తెలుగు సాహితీ ప్రముఖుల పేరు మీద కూడా ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ, దేవకొండ బాలగంగాధర తిలక్, ఆరుద్రల దగ్గర నుంచి వేటూరి వరకూ అనేక మంది దివంగత రచయితలు, భావుకుల పేరుతో ఫేస్‌బుక్ పేజ్‌లున్నాయి. వీటిల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఉంటాయి. పుస్తకాల్లో ఉండిపోయిన ఆయా రచయితల భావనలను ఈ ఫేస్‌బుక్ పేజెస్ ద్వారా డిజిటలైజ్ చేస్తున్నారు అభిమానులు.
పూల సౌరభం గాలి వీస్తున్నవైపే వ్యాపిస్తుంది. మహనీయుల గొప్పతనపు పరిమళాలు అన్ని దిక్కులా విస్తరిస్తాయి. తరాలు మారిన వాటి సువాసన తగ్గదు. అందుకు నిదర్శనం కొన్ని ఫేస్‌బుక్ పేజీలు! శాస్త్రం, వ్యక్తిత్వం, వేదాంతం, రాజకీయం, పోరాటం ఈ రంగాల్లోని ఎంతో మంది మహనీయులు ఈ తరం వాళ్లు కాదు. అయితే వారి మాటల్లోని స్ఫూర్తి ఒక నిరంతర ధార. అది ఇప్పుడు సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో కూడా కొనసాగుతోంది. దివంగతులు అయిన అనేక మంది ప్రముఖుల పేరుతో ఫేస్‌బుక్ పేజ్‌లున్నాయి. వారి తత్వాన్ని బోధిస్తూ స్ఫూర్తిని పంచుతున్నాయి.
వినోద ప్రపంచంలో విహారానికి అవకాశం ఇస్తున్న ఫేస్‌బుక్‌లో తరచి చూస్తే జ్ఞానం, విజ్ఞానాలను బోధించే పేజ్‌లెన్నో ఉన్నాయి. వాటిని లైక్ చేస్తే చాలు ఎన్నో ఆసక్తికరమైన పోస్టులు పలకరిస్తాయి. వాటి నిర్వహణ, వాటికి లభిస్తున్న ఆదరణ ఒక ఆసక్తికరమైన సామాజిక పరిణామం. సోక్రటీస్, అర్టిస్టాటిల్, మార్క్‌ట్వెయిన్, షేక్‌స్పియర్, టాల్‌స్టాయ్, శ్రీశ్రీ, తిలక్, ఆస్కార్ వైల్డ్ వంటి మహనీయులు మరణించి ఏ లోకంలో ఉన్నారో కానీ... వారి పేరు మీదున్న ఫేస్‌బుక్ పేజ్‌లు మాత్రం వారి వారి తత్వాలను తట్టి చెబుతున్నాయి. హ్యూమరిజాన్నీ, హ్యూమనిజాన్నీ పంచుతున్నాయి.
మహనీయుల గురించి తలుచుకోవడం అంటే వాళ్ల జయంతి రోజున, వర్ధంతి రోజున మాట్లాడుకోవడం అనే ఒక మొక్కుబడి సంప్రదాయానికి విరామం ఇస్తున్నాయి ఈ పేజ్‌లు. వారి గురించి అనునిత్యం చెబుతూ, వారిని గుర్తు చేస్తున్నాయి. వారి మాటలు, వారి తత్వం మన నిత్య జీవితంలో పాటించదగినదన్న విషయాన్ని తట్టిచెబుతున్నాయి.
అనునిత్యం అప్‌డేట్స్ ఉంటాయి!
ఆయా ప్రముఖుల జీవితాల్లో జరిగిన ప్రముఖమైన సంఘటనల గురించి, వారు వివిధ సందర్భాల్లో చెప్పిన సూక్తులు, వారు గ్రంథస్తం చేసిన మాటలు, వారి వ్యక్తిగత పద్ధతులు, కష్టం వచ్చినప్పుడు వారు వ్యవహరించిన తీరు.. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ గొప్ప వాళ్ల జీవితం నుంచి, వారి తత్వం గురించి తెసుకోదగిన విషయాల గురించి ఇంగ్లిష్‌లో అప్‌డేట్స్ ఉంటాయి.
ఎవరు నిర్వహిస్తారు?
ప్రముఖులపై ఉన్న అభిమానమే ఇలాంటి పేజ్‌లకు ఊపిరిపోస్తోంది. ఆయా వ్యక్తుల అభిమానులు వీటిని నిర్వహిస్తున్నారు. వారి తత్వం గురించి వివరిస్తూ ఈ తరాన్ని ఎడ్యుకేట్ చేస్తూ గత స్ఫూర్తి చెరిగిపోకుండా చూస్తున్నారు. కొన్ని పేజ్‌లకు అనేక మంది అడ్మిన్స్ ఉంటారు.
ఆదరణ ఎలా ఉంది?
చాలా గొప్పగా ఉంది. ఈ పేజ్‌లకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. పోస్టులకు లైక్ కొడుతూ, వాటిని షేర్ చేసుకొంటూ వారిపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకొంటున్నారు.
పోరాటం, శాంతి సహనంల గురించి నెల్సన్‌మండేలా కోట్స్‌ను అందించే పేజ్‌కు దాదాపు 50 లక్షలమంది
అభిమానులున్నారు.విలియం షేక్‌స్పియర్ పేరు మీదున్న పేజ్‌కు 13 లక్షలమంది అభిమానులున్నారు.
విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేరు మీదున్న పేజ్‌కు పది లక్షల మంది ఫాలోయర్లున్నారు.
మహనీయం: వీళ్లూ ఫేస్‌బుక్‌లో ఉన్నారు...!
Published Sun, May 11 2014 4:30 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement