ఆశారాం కేసుపై సుప్రీం ఆరా
న్యూఢిల్లీః వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై నమోదైన అత్యాచార కేసు విచారణలో విపరీత జాప్యం పట్ల గుజరాత్ సర్కార్‌ను సుప్రీంకోర్టు నిలదీసింది. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారిస్తూ ఈ కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ‘ఈ కేసులో ఎందుకింత జాప్యం జరుగుతున్నది..బాధితురాలిని ఇంతవరకూ ఎందుకు ప్రశ్నించలేద’ని గుజరాత్ ప్రభుత్వంపై కోర్డు మండిపడింది. సూరత్‌లోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల స్కూల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 2013 ఆగస్టు నుంచి ఆథ్మాతిక గురువు ఆశారాం రాజస్థాన్‌లోని జైలులో ఉన్నారు.
గాంధీనగర్‌లోని న్యాయస్థానంలో సాగుతున్న కేసు విచారణలో ఆశారాం తీరుతోనే జాప్యం జరుగుతున్నదని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. కేసులో ఇంతవరకూ పలువురి సాక్ష్యాలు నమోదు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆశారాంకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం నిరాకరించింది.