‘‘యూరోప్‌ను ఒక భూతం వెంటాడుతోంది... అది కమ్యూనిజం అనే భూతం’’ అని 1847–48లో తాము రచించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు అన్నారు. కాని నేడు ఆ భూతం అట్లాంటిక్‌ను దాటి అమెరికాను కూడా వెంటాడుతున్నట్లు కనపడుతోంది. దీనికి తార్కాణమే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రతిపక్షం డెమొక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు కాంగ్రెస్ సభ్యురాళ్ళపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు.
ఈ నలుగురు చేసిన తప్పల్లా వారు, అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన వారిని నిర్బంధించే రిటెన్షన్ సెంటర్‌లలోని పరిస్థితులపై కాంగ్రెస్ కమిటీ ముందు మాట్లాడుతూ వాటిలోని నిర్బంధితుల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని చెప్పడమే! దీనికి గాను, ట్రంప్ వారిని టార్గెట్ చేసుకొని, ‘‘ఇక్కడ మీరు సంతోషంగా లేకపోతే, మీరు స్వదేశాలకు ఇప్పుడే, ఈ క్షణమే వెళ్ళిపోండి’’ అంటూ ట్వీట్ చేసారు. ఈ నలుగురు డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ ప్రతినిధులూ, అమెరికా పౌరసత్వం ఉన్న వారే. కాగా వారి మూలాలు మాత్రం ఆఫ్రికా, అరబ్, దక్షిణ అమెరికా దేశాలలో ఉన్నాయి. వలసలతోనే నిర్మితమైన దేశం అయిన అమెరికాలో శ్వేత జాత్యేతర పౌరులపై , అందునా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) సభ్యులపై కూడా ట్రంప్ దాష్టీకం ఇది.
ఇదంతా చాలదన్నట్లు ఆయన వారిని గురించి ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘... అతివాద వామపక్షవాదులకు ఇంకో పనిలేదు. మీరు ఈ దేశాన్ని ద్వేషిస్తే... ఇక్కడ సంతోషంగా లేకపోతే... ఇప్పుడే... ఈ క్షణమే మీ దేశాలకు వెళ్ళిపోవచ్చు ... ’’ అదీ విషయం. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అనేకమార్లు తనను విమర్శించే వారిపై ట్రంప్ వాడుతోన్న అస్త్రం వారు కమ్యూనిస్టులని నిందించడం. అమెరికాకు కమ్యూనిజం ‘ప్రమాదం’ ఉందంటూ హెచ్చరికలు జారీచేయడం ! గతంలో, అమెరికా అధ్యక్షుడిగా ఉండగానే, మెజారిటీ సామాన్య ప్రజలకు అనుకూలమైన ఆరోగ్య బిల్లు ‘ఒబామా కేర్’ను తెచ్చే ప్రయత్నం చేసినప్పుడు నాటి మితవాద ప్రతిపక్షాలు ఒబామాను కూడా కమ్యూనిస్టు అనేదాకా పోయాయి. ఆ బిల్లును సమర్ధించిన కాంగ్రెస్ సభ్యులకు సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటూ బెదిరింపులూ, శాపనార్ధాలూ వచ్చాయి.
కాగా, గత చరిత్రలో 1950లో నాటి మెకార్ధియిజమ్‌తో మొదలుకొని నేటి వరకూ అమెరికాలోని నాయకులూ, మీడియా కమ్యూనిజానికి వ్యతిరేకంగా తమ దేశ ప్రజలలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. స్థూలంగా, అమెరికా ప్రజలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెంచిపోషించడంలో వారు గతమంతా విజయవంతమయ్యారనేది నిస్సందేహం. కానీ, నేడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. 2008లోని ఆర్థిక సంక్షోభం అనంతర కాలం నుంచీ, అమెరికాలోని మితవాదులూ, మీడియాల ప్రచారం భారీగా బెడిసికొడుతోంది. ‘ఫ్యూ’ వంటి అమెరికాకే చెందిన సర్వే సంస్థల అధ్యయనాల ప్రకారమే అమెరికా ప్రజలలో సోషలిస్టు అనుకూల, కార్పొరేట్ వ్యతిరేక భావాలు వేగంగా పెరుగుతున్నాయి. అలాగే, పాలక రాజకీయ నేతలూ, పక్షాలు అందరినీ, అన్నింటినీ కూడా ప్రజలు నమ్మడం మానేశారు.
అమెరికా యువతలోని 80% మేరన నాడు శాండర్స్ వెనుకనా, ఆయన సోషలిస్ట్ భావజాలం వెనుకనా సమీకృతం అయ్యారు. వాస్తవానికి, 2008లో మొదలై నేటికీ ప్రపంచంలోని సామాన్య ప్రజలను నిరుద్యోగం, పెరుగుతోన్న క్షుద్బాధ, ఎదుగుబొదుగులేని వేతనాలూ, అసమానతల వంటి సమస్యలు రోజురోజుకూ మరింతగా వేధిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో 2020లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌పై పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న అరడజనుకు పైగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులందరూ నేడు ఏదో ఒక రూపంలో సోషలిస్టు ఎజెండాను ప్రకటించి ఉన్నారు.
కాబట్టి నేడు ప్రపంచం అంతటా మార్పును కోరుకునే వారినీ, సామాజిక ఆర్థిక సమానత్వం, సమన్యాయం కోరుకునే వారినీ, అణచివేతలను ప్రశ్నించేవారినీ వారెవరైనా, ఆఖరుకు పోప్ ఫ్రాన్సిస్‌ను కూడా మితవాదులూ, వారి మీడియా కమ్యూనిస్టులు అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ మాటలూ, పరిణామాలన్నీ, నేడు మరోమారు 1848లో కమ్యూనిస్టు సిద్ధాంతం యూరోప్‌లోని చిన్నమూలకు పరిమితమైన కాలంలోనే ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో మార్క్స్, ఎంగెల్స్‌లూ చెప్పిన ఈ మాటలను గుర్తు చేయకమానవు ‘... అధికారంలో ఉన్న పార్టీ చేత కమ్యూనిస్టులని తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అదే తిట్లను తనకంటే పురోగాములైన ఇతర ప్రతిపక్ష పార్టీల మీదా, ప్రగతి వ్యతిరేకులైన తన శత్రువుల మీదా విసరకుండా ఎక్కడైనా ఉందా?...’ అదీ కథ. రానున్న కాలం కథ! నేడు యూరోప్, అమెరికాతో సహా ప్రపంచం అంతటా సాగుతోన్న భారీ కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారం కథ. అనతికాలంలోనే ఈ ప్రచారం బెడిసికొట్టి... దీనికి పూర్తి విరుద్ధమైన ఫలితాలను అనివార్యంగా తెచ్చిపెట్టగలదు.. ఇది చరిత్ర తాలూకు గతి తర్కం... !
డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్ : 98661 79615
Comments
Please login to add a commentAdd a comment