ఆయనకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు
న్యూఢిల్లీ: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపునకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఎయిమ్స్ కు చెందిన మెడికల్ బోర్డులోని ముగ్గురు వైద్యులు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితిపై తమకు తెలియజేయాలని చెప్పింది. రాజస్థాన్ లోని ఆశ్రమంలో ఉండగా ఓ మైనర్ పై ఆశారాం బాపు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ఆయనను 2013 సెప్టెంబర్ 2న పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉంచారు. దీంతో తనకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చికిత్స కోసం తనకు బెయిల్ ఇవ్వలంటూ రెండు రోజుల కిందట ఆయన రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యాధికారులకు సూచించింది.