ఆసారాం కేసు విచారణ ఆలస్యమెందుకు?
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు కేసులో నాలుగేళ్లు గడుస్తున్న విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు సోమవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేసి, కేసు వివరాలు పంపాలంటూ సర్వోన్నత ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో గాంధీనగర్ న్యాయస్థానం ఆసారాం బాపును విచారిస్తోన్న విషయం తెలిసిందే.
అతడు తనపై రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో లైంగిక దాడికి చేశాడంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాపు భూకబ్జా, హత్యాయత్నం కేసుల్లోనూ నిందితుడు. ఇతని కుమారుడు నారాయణ్ సాయి సైతం మరో అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నాడు.