Indian literature
-
డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం!
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్.. -
ఆంగ్లంలోకి ఎత్తిపోయాలి!
అవార్డు వచ్చిందే అత్యుత్తమ రచన కాకపోవచ్చు. అత్యుత్తమ రచనలన్నింటికీ అవార్డులు రాకపోవచ్చు. కానీ అవార్డు వచ్చింది సాధారణంగా మంచి పుస్తకమే అయివుండొచ్చు. ఒకవేళ ఈ వాక్యాలతో ఏమైనా విభేదించే అవకాశం ఉన్నా, అవార్డు వచ్చిన పుస్తకం ఎంతోకొంత ఆసక్తి కలిగింపజేస్తుందనే విషయంలో మాత్రం ఏ విభేదం లేదు. అవార్డు ఎంత పెద్దదైతే, అంత ఆసక్తి. ఆ భారీతనం వరుస సంవత్సరాలుగా ఇస్తుండటం వల్ల వచ్చిన ప్రతిష్ఠరూపంలో ఉండొచ్చు, లేదా పారితోషికం రూపంలో ఉండొచ్చు. ఏమైనా ప్రస్తుతం, ‘భారతదేశపు అత్యంత విలువైన సాహిత్య బహుమానం’గా ‘జేసీబీ ప్రైజు’ను పేర్కొంటున్నారు. అక్షరాలా ఈ పురస్కార విలువ పాతిక లక్షల రూపాయలు. గొప్ప భారతీయ రచనలను ఉత్సవం చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పిన ‘ద జేసీబీ ప్రైజ్ ఫర్ లిటరేచర్’ ప్రత్యేకతలు ఏమంటే, ఇంగ్లిష్ రచనలకే బహుమానం ఇస్తున్నప్పటికీ, ఇంగ్లిష్ అనువాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం; ఇంకా ఆసక్తికరమైనది, ఒకవేళ అనువాద రచన బహుమానం గెలుచుకుంటే, అనువాదకులకు అదనంగా మరో పది లక్షలు ఇవ్వడం. ‘‘గతంలో ఒక కొత్త ఉర్దూ నవల విడుదలయ్యిందంటే– విద్యార్థులు, అధ్యాపకులు దాని గురించి చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు, దానికొక అవార్డు వచ్చి కొంత పాపులర్ అయితే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక ధోరణిలా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు జ్ఞానాన్ని సృష్టించేవి. ఇప్పుడవి కేవలం పంపిణీ చేస్తున్నాయి,’’ అంటారు ఉర్దూ నవలా రచయిత ఖాలిద్ జావేద్. 2022లో ‘ద ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్’ నవలకుగానూ ఆయన ‘జేసీబీ ప్రై జ్’ను స్వీకరించారు. ‘నేమత్ ఖానా’ పేరుతో వచ్చిన ఈ ఉర్దూ మూల నవలను బరన్ ఫారూఖీ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ఖాలిద్ ఆవేదన ఉర్దూ సాహిత్య రంగం గురించినదే అయినప్పటికీ అది దేశంలోని అన్ని భాషలకూ వర్తిస్తుంది. అందుకే అవార్డులు, పురస్కారాలు అనేవి సాహిత్యంలో ఎంతోకొంత ఊపును సృష్టించగలుగుతాయి. వాటి పరిమితులను మినహాయిస్తే, అదొక సానుకూలాంశం. అందువల్లే వంటిల్లు నేపథ్యంలో జరిగే అధికార క్రీడనూ... కత్తులు, మంట వంటి ప్రమాదకర ఆయుధాలను కలిగివుండే చోటునూ చిత్రించిన ఖాలిద్ ఉర్దూ నవల విస్తృత పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారగలిగింది.నిర్మాణ పనుల్లో; తవ్వకం, ఎత్తిపోత, కూల్చివేతల్లాంటి పనుల్లో వాడే ‘జేసీబీ’ గురించి మనకు తెలుసు. ఈ జేసీబీ అనేదే ఆ యంత్రానికి ఒక పేరులా స్థిరపడిపోయిందిగానీ అది ఒక సంస్థ పేరు. ఇంగ్లండ్ వ్యాపారవేత్త జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ (జేసీబీ) తన పేరుతోనే నెలకొల్పిన కంపెనీ ఈ జేసీబీ. 2018 నుంచి ఈ సంస్థ భారతీయ రచనలకు బహుమానాలు ఇస్తోంది. మార్చ్ నెలలో ఎంట్రీలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్ 30 ఈ యేటి ఎంట్రీలు పంపడానికి ఆఖరి తేది. వారి వెబ్సైట్లో అన్ని వివరాలూ లభిస్తాయి. కథలు, కవిత్వ సంపుటాలు కాకుండా ‘యూనిఫైడ్ వర్క్’ మాత్రమే దీనికి పంపాలి. సాధారణంగా సెప్టెంబర్‌లో లాంగ్ లిస్ట్ విడుదలవుతుంది. అంటే వచ్చిన రచనల్లో తొలి వడపోతలో మిగిలిన పదింటిని ప్రకటిస్తారు. అక్టోబర్‌లో షార్ట్ లిస్ట్ వస్తుంది. అప్పటికి ఐదు నవలలు తుది పోటీలో ఉంటాయి. నవంబర్‌లో విజేతను ప్రకటిస్తారు. దీనికిగానూ ప్రతి యేటా ఒక స్వతంత్ర జ్యూరీ ఏర్పాటు అవుతుంది. ఇప్పటికి మూడు సంవత్సరాలు ముగ్గురు మలయాళ రచయితలు ఈ బహుమానం గెలుచుకోవడం విశేషం. మలయాళ చిత్ర పరిశ్రమలాగే, మలయాళ సాహిత్యం కూడా వర్ధిల్లుతోందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. కాదు, మలయాళ సాహిత్యం వర్ధిల్లుతున్నందుకే మలయాళ చిత్రసీమ వర్ధిల్లుతున్నదని అనాలేమో! తన ‘జాస్మిన్ డేస్’ నవలకుగానూ బెన్యామిన్ 2018లో ‘జేసీబీ’ తొలి బహుమానాన్ని గెలుచుకున్నారు. దీన్ని షెహనాజ్ హబీబ్ ఆంగ్లంలోకి అనువదించారు. 2020 సంవత్సరానికి ‘ముస్టాష్’ నవలకుగానూ ప్రైజ్ గెలుచుకున్న ఎస్.హరీశ్ ఇటీవలి మలయాళ కళాఖండం అనదగిన సినిమా ‘నన్ పగల్ నేరత్తు మయక్కమ్’(పగటి వేళ మైకం)కు రచయిత కావడం విశేషం. హరీశ్ తన నవలను ‘మీస’ పేరుతో తన మాతృభాషలోనే రాశారు. అది ఆయన తొలి నవల కూడా. 2021లో మరో మలయాళ నవల ‘ఢిల్లీ: ఎ సాలిలాక్వీ’ని కూడా ఈ ప్రైజ్ వరించింది. రచయిత ఎం.ముకుందన్ . 2019లో ‘ద ఫార్ ఫీల్డ్’ నవలకుగానూ మాధురీ విజయ్ గెలుచుకున్నారు. ఈమె కర్ణాటకకు చెందినవారు. కానీ ఆంగ్లంలో రాస్తారు. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయిగానీ ఈ ఐదేళ్లలో ఏ ఒక్క తెలుగు పుస్తకం షార్ట్‌లిస్టు అటుండనీ, లాంగ్‌లిస్టులోకి కూడా రాలేదు. అసలు ఏ ఒక్కటైనా పోటీకి పంపారా అన్నదీ అనుమానమే. అంతకంటేముందు అసలు ఏ పుస్తకాలైనా ఇంగ్లిష్‌లోకి వెళ్తున్నాయా? పోనీ, వెళ్లాల్సినంతగా వెళ్తున్నాయా? అసలు మొత్తంగానే తెలుగు నవల భారతీయ పాఠకుల మనస్సులు గెలుచుకునేంత కళాత్మకంగా ఉంటోందా? ఉంటే, దాన్ని ఇంగ్లిష్‌లోకి చేర్చడంలో ఉన్న అడ్డంకులేమిటి? ఈ బహుమానం అనే కాదు, మన విలువను కట్టడానికి మరొకటైనా పరమ ప్రమాణం కాకపోవచ్చు. కానీ ఆ ‘గేమ్’లో మనం అసలంటూ ఎందుకు లేము? దక్షిణాది వరకే పరిమితం అయితే– కన్నడ, తమిళం, మలయాళం అనగానే కొందరు రచయితల పేర్లయినా జాతీయ స్థాయిలో తెలుస్తాయి. అలా తెలిసే తెలుగు రచయితలు ఎవరున్నారు, ఎందరున్నారు? ఇలాంటివి జరగాలంటే ఎలాంటి సంస్థలు, వ్యవస్థలు చొరవ చూపాలి? ఇవన్నీ మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. సావధానంగా జవాబులు వెతుక్కోవాల్సిన ప్రశ్నలు! -
సంఘర్షణ పర్వం
‘మానవ జీవితమే ఒక మహాభారతం/ అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం/ నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే/ ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే’– ‘కురుక్షేత్రం’ చిత్రం కోసం శ్రీశ్రీ రాసిన పాట ఇది. మానవ జీవితాన్నే మహాభారతంగా, మంచి చెడుల నడుమ నిత్యం జరిగే ఘర్షణగా ఆయన అభివర్ణించాడు. కాలాలు మారినా, తరాలు మారినా మంచి చెడుల మధ్య జరిగే ఘర్షణ సమసిపోయే పరిస్థితులు లేవు. భవిష్యత్తులోనూ అలాంటి పరిస్థితులు ఉండవేమో! ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని కూడా అన్నాడు శ్రీశ్రీ. ప్రపంచంలో దుర్బలులను పీడించే బలవంతుల జాతి ఉన్నంత వరకు ఘర్షణలు తప్పవు. ఘర్షణలు ముదిరినప్పుడు యుద్ధాలూ తప్పవు. అందుకే తన ‘నా దేశం నా ప్రజలు’ అనే ‘ఆధునిక మహాభారతం’లో శేషేంద్ర ఇలా అంటారు: ‘పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి/ నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు/ నేను సత్యాగ్రాహిని/ నా గుండెల్లో బద్దలవు తున్న అగ్నిపర్వతం/ నా గొంతులో గర్జిస్తున్న జలపాతం’. ఎగుడు దిగుడు సమాజం ఉన్నంత వరకు మనుషులకు సంఘర్షణ తప్పదు. సంఘర్షణే ఊపిరిగా బతకక తప్పదు. అనాది నుంచి ఈ సంఘర్షణే సాహిత్యానికి ముడి సరుకు. మన భారతీయ సాహిత్యంలో తొలినాటి కావ్యాలు రామాయణ, మహాభారతాలు. వాల్మీకి విరచిత రామాయణం ఆదర్శ జీవితానికి అద్దం పడుతుంది. వ్యాసుడు రచించిన మహాభారతం వాస్తవ ప్రపంచాన్ని కళ్లకు కడుతుంది. ఆధునిక సాహిత్యంలోనూ అనేక రచనలకు ప్రేరణగా నిలిచిన కావ్యాలు రామాయణ, మహాభారతాలు. రామాయణ, మహాభారత గాథల నేపథ్యంలో దాదాపు అన్ని భారతీయ భాష ల్లోనూ అనేక కథలు, నాటకాలు, నవలలు వెలువడ్డాయి. కొన్ని సినిమాలుగా తెరకెక్కాయి. మన తెలుగు సాహిత్యం మహాభారత అనువాదంతోనే మొదలైంది. నన్నయ మొదలుపెట్టిన మహా భారత అనువాదాన్ని తిక్కన, ఎర్రనలు వేర్వేరు కాలాల్లో పూర్తి చేశారు. తెలుగులో మాత్రమే కాదు, మన దేశంలోని అన్ని భాషల్లోనూ తొలినాటి కవులు రామాయణ, మహాభారతాలను కావ్యాలుగా రాశారు. మన పొరుగు భాష కన్నడంలో పంపన ‘విక్రమార్జున విజయం’ రాశాడు. ఇది ‘పంప భారతం’గా ప్రసిద్ధి పొందింది. మహాభారతంలోనే కాదు, అమృతోత్సవ భారతంలోనూ అనేకానేక ఘర్షణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సంక్లిష్టమైన మానవ జీవితంలోని నిత్య ఘర్షణలను ప్రతిఫలించి, సమాజంలోని చెడును చెండాడి, మంచివైపు మొగ్గుచూపేదే ఉత్తమ సాహిత్యంగా కాలపరీక్షను తట్టుకుని తరతరాల వరకు మనుగడలో ఉంటుంది. కాలక్షేపం కోసం రాసే ఆషామాషీ రచనలు కాలప్రవాహంలో ఆనవాలే లేకుండా కొట్టుకుపోతాయి. ‘రచయిత తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను’ అన్నారు రావి శాస్త్రి. భాషా ప్రాంతాలకు అతీతంగా రచయితలకు ఈ ఎరుక ఉండి తీరాలి. అలాంటి ఎరుక కలిగిన రచయితలు మనకు చాలామందే ఉన్నారు. అయితే, వారిలో గుర్తింపు కొందరికే దక్కుతోంది. ఒక ఎరుక కలిగిన రచయితకు గుర్తింపు దక్కినప్పుడు సాహితీ లోకం సంబరపడుతుంది. సుప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్పకు ‘పద్మభూషణ్’ దక్కడం అలాంటి సందర్భమే! ఆధునిక కన్నడ రచయితల్లో భైరప్పకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారత గాథ మర్మాలను విశదీకరిస్తూ, ఆనాటి ఆచారాలను, అంధ విశ్వాసాలను తుత్తునియలు చేస్తూ ఆయన రాసిన ‘పర్వ’ నవల ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ‘పర్వ’లో కోపోద్రిక్తురాలైన ద్రౌపది ‘ఆర్య ధర్మ మంటే వేట, తాగడం, జూదం, ఆడవాళ్ల సహవాసం, స్వయంవరం పేరుతో రాచకన్యలను అపహ రించి పెళ్లాడటం, కనీసం పదిమంది దాసీలనైనా పెళ్లి కానుకలుగా తెచ్చుకుని వాళ్లతో సుఖించడం’ అని నిరసిస్తుంది. ‘పర్వ’ నవలలో ఇదొక మచ్చుతునక మాత్రమే! ఇంత బట్టబయలుగా రాసేస్తే ఛాందసులు ఊరుకుంటారా? అందుకే, భైరప్పను కీర్తిప్రతిష్ఠలు వరించడంతో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి. ఆయన రాసిన ‘వంశవృక్ష’, ‘తబ్బలియు నీనాదె మగనె/ గోధూళి’ వంటి రచనలపైనా వివాదాలు రేగాయి. ‘వంశవృక్ష’ తెలుగులో ‘వంశవృక్షం’ పేరుతో బాపు దర్శకత్వంలో సినిమాగా వచ్చింది. భైరప్ప 1996లో తన ఆత్మకథను ‘భిత్తి’ పేరుతో వెలుగులోకి తెచ్చారు. ఇది పదకొండు పునర్ముద్రణలను పొందింది. ఆయన నవలల్లో ‘దాటు’, ‘పర్వ’ వంటివి తెలుగులోనూ అనువాదం పొందాయి. సంఘర్షణలమయమైన మహాభారతాన్ని ‘పర్వ’గా అందించిన భైరప్ప జీవితంలోనూ అనేక ఘర్షణలు ఉన్నాయి. బాల్యంలోనే తల్లి, సోదరులు ప్లేగు వ్యాధికి బలైపోయారు. చిన్నా చితకా పనులు చేసుకుంటూనే ఉన్నత చదువులు చదివి, అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. స్వయంగా అనుభవించిన సంఘర్షణల వల్ల జీవితంపై తనదైన దృక్పథాన్ని ఏర్పరచుకుని, రచనా వ్యాసంగం మొదలుపెట్టి, సాహితీరంగంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. సంఘర్షణలు రాటుదేల్చిన రచయిత చేసే రచనల్లో జీవన సంఘర్షణలు ప్రతిఫలిస్తాయి. అవి ఆ రచయిత రచనలను అజరామరం చేస్తాయి. -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
ప్రశ్నించడమే దళిత కవిత్వం...
సంభాషణ: తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ భారతీయ సాహిత్యంలో దళిత కవిత్వపు అధ్యాయం 1960లలో మహారాష్ట్రలో ప్రారంభమైంది. తరువాతి దశాబ్దాలలో కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో విస్తరించింది. ఈ నేపథ్యంలో 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజీ అనే మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని అమానుషంగా హింసించి, హత్యచేసిన వైనం మరాఠీయులకు తెలిసింది ఒక తెలుగు కవి వల్ల. అతడి పేరు విల్సన్ సుధాకర్ తుల్లిమిల్లి. ఆయన తెలుగులో రాసిన కవిత ‘సూది బెజ్జంలో ఒంటెలు’ గురించి తెలుగు మిత్రులద్వారా తెలుసుకున్న మహారాష్ట్ర దళితులు ‘ఖైర్లాంజీ’ సంఘటనపై ఉద్యమించారు. ఏలూరులో హైస్కూల్ విద్య, విజయవాడలో డిగ్రీ, మనీలాలో ఎం.బి.ఎ చదివిన విల్సన్ సుధాకర్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో డెరైక్టర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నారు. దళిత వ్యాకరణం, మాకూ ఒక భాష కావాలి కవితా సంకలనాలు రచించిన విల్సన్ సుధాకర్‌ను ‘దళిత కవిత్వపు వెలుగు రవ్వ’గా అభిమానులు అభివర్ణిస్తారు. సుధాకర్‌తో సంభాషణా సారాంశం: తెలుగునేలపై ఆధునిక దళిత కవిత్వం తొలిదశ బాధను చెప్పుకోవడానికి పరిమితమైంది. ‘నన్నెంతో ప్రేమించే అమ్మా వెళ్లిపోయావా...’ తరహాలో కవిత్వాలు వచ్చేవి. ‘మమ్మల్ని అవమానిస్తే మేం ఊరుకోం. మావాళ్లను చంపేస్తే మేం సహించం, మీరు చేసే అకృత్యాలను అనుమతించబోం’ అని స్పష్టం చేసే తిరుగుబాటు కవిత్వం రెండవ దశ. ఇందుకు శ్రీకారం చుట్టింది గద్దర్. కారంచేడు సంఘటన నేపథ్యంలో ‘దళిత పులులమ్మా...’ అని ఆయన రాసిన కవిత్వం, పాడిన పాట తెలుగు దళిత సాహిత్యంలో మైలురాయి! దళితులు సైతం చైతన్యం పొందడం అనే మూడవ దశ చుండూరు సంఘటన నుంచి ప్రారంభమైంది. కవిత్వం ఏమి చేయగలదు? ఇప్పటికీ కొందరు దళిత కవిత్వం అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడమే దళిత కవిత్వం. ప్రశ్నించినందువలన ఏమిటి ఫలితం అంటారు మరికొందరు. ప్రశ్నించే కవిత్వం సమాధానాన్ని రాబడుతుంది. అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేలా చేస్తుంది. అలాంటి అనుభవాలు నా కవిత్వం ద్వారా చూశాను. ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తోన్న దళిత అధికారి కూడా అంటరానితనానికి గురయ్యే వాస్తవికతను ‘సవర్ణ దీర్ఘసంధి’ అనే కవితలో రాశాను. మీ కవిత ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని అనేకులు ఫోన్ చేశారు. పదవతరగతి టాపర్ అయిన బాలికను ఆమె తల్లిని కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి, బాలిక అన్నను అందుకు పురికొల్పారు ఆధిపత్యకులాలవారు. ఖైర్లాంజీలో జరిగిన ఈ దుర్మార్గాన్ని విన్న వెంటనే నేను కవిత రాశాను. అది మరాఠీలోకి, ఇతర భాషల్లోకి అనువాదమైంది. ఆ తర్వాతే అక్కడ ఉద్యమం రగిలింది. కవిత్వం ఏమి చేయగలదు అనేందుకు స్వానుభవంలోని ఉదాహరణ ఇది. కవిత్వమే కదా తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసింది. ఇంటివారిని ఇంట్లోకి పిలుస్తారా? మత స్వేచ్ఛ ఉంది అని రాజ్యాంగంలో లిఖించుకుని ఆచరణలో మాత్రం తూట్లు పొడవడం ఎంతవరకు సబబు? పూర్వమతంలోకి మళ్లీ తీసుకురావడాన్ని ‘ఘర్‌వాపసీ’ అంటున్నారు. ఘర్ వాపసీ అంటే విదేశాల్లోని భారతీయులను వెనక్కు రప్పించడం! కాని మనదేశంలోనే ఉన్నవారిని వెనక్కు రప్పించడాన్ని ఘర్‌వాపసీ అంటున్నారు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? ‘మా మూలవాసుల నేల మాది కానప్పుడు వలస వాసులతో జీవనం సాగించలేం’ అనే అంతర్వాణిని వినరా! ప్రశ్నల దీపాలు వెలిగించండి తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిని చూసి మరొకరు మైనారిటీ వర్గాలు, మతాల పేరుతో ‘భవనాలు’ నిర్మిస్తామంటున్నాయి. ఆయా కులాల, సమూహాల పేరుతో భవనాలు నిర్మిస్తే సరా? గ్రామాల్లో ఆడబిడ్డలకు మరుగుదొడ్లు, స్నానాల గదులు ఎవరు నిర్మిస్తారు? చైనా తర్వాత అత్యధిక బౌద్ధారామాలున్న ప్రాంతంలో కొత్తరాష్ట్ర రాజధానిని నిర్మిస్తూ దానికి పెట్టే పేరు కోసం బుద్ధుని పేరును విస్మరించడం రాజకీయమా? మతిమరుపా? ఇక్కడ పేదలకిచ్చిన పట్టాభూములను సైతం స్వాధీనం చేసుకునే రీతిలో రాజధాని జైత్రయాత్ర సాగుతోంది. రిజర్వేషన్లకు మంగళం పాడుతూ ప్రభుత్వ సంస్థలను మూసేస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల ఊసే లేదు. చదువుకున్న యువత నైరాశ్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దళితకవి ప్రశ్నల దీపాలు వెలిగించాలి. తరతరాల బాధాతప్తులకు కావాల్సిందిప్పుడు భవనాలు కాదు! భువనం! రాజ్యాధికారం! - పున్నా కృష్ణమూర్తి