పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్‌లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు.
సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్‌లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్‌పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment