శ్రీశ్రీ సృష్టించిన హాస్యాస్పదమైన సంప్రదాయం | Tradational comdey created by Srisri | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ సృష్టించిన హాస్యాస్పదమైన సంప్రదాయం

Published Mon, Oct 3 2016 1:24 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Tradational comdey created by Srisri

 శ్రీశ్రీ వచనపదాలను కూడా కొన్నిటిని సృష్టించారు.
వాటిలో చిత్రించబడిన భావాలలో లయాబద్ధంచేసి నడిపించటానికి వీలులేనంత మహావేశమేమీ కనుపించదు.
‘వ్యత్యాసం’ అనే కావ్యంలో!
 ‘అదృష్టవంతులు మీరు
 వెలుగును ప్రేమిస్తారు;
 ఇరులను ద్వేషిస్తారు
 మంచికీ చెడుకీ నడుమ
 కంచుగోడ లున్నాయిమీకు’
 అన్నారు. ఈ భావాలకు ఛందోబద్ధం చెయ్యటానికి వంగని తీవ్రత యేముంది? లయాబద్ధం చేసి నడిపితేనే వీటికి ఇంకా బలం కలిగేది. ఇలాంటి బలహీనమైన వచన పదాలను కొన్నిటిని సృష్టించడంతో, శ్రీశ్రీ తన్ను అనుకరించే యువకులలో ఒక హాస్యాస్పదమైన సంప్రదాయాన్ని సృష్టించిన వారయినారు. అర్థం పర్థం లేని చొప్పదంట్లు లాంటి వచన పదాలు కుప్పతిప్పలుగా మేట్లు పడుతున్నయ్. ఆయా కొన్ని గేయాల్లో కత్తిరించి పారవేయవలసిన వ్యర్థమైన పదాలు అక్కడక్కడ కనుపించుతున్నయ్. ‘మహాప్రస్థానం’లో ‘హరోంహరా అని కదలండి’ అన్నచోట ఈ ‘అని కదలండి’ అన్నమాటలు అనవసరమైన కంపతొడుగు.
 (తెన్నేటి సూరి రచనలు- మూడవ సంపుటం నుంచి; ఈ పుస్తకాన్ని ఈమధ్యే ‘నవచేతన’ వెలువరించింది.)
 - తెన్నేటి సూరి
 
 ఒకానొక రోజు
 నీకు తెలియకుండానే
 నిన్నొక నీటిబుడగ అనుసరిస్తూ నడుస్తుంది
 
 పగలూ రాత్రుల తూకం మధ్య
 నీడగా రాలిపోయిన కాలం
 నీలిరంగుల ఆకై మొలకెత్తుతుంటే
 నిదురపట్టక చీకటితో సంభాషించే పక్షికి
 నువ్వు విసిరికొట్టిన ఆలోచనలు
 రొట్టెముక్కల్లా కనిపిస్తాయి
 
 నీటిబుడగ
 నీడలు
 తూకంలో తూగవు
 
 నువ్వు ఆకులా రంగువెలిసేప్పుడు
 నీటిబుడగ వేడెక్కుతుంది
 నువ్వొదిలొచ్చిన అక్షరాలు నీ నీడలా మిగిలిపోతే
 నువ్వూ నీటిబుడగ ఒకేసారి పగిలిపోతారు
 
 సిరా అయిపోయిన కలాన్ని
 కాలం తన సంచిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకుంటుంది.
 
 - మెర్సీ మార్గరెట్
 9052809952
 
 శిఖరం
 పుస్తక పరిచయం
 శిఖరం (కవితా సంకలనం); హిందీమూలం: అటల్ బిహారీ వాజ్‌పేయి; అనుసృజన: జలజం సత్యనారాయణ; పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: ధ్వని పబ్లికేషన్స్, 7-5-297, లక్ష్మీనగర్ కాలనీ, మహబూబ్‌నగర్. ఫోన్: 9849444944
 
 అటల్ బిహారీ వాజ్‌పేయిని బీజేపీ తొలిసారి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నప్పుడు, ఆయన స్టార్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ వార్తపై స్పందన కోరగా, భావోద్వేగంగా ఇలా పలికారు:
 ‘ఓ ప్రభూ!
 నన్ను అంత ఎత్తుగా ఎదగనీకు
 ఇతరుల నెవ్వరినీ గుండెలకు హత్తుకోలేనంతగా
 అంతటి హృదయ కాఠిన్యాన్ని ఎప్పుడూ నాకివ్వకు’!
 ఈ మాజీ ప్రధానికి అజాతశత్రువుగా పేరుంది. శిఖర సమానుడన్న ప్రశంస ఉంది. అలా ఆయన కవిత్వానువాద సంకలనానికి ‘శిఖరం’ అన్నపేరు ఎంచుకోవడం నప్పింది. ఆ పేరుతో ఇందులో ఒక కవిత ఉండటం గమనార్హం! పై వాక్యాలు ఆ కవితలోనివే!
 వాజ్‌పేయి సాహిత్య వాతావరణం ఉన్న ఇంట్లో పుట్టారు. ‘మేరీ ఎక్యావన్ కవితాయే’ వెలువరించారు. రాజకీయాల్లో తలమునకలైనప్పటికీ ఆయనలో ఉన్నది కవి హృదయమే. ఒకచోట ఇలా అంటారు:
 ‘నన్ను సంతలో/ ఒంటరిగా నిలబెట్టి/ మిత్రులు ఒక్కొక్కరే జారిపోయారు’.
 మరోచోట: ‘ఇప్పుడు/ కృష్ణుడు లేని/ మహాభారతం కావాలి!/ ధర్మనియతిలేని రాజ్యంలో/ రాజు ఎవడైతేనేం/ కన్నీళ్లు కార్చాల్సింది/ నిరుపేద నిర్భాగ్యులే’.
 ‘అనువాదం అనేది ఒక సాలెగూడు అల్లికను మరో సాలెగూడు అల్లికగా మార్చడమే. అనువాదంలో మూలంలోని నుడికారం కొంత నష్టమవుతుంది. ఈ అనువాదంలో ఆ నష్టమేమి కనిపించకపోగా అనువాదకుడు కవీ, భావుకుడూ కూడా కాబట్టి మరింత పుష్టమైందనే భావించవచ్చు’ అని దీనికి రాసిన ముందుమాటలో ఎన్.గోపి ప్రశంసించారు.
 - పి. శివశంకర్
 
 నిదరోడు చంద్రుడు
 ఊహలకు రెక్కలు
 కత్తిరించి
 కాయితమ్మీదకి
 ఎంతగా
 నది ఊయలూపినా
 నిద్దరోడు చంద్రుడు
 మూగ చినుక్కి
 స్వరాలద్దుతోంది
 ప్రకృతి
 పతనంలోనూ
 ఎంతందం
 జలపాతం
 కన్రెప్పలు మూస్తే
 ఏదీ
 అంత పెద్ద ప్రపంచం
 లోపల నేను
 బైట ప్రపంచం
 కిటికీ రాయబారం
 - గోపరాజు రాధాకృష్ణ
 9948823500

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement