1955 ఎన్నికల తదనంతరం ప్రగతిశీల సాహిత్య శిబిరంలో స్తబ్దత చోటుచేసుకున్న కాలాన ‘‘మహామహుడు, మహావ్యక్తి, మహాకవి- స్తబ్దతకే మారుపేరు, మరోపేరుగా మారిన ఆ రోజున తెలుగుజాతి శపిస్తుంది శఠిస్తుంది, శఠిస్తుంది శపిస్తుంది’’ అంటూ శ్రీశ్రీని ‘‘ఒక వ్యక్తిగా తలచలేదెప్పుడూ, సంస్థగా, వ్యవస్థగా, రెక్కవిప్పిన రెడ్‌రివల్యూషన్‌గా, జాతిని దిద్దిన మహోద్యమంగా పరిగణించాము’’ అంటూ 1963లోనే అనితరసాధ్యమైన ఒక ఆదేశాన్ని శ్రీశ్రీకి జారీచేసినవాడు సివి. ‘మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్యుని బహిరంగలేఖ’ అనే కవిత ముగింపుగా ‘‘తెలుగుజాతి పేరిట తిరిగి కలం పట్టమని శాసిస్తున్నాను’’ అనటం ఎంత సాహసం! ఎంతో ఆత్మవిశ్వాసం, సమరశీలతవైపే శ్రీశ్రీ వుంటాడు అన్న స్పష్టమైన అంచనా వుంటే తప్ప అలాంటి ఆదేశ స్వరాన్ని వినిపించటం సాధ్యంకాదు.
గత 60 ఏళ్ల సుదీర్ఘకాలంలో 45 ఏళ్లపాటు ఎత్తినకలం దించకుండా సివి 24 పుస్తకాలు రాశారు. నా దృష్టిలో ఉన్నంతవరకు రెండు, మూడు పత్రికలలో తప్ప ఇంకెందులో వారి పుస్తకాలపై సమీక్షలు రాలేదు. ఈ తరహా విస్మరణను బద్దలుగొట్టాలనే దృష్టితోనే ‘ప్రజాసాహితి’లో పనిగట్టుకుని సమీక్షలు చేయించాము. విశ్లేషణ వచ్చిన ప్రతిసారీ సివి ఇంకా జీవించివున్నారా? అని పాఠకులు అడిగేవారు. ‘ప్రజాసాహితి’లో సుమారు 125 మంది రచయితలతో ‘అమరావతి రాజధాని’ ప్రక్రియపై ఖండన ప్రకటన (జనవరి 2015) విడుదల చేసినపుడు, అందులో సంతకం చేసినవారిలో సివి కూడా వుండటం యాదృచ్ఛికం కాదు, ప్రయత్నపూర్వకమే!
- దివికుమార్
(సివి సాహిత్యంపై విజయవాడ, వేదిక కల్యాణమండపంలో సదస్సు జరుగుతున్న సందర్భంగా...)
పుస్తక పరిచయం
‘ఒక తరం స్వరం’
1970లలో ప్రగతిశీల, హేతువాద యువకుల ఆలోచనల్ని ప్రభావితం చేశారు సివి(చిత్తజల్లు వరహాలరావు).
సి.విజయలక్ష్మి, అరుణశ్రీ వంటి కలంపేర్లతోనూ రాసిన సివి మొత్తం 24 పుస్తకాల్ని వెలువరించారు. అవన్నీ మళ్లీ కొత్తగా ‘ప్రజాశక్తి’ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో బక్కపలుచటి ‘కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం’(పేజీలు: 32; వెల: 25) నుంచి ‘వచనకవితా మహాకావ్యం’గా పేర్కొన్న ‘పారిస్ కమ్యూన్’ (పేజీలు: 648; వెల: 400) వరకు ఉన్నాయి.
‘రాజ్యమూ, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి, ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్నీ, దాని స్వరూప స్వభావాల్నీ, దాని క్రమపరిణామాన్నీ’ ‘కౌటిల్యుని అర్థశాస్త్రం-పుట్టు పూర్వోత్తరాలు’(పేజీలు: 152; వెల: 80)లో వివరించారు.
‘పశుపాలకుల్లా, దేశదిమ్మరుల్లా, ఆటవికుల్లా, మనదేశంలోకి ప్రవేశించిన ఆర్యులు, మనకిచ్చింది బూడిద తప్ప మరేమీకాదంటే, దానిలో ఆవగింజంత అతిశయోక్తి సైతం లేదు. అంచేత, మన ప్రాచీన నాగరికతా సంస్కృతులకు బీజాలు వేసింది ద్రావిడులే’ అని ‘సింధు నాగరికత’(పేజీలు: 144; వెల: 80)లో తేల్చారు.
ఇంకా, ‘ప్రాచీన భారతంలో చార్వాకం’, ‘భారత జాతి పునరుజ్జీవనం’, ‘మధ్య యుగాల్లో కులవ్యవస్థ’, ‘నరబలి’(కావ్యం), ‘డార్విన్ పరిణామవాదం’, ‘సత్యకామ జాబాలి’(కావ్యం), ‘హేతువాద నాస్తికోద్యమం-రంగనాయకమ్మకి సమాధానం’ లాంటి పుస్తకాల్లో సివి ఆలోచనాధారను అర్థం చేసుకోవచ్చు. ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27-1-54, కారల్ మార్క్స్ రోడ్, గవర్నర్ పేట, విజయవాడ-2; ఫోన్: 0866-577533
- శేషసాయి
యువ పురస్కారం
కేంద్ర సాహిత్య అకాడమీ 23 భారతీయ భాషల్లో ప్రకటించిన ‘యువ పురస్కారం’, తెలుగుకుగానూ దళిత కథకుడు, కవి డాక్టర్ పసునూరి రవీందర్‌ను వరించింది. ఈ అవార్డు కింద 50 వేల నగదు, తామ్రపత్రం ఇస్తారు. ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ కథా సంకలనానికి ఈ గౌరవం దక్కింది. వృత్తిరీత్యా పాత్రికేయుడైన రవీందర్ స్వస్థలం వరంగల్.
స్మారక పురస్కారం
భారతనిధి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో విశాఖ రచయితల సంఘం, విశాఖ సంస్కృతి మాసపత్రిక జూలై 3న విశాఖ పౌరగ్రంథాలయంలో విశాఖ నగర చరిత్ర రాసిన అంగర సూర్యారావుకు ‘బలివాడ కాంతారావు స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నాయి.
సురవరం రచనల పరిచయం
‘ఛాయ’ ఆధ్వర్యంలో జూలై 5న(ఆదివారం) సాయంత్రం 5:30కి హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఆడిటోరియం(దోమల్‌గూడ)లో జరిగే కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి రచనల్ని అంబటి సురేంద్రరాజు పరిచయం చేయనున్నారు.
- పసునూరి రవీందర్
పంజాగుట్ట
కొన్ని మట్టితో కప్పినవీ
కొన్ని సిమెంటుతో కట్టినవీ
తేదీలూ తిథులూ
శిలాఫలకాలు
తల్లులూ తండ్రులూ సతుల్, సుతుల్
కొన్ని పైకప్పు కప్పినవీ
కొన్ని చలువరాళ్లు వేసినవీ
జాడలూ నీడలూ
పక్కపక్కనే గోరీలు
ప్రేయసీప్రియులూ భార్యాభర్తలూ
కొన్ని చిట్టిచిట్టివీ
కొన్ని ముద్దుముద్దువీ
వెలుతురు సోకని కలలు
నవ్వులు మెరవని బుగ్గలు
తెగిపోయిన పేగులు
----
యోధులు, పరాజితులు, విముక్తులు
మందభాగ్యులు-అల్పాయుష్కులు
ఇంకను కొన్ని-
అవాంఛిత గర్భాలు
పసికన్నులు-పసిడి వన్నెలు
---
నీళ్లులేక ఎండిపోయిన తులసిమొక్కలు
రావిచెట్లపై ఆశలు చావని గబ్బిలాలు
సంతకం చేయకుండా వదిలేసిన వీలునామాలు
పగలు సూర్యుడు-రాత్రి చంద్రుడు
కాటికాపరులు
---
నలుదిక్కులా ఆకాశహర్మ్యాలు
జరీ అంచు నియాన్ లైట్లు
రోడ్ నంబర్ మూడు
అది చూడు!
హోర్డింగుపై డస్కీ సెక్సీ సాలభంజిక
సమాధి రాళ్లకింద తీరనికోరిక
-లివింగ్, డెడ్ మరియూ అన్ డెడ్!
---
కొన్ని మట్టికొట్టుకుపోయినవీ
కొన్ని పిచ్చిమొక్కలు మొలిచినవీ
కుండపెంకులు
చిల్లరనాణాలు
శిథిల కంకాళాలు
చెదలు కీటకాలు
---
ఇక...
మధ్యలోనే వెళ్లిపోయిన
చిచ్చాలూ చేలాగాళ్లను తలచుకొని!
మరణించిన రాత్రిలో
మృతదేహం వెతుక్కొని
చీకటి ఆకాశంలోకి
స్మృతిగీతాన్ని విసిరేసి
---
నడచివచ్చిన కాలాన్ని
గమనించనే లేదు...
ఇది డెడ్ ఎండ్!
-ఇప్పుడైతే మరి...
బతికున్నట్టే కదా జీవించాలి!?
- అరుణ్‌సాగర్
తీయని కలలు మంచి రాత్రులు
ఆమె మెత్త కవర్ల మీద
రంగురంగుల దారాలతో
ఎంతో కాయిష్ పడి
అల్లికల పోతలు పోసింది
ఆమె ప్రమేయం లేకుండానే
బతుక్కు అంటు కట్టబెట్టబడింది
మంచం పైన
ఒక స్త్రీ ఒక పురుషుడు
ఆమె తలలో ఎన్ని కలలో ఎరుగము
అతని మెదడులో
ఎన్నెన్ని శుభరాత్రులో తెలువము
శరీరాలు ఒక్కటై
సరీసృపాలు వెంటది వెంట
మనసులు వేరైపోతున్నాయి
కలత కలలతో
కలవర రాత్రులతో
దేహాలు నకీలిగా
మసలుతున్నాయి
రాను రాను
తలల మీది పోతపోసిన
లిపి అసలు లోతు తెలిసిన
గుడ్‌నైట్, స్వీట్‌డ్రీమ్స్‌ల
అక్షరాలు అక్కెర పూర్తియై
వెకిలిగా వెలితిగా
మకిలిగా చెక్కుచెదరక
చెదిరి బెదిరి చూస్తున్నాయి
అంటు కట్టబడ్డాక
సొంటు ఉంటుంది కదా
ఇప్పుడు ఇరువురూ
కేవలం పాత్రధారులయ్యారు
- జూకంటి జగన్నాథం
గమనిక:
10, 12 లైన్లకు మించిన కవితల్ని పంపవద్దు. ప్రచురించడం వీలుపడదు.
కవులు గమనించగలరు.
- ఎడిటర్
శ్రీశ్రీని ‘శాసించినవాడు’
Published Sun, Jun 28 2015 3:51 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement