‘మానవ జీవితమే ఒక మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం/ నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే/ ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే’– ‘కురుక్షేత్రం’ చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన పాట ఇది. మానవ జీవితాన్నే మహాభారతంగా, మంచి చెడుల నడుమ నిత్యం జరిగే ఘర్షణగా ఆయన అభివర్ణించాడు. కాలాలు మారినా, తరాలు మారినా మంచి చెడుల మధ్య జరిగే ఘర్షణ సమసిపోయే పరిస్థితులు లేవు. భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితులు ఉండవేమో! ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని కూడా అన్నాడు శ్రీశ్రీ. ప్రపంచంలో దుర్బలులను పీడించే బలవంతుల జాతి ఉన్నంత వరకు ఘర్షణలు తప్పవు. ఘర్షణలు ముదిరినప్పుడు యుద్ధాలూ తప్పవు. అందుకే తన ‘నా దేశం నా ప్రజలు’ అనే ‘ఆధునిక మహాభారతం’లో శేషేంద్ర ఇలా అంటారు: ‘పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి/ నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు/ నేను సత్యాగ్రాహిని/ నా గుండెల్లో బద్దలవు తున్న అగ్నిపర్వతం/ నా గొంతులో గర్జిస్తున్న జలపాతం’. ఎగుడు దిగుడు సమాజం ఉన్నంత వరకు మనుషులకు సంఘర్షణ తప్పదు. సంఘర్షణే ఊపిరిగా బతకక తప్పదు. అనాది నుంచి ఈ సంఘర్షణే సాహిత్యానికి ముడి సరుకు.
మన భారతీయ సాహిత్యంలో తొలినాటి కావ్యాలు రామాయణ, మహాభారతాలు. వాల్మీకి విరచిత రామాయణం ఆదర్శ జీవితానికి అద్దం పడుతుంది. వ్యాసుడు రచించిన మహాభారతం వాస్తవ ప్రపంచాన్ని కళ్లకు కడుతుంది. ఆధునిక సాహిత్యంలోనూ అనేక రచనలకు ప్రేరణగా నిలిచిన కావ్యాలు రామాయణ, మహాభారతాలు. రామాయణ, మహాభారత గాథల నేపథ్యంలో దాదాపు అన్ని భారతీయ భాష ల్లోనూ అనేక కథలు, నాటకాలు, నవలలు వెలువడ్డాయి. కొన్ని సినిమాలుగా తెరకెక్కాయి. మన తెలుగు సాహిత్యం మహాభారత అనువాదంతోనే మొదలైంది. నన్నయ మొదలుపెట్టిన మహా భారత అనువాదాన్ని తిక్కన, ఎర్రనలు వేర్వేరు కాలాల్లో పూర్తి చేశారు. తెలుగులో మాత్రమే కాదు, మన దేశంలోని అన్ని భాషల్లోనూ తొలినాటి కవులు రామాయణ, మహాభారతాలను కావ్యాలుగా రాశారు. మన పొరుగు భాష కన్నడంలో పంపన ‘విక్రమార్జున విజయం’ రాశాడు. ఇది ‘పంప భారతం’గా ప్రసిద్ధి పొందింది.
మహాభారతంలోనే కాదు, అమృతోత్సవ భారతంలోనూ అనేకానేక ఘర్షణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సంక్లిష్టమైన మానవ జీవితంలోని నిత్య ఘర్షణలను ప్రతిఫలించి, సమాజంలోని చెడును చెండాడి, మంచివైపు మొగ్గుచూపేదే ఉత్తమ సాహిత్యంగా కాలపరీక్షను తట్టుకుని తరతరాల వరకు మనుగడలో ఉంటుంది. కాలక్షేపం కోసం రాసే ఆషామాషీ రచనలు కాలప్రవాహంలో ఆనవాలే లేకుండా కొట్టుకుపోతాయి. ‘రచయిత తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను’ అన్నారు రావి శాస్త్రి. భాషా ప్రాంతాలకు అతీతంగా రచయితలకు ఈ ఎరుక ఉండి తీరాలి. అలాంటి ఎరుక కలిగిన రచయితలు మనకు చాలామందే ఉన్నారు. అయితే, వారిలో గుర్తింపు కొందరికే దక్కుతోంది. ఒక ఎరుక కలిగిన రచయితకు గుర్తింపు దక్కినప్పుడు సాహితీ లోకం సంబరపడుతుంది. సుప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్పకు ‘పద్మభూషణ్’ దక్కడం అలాంటి సందర్భమే!
ఆధునిక కన్నడ రచయితల్లో భైరప్పకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారత గాథ మర్మాలను విశదీకరిస్తూ, ఆనాటి ఆచారాలను, అంధ విశ్వాసాలను తుత్తునియలు చేస్తూ ఆయన రాసిన ‘పర్వ’ నవల ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ‘పర్వ’లో కోపోద్రిక్తురాలైన ద్రౌపది ‘ఆర్య ధర్మ మంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల సహవాసం, స్వయంవరం పేరుతో రాచకన్యలను అపహ రించి పెళ్లాడటం, కనీసం పదిమంది దాసీలనైనా పెళ్లి కానుకలుగా తెచ్చుకుని వాళ్లతో సుఖించడం’ అని నిరసిస్తుంది. ‘పర్వ’ నవలలో ఇదొక మచ్చుతునక మాత్రమే! ఇంత బట్టబయలుగా రాసేస్తే ఛాందసులు ఊరుకుంటారా? అందుకే, భైరప్పను కీర్తిప్రతిష్ఠలు వరించడంతో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి. ఆయన రాసిన ‘వంశవృక్ష’, ‘తబ్బలియు నీనాదె మగనె/ గోధూళి’ వంటి రచనలపైనా వివాదాలు రేగాయి. ‘వంశవృక్ష’ తెలుగులో ‘వంశవృక్షం’ పేరుతో బాపు దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. భైరప్ప 1996లో తన ఆత్మకథను ‘భిత్తి’ పేరుతో వెలుగులోకి తెచ్చారు. ఇది పదకొండు పునర్ముద్రణలను పొందింది. ఆయన నవలల్లో ‘దాటు’, ‘పర్వ’ వంటివి తెలుగులోనూ అనువాదం పొందాయి.
సంఘర్షణలమయమైన మహాభారతాన్ని ‘పర్వ’గా అందించిన భైరప్ప జీవితంలోనూ అనేక ఘర్షణలు ఉన్నాయి. బాల్యంలోనే తల్లి, సోదరులు ప్లేగు వ్యాధికి బలైపోయారు. చిన్నా చితకా పనులు చేసుకుంటూనే ఉన్నత చదువులు చదివి, అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. స్వయంగా అనుభవించిన సంఘర్షణల వల్ల జీవితంపై తనదైన దృక్పథాన్ని ఏర్పరచుకుని, రచనా వ్యాసంగం మొదలుపెట్టి, సాహితీరంగంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. సంఘర్షణలు రాటుదేల్చిన రచయిత చేసే రచనల్లో జీవన సంఘర్షణలు ప్రతిఫలిస్తాయి. అవి ఆ రచయిత రచనలను అజరామరం చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment