రేప్ కేసు: ఆసారాంకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో అరెస్టై, మూడేళ్లుగా జైలులోనే ఉంటున్న ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆసారాం బాపునకు సుప్రంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనారోగ్య కారణాలు చూపుతూ ఆసారాం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. కాగా, బెయిల్ కోసం ఆసారాం దాఖలుచేసిన పత్రాలు నకిలీవని తేలడంతో కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.1లక్ష జరిమాన విధిస్తూ, ఆసారాంపై మరో కేసు పెట్టాలని పోలీసులకు సూచించింది.
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో గల తన ఆశ్రమంలో 72 ఏళ్ల ఆసారాం.. 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారనే విషయం 2013లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు ఆసారంను అరెస్ట్‌చేసిన పోలీసుల ఆయనను జోథ్‌పూర్‌జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయనపై మరో అత్యాచారం కేసు కూడా నమోదయింది. వృద్ధుడైన ఆసారాం జైలులో పలుమార్లు అస్వస్థతకు గురై బెయిల్ కోసం పలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అవన్నీ తిరస్కరణకు గురికావడంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి అత్యున్నత స్థానం కూడా ఆసారం అభ్యర్థనను మన్నించలేదు.
(హవ్వ.. ఆసారాం మహాత్ముడట!)