స్వాధీనపరచుకున్న ఎల్రక్టానిక్ పరికరాలు
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్‌ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌లపై వీరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్‌ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్‌కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్‌ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు.
తప్పుడు రేటింగ్‌లు చెబుతూ..
పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 మ్యాచ్‌లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్‌కు బదులు తప్పుడు రేటింగ్‌లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment