనలను మననం చేసుకున్నాం. ప్రసాద్ శ్రీశ్రీకి అనుంగు శిష్యుడిగా ఉండేవారు. శ్రీశ్రీ చివరి దశలో రచించిన సాహిత్యాన్ని సేకరించి ముద్రణకు నోచుకోవడానికి ప్రసాద్ ఎంతగానో కృషి చేశారు. చలసాని ప్రసాద్ అన్న, బావ, పినతండ్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కాల్పుల్లో మరణించారు. - డాక్టర్ గొట్టిపాటి శివరామకృష్ణప్రసాద్, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం పేదలకు సాయం చేయాలని తపించేవారు చలసాని ప్రసాద్ చిన్నతనం నుంచే ఉద్యమాలను అతి దగ్గర నుంచి చూశారు. పేద వారికి సాయం చేయాలనే తపన ఆయనలో ఉండేది. గ్రామానికి వచ్చిన ప్రతిసారీ మాతో పలు అంశాలపై చర్చించేవారు. కమ్యూనిస్టు భావజాలాన్ని నింపుకొన్న ఆయన చివరి వరకు కమ్యూనిస్టు గానే కొనసాగారు. మా గ్రామానికి చెందిన ప్రసాద్ విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించటంలో కీలక పాత్ర పోషించారని తెలుసుకున్న మేము ఎంతగానో గర్వపడే వాళ్లం. ప్రసాద్ తండ్రి బసవయ్యతో నాకు పరిచయం ఎక్కువ. - గొట్టిపాటి గోపాలకృష్ణయ్య, భట్లపెనుమర్రు, మొవ్వ మండలం సాహితీలోకానికి తీరని లోటు అందరం సాహితీవేత్తలమే అయినా ప్రసాద్ ముక్కుసూటిగా మాట్లాడేవారు. చలసాని ప్రసాద్ మరణం సాహితీ లోకానికి తీరనిలోటు. సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. - రావి రంగారావు, సాహితీవేత్త